ఆర్టీసీలో కానరాని "ఠీవీ"

16 Oct, 2017 11:42 IST|Sakshi

లగ్జరీ సర్వీసుల్లో అటకెక్కిన టీవీల నిర్వాహణ

దూర ప్రాంత ప్రయాణికులకు వినోదం కరువు

ప్రైవేటు వ్యక్తులకు కాంట్రాక్టు

ప్రయాణికుల్లో తీవ్ర అసంతృప్తి

బహుదూరం వెళ్లే ప్రయాణికులకు వినోదం కరువైంది. ఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యార్థం లగ్జరీ సేవల్లో భాగంగా సుదూర ప్రాంతాలకు ప్రయాణించే వారికోసం సూపర్‌ లగ్జరీ బస్సుల్లో ఏర్పాటు చేసిన టీవీల ప్రక్రియ ఇక్కడ అటకెక్కింది.  వినోదం కోసమంటూ టికెట్‌ రూపంలో ప్రయాణికుల నుంచి చార్జీ వసూలు చేస్తూ టీవీ మాత్రం ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు చిర్రెత్తుత్తున్నారు. ఇటీవలే కర్నూలు నుంచి హైటెక్‌ బస్సులో తిరుపతికి వెళ్లే ప్రయాణికులు ఆందోళనకు దిగారు. దూర ప్రాంత సర్వీసులో వినోదం లేకపోతే ఎలా ప్రయాణించాలంటూ అధికారులను నిలదీశారు. కర్నూలు కొత్త బస్టాండ్‌లో జరిగిన ఈ ఘటనతో కళ్లు తెరచిన అధికారులు ఆగమేఘాల మీద టీవీ సౌకర్యం ఉన్న వేరే సర్వీసును ఏర్పాటు చేసి పంపారు.

కర్నూలు(రాజ్‌విహార్‌): రోడ్డు రవాణా సంస్థ కర్నూలు రీజియన్‌ బస్సుల్లో టీవీ (టెలివిజన్‌)ల నిర్వాహణ అటకెక్కింది. అధికారుల అలసత్వం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా ప్రయాణికులకు వినోదం కరువైంది. టెండర్ల ద్వారా ప్రైవేటు కాంట్రాక్టరు చేతిలో పెట్టిన ఆర్టీసీ వాటిపై పర్యవేక్షణ మరిచింది. ఒక్కో బస్సుకు నెలనెలా రూ.2,500 చెల్లిస్తున్నా సరైన సేవలు అందడం లేదు. ఫలితంగా దూర ప్రాంత ప్రయాణికులు వినోదాన్ని పొందలేకపోతున్నారు. సూపర్‌ లగ్జరీ (హైటెక్‌), కొన్ని అల్ట్రా డీలక్స్‌ బస్సుల్లో టీవీల నిర్వాహణ జిల్లా వ్యాప్తంగా అస్తవ్యస్తంగా మారింది. ప్రారంభంలో సంస్థే నేరుగా టీవీలను ఏర్పాటు చేసి సీడీ, డీవీడీ ప్లేయర్ల ద్వారా సినిమా ప్రదర్శన చేసేవారు. ఒకప్పుడు వీటి కోసం ప్రత్యేకంగా నెలవారిగా వేతనం ఇచ్చి బాయ్‌ను కూడా నియమించారు. అయితే అది భారంగా మారడంతో బాయ్‌లను తొలగించి టీవీల నిర్వాహణ బాధ్యతలను డ్రైవర్లపైన పెట్టారు. బస్సు డ్రైవింగ్‌ చేయడం, టికెట్లు జారీ చేయడం, టీవీల సినిమా ప్రదర్శన బాధ్యతలు నిర్వహించడం ఇబ్బంది కావడంతో చేతులెత్తేశారు.

టెండర్ల ద్వారా కాంట్రాక్టర్ల చేతికి
టీవీల ఏర్పాటు, నిర్వాహణకు యాజమాన్యం 2015లో ఈ విధానాన్ని తెరపైకి తెచ్చింది. కాంట్రాక్టర్ల ద్వారా ఈ పని చేయించాలని టెండర్లు పిలిచింది. బస్సుల్లో టీవీలు ఏర్పాటు చేసి, సినిమా ప్రదర్శన, యూఎస్‌బీ, పెన్‌ డ్రైవ్‌ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వీటి కోసం ఒక్కొక్క బస్సుకి నెలకు రూ.2500 కాంట్రాక్టురుకు చెల్లిస్తారు.  

162 బస్సులకు టెండర్లు
జిల్లా వ్యాప్తంగా 11 డిపోల్లోని 162 బస్సుల్లో టీవీల ఏర్పాటుకు గతంలో చర్యలు చేపట్టారు. అందులో ఆదోని డిపోలో 15, డోన్‌ –4, కర్నూలు–1డిపో 30, 2డిపో 31, ఎమ్మిగనూరు 15, ఆళ్లగడ్డ 12, ఆత్మకూరు 11, బనగానపల్లె 8, కోవెలకుంట్ల 2, నందికొట్కూరు 6, నంద్యాల 28 బస్సులకు టెండర్లు పిలిచారు. అయితే, ఆదోని, బనగానపల్లె డిపోలకు ఎలాంటి స్పందనా రాలేదు. విడతల వారీగా టీవీలను ఏర్పాటు చేశారు.

అటకెక్కిన నిర్వాహణ: జిల్లాలోని బస్సుల్లో టీవీల నిర్వాహణ అటకెక్కింది. పాత టీవీలు కావడంతో పదేపదే రిపేరు రావడం, యూఎస్‌బీ, పెన్‌డ్రైవ్‌లు పాడవడంతో టీవీలు ఉన్నా అలంకారప్రాయంగా మారాయి. కాంట్రాక్టర్లు పట్టించుకోవడం లేదని సిబ్బంది వాపోతున్నారు.

టీవీల నిర్వాహణ సమస్యను పరిష్కరిస్తాం
దూర ప్రాంత బస్సుల్లో టీవీ ఏర్పాటు చేశాం. వాటి ఏర్పాటు, నిర్వాహణ బాధ్యతలు టెండర్ల ద్వారా ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించాం. అయితే వాటిలో రిపేరు సమస్య రావచ్చు. వీటిని మరోసారి పరిశీలించి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం. – రమేష్‌ బాబు, డీసీఎంఈ, కర్నూలు.

మరిన్ని వార్తలు