పెరిగిన పాజిటివ్‌ కేసులు

13 Apr, 2020 10:46 IST|Sakshi
నెల్లూరు నగరంలో రాత్రి పూట సైతం లాక్‌డౌన్‌ను పర్యవేక్షిస్తున్న భద్రతా దళాలు

జిల్లాలో మరో నలుగురికి 

52కి చేరిన కరోనా కేసులు  

జిల్లాలో ఆదివారం మరో నాలుగు పాజిటివ్‌ కేసులు పెరిగాయి. మూడు రోజులుగా ఒక్కటీ కూడా పాజిటివ్‌ కేసు నమోదు కాలేదు. తాజాగా కేసులు నమోదు కావడంతో జిల్లా అధికారులు అప్రమత్తం అయ్యారు. జిల్లా మొత్తం లాక్‌డౌన్‌ ప్రక్రియను పకడ్బంధీగా నిర్వహిస్తున్నారు. రెడ్‌జోన్లతో పాటు మిగతా ప్రాంతాల్లోనూ బ్లీచింగ్, సోడియం హైపోక్లోరైట్‌తో పారిశుధ్య చర్యలు చేపట్టారు. రెడ్‌జోన్లలో ఉదయం 9 గంటల వరకే ప్రజలను బయకు అనుమతిస్తున్నారు.

నెల్లూరు(అర్బన్‌): రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం సాయంత్రం ప్రకటించిన హెల్త్‌ బులెటిన్‌ ప్రకారం జిల్లాలో మరో నాలుగు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో కరోనా పాజిటివ్‌ బాధితుల సంఖ్య 52కి చేరింది. వీటిలో వాకాడు మండలం తిరుమూరు ఒకటి, తోటపల్లిగూడూరు మండలం నార్త్‌ ఆములూరు, నెల్లూరు నగరంలోని ఖుద్దూస్‌నగర్, నవాబుపేటలో ఈ కేసులు తాజాగా బయటపడ్డాయి. మూడు రోజులుగా జిల్లాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని ప్రజలు సంతోషించిన కొద్ది గంటల్లోనే తాజా ఫలితాలు ప్రజలను  ఆందోళనకు గురి చేశాయి. మళ్లీ క్రమంగా రోగుల సంఖ్య పెరుగుతోంది.  

సౌత్‌ఆములూరు మహిళకు పాజిటివ్‌ 
తోటపల్లిగూడూరు: మండలంలో ఆదివారం మరో కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. దీంతో మండలంలో ఈ కేసుల సంఖ్య రెండుకు చేరింది. మండలంలోని సౌత్‌ఆములూరులో విద్యుత్‌ శాఖ జేఎల్‌ఎంగా విధులు నిర్వహిస్తున్న నెల్లూరు కోటమిట్టకు చెందిన ఓ వ్యక్తికి ఈ నెల 2న కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో అధికారులు ఈ జేఎల్‌ఎంతో సన్నిహితంగా ఉండే సౌత్‌ఆములూరుకు చెందిన అతని అసిస్టెంట్, కుటుంబ సభ్యులను ఈ నెల 3న నెల్లూరు జీజీహెచ్‌లోని క్వారంటైన్‌కు తరలించి పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో జేఎల్‌ఎం వద్ద అసిస్టెంట్‌గా పని చేస్తున్న వ్యక్తి భార్యకు ఆదివారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో అధికారులు ప్రకటించారు.

దీంతో పాజిటివ్‌ వచ్చిన ఆ కుటుంబానికి చుట్టు పక్కల ప్రాంతాల్లోన్ని స్థానికుల్లో ఆందోళన మొదలైంది. జేఎల్‌ఎం, అతని అసిస్టెంట్లు విధి నిర్వహణలో భాగంగా సౌత్‌ఆములూరు, ముంగళదొరువు చాలా మందిని కలిసినట్లు తెలుస్తోంది. దీంతో వీరితో సన్నిహితంగా కలిసిన వారు కలవర పాటుకు గురవుతున్నారు. జేఎల్‌ఎం, అతని అసిస్టెంట్, అసిస్టెంట్‌ భార్య స్థానికంగా ఎంత మంది కలిశారనే వివరాలను సేకరించే ప్రక్రియలో అ«ధికారులు  ఉన్నారు. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. పాజిటివ్‌ వచ్చిన సౌత్‌ ఆములూరును రెడ్‌జోన్‌గా ప్రకటించి పూర్తిస్థాయిలో పారిశుధ్య చర్యలు చేపడుతున్నారు. వీధుల్లో బ్లీచింగ్‌ చల్లించడంతో పాటు సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు.    

12 ఏళ్ల చిన్నారికి పాజిటివ్‌ 
వాకాడు: మండలంలోని తిరుమూరులో ఆదివారం మరో కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. 12 ఏళ్ల చిన్నారికి పాజిటివ్‌ రావడం కలకలం రేపింది. ఇప్పటి వరకు మండలంలోని నవాబుపేటలో 3, తిరుమూరులో 3 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్న దృష్ట్యా ప్రజలెవ్వరు బయకురాకుండా లాక్‌డౌన్‌ను విధిగా పాటించాలని, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మరాదని ఎంపీడీఓ గోపీనాథ్‌ సూచించారు. 

నూరు శాతం శాంపిల్స్‌ సేకరణ 
నెల్లూరు(పొగతోట): హాట్‌ స్పాట్‌గా గుర్తించిన ప్రాంతాల్లో ప్రైమరీ, సెకండరీ కాంట్రాక్ట్‌కు సంబంధించిన శాంపిల్స్‌ సేకరణ నూరు శాతం పూర్తి చేయాలని కలెక్టర్‌ ఎంవీ శేషగిరిబాబు అధికారులను ఆదేశించారు. ఆదివారం డీఈఓసీలో కోవిడ్‌–19 ప్రత్యేక అధికారి కె. రామ్‌గోపాల్‌తో కలిసి కరోనా వైరస్‌ నియంత్రణకు చేపడుతున్న కార్యక్రమాలపై వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. కోటమిట్ట, మూలాపేట, ఖుద్దుస్‌నగర్‌ను హాట్‌ స్పాట్‌ ప్రాంతాలుగా గుర్తించామన్నారు. కంటైన్మెంట్‌ ప్రాంతాల్లో శాంపిల్స్‌ సేకరణ పటిష్టంగా జరగాలని సూచించారు. శాంపిల్స్‌ సేకరణతో పాటు సంబంధిత డేటాను ఆన్‌లైన్‌ సక్రమంగా నమోదు చేయాలన్నారు. క్వారంటైన్, ఐసొలేషన్‌ వార్డుల్లో చికిత్స పొందుతున్న వ్యక్తులను నిత్యం పర్యవేక్షిస్తూ వైద్య సేవలు అందించడంతో పాటు భోజన ఏర్పాట్లు సక్రమంగా చేయాలన్నారు. క్వారంటైన్‌ వార్డుల్లో ఒక రూమ్‌లో ఒక్కరు మాత్రమే ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు.

జీజీహెచ్‌ రీజనల్‌ కోవిడ్‌ సెంటర్‌గా, నారాయణ హాస్పిటల్‌ జిల్లా కోవిడ్‌ సెంటర్‌గా పనిచేస్తున్న నేపథ్యంలో ఆయా హాస్పిటల్స్‌కు అవసరమైన డాక్టర్లు, సిబ్బందిని తాత్కాలిక పద్ధతిలో నియామకం చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. సంబంధిత హాస్పిటల్స్‌తో పాటు, క్వారంటైన్‌ సెంటర్లకు రాబోయే 15 రోజులను దృష్టిలో ఉంచుకుని అవసరమైన పరికరాలు సమకూర్చేందుకు నివేదికలు అందజేయాలన్నారు. జీజీహెచ్‌కు అవసరమైన పరికరాల వివరాలు అందజేయాలని మెడికల్‌ సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. నగరంలో కంటైన్మెంట్‌ యాక్టివిటిని పటిష్టంగా అమలు చేయాలన్నారు. క్వారంటైన్‌ సెంటర్లలో మూడు షిప్‌్టల్లో పనిచేసే డాక్టర్లు, సిబ్బందిని కేటాయించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జేసీ డాక్టర్‌ వి వినోద్‌కుమార్, వైద్య ఆరోగ్య శాఖ జేడీ డాక్టర్‌ రాజేంద్రప్రసాద్, నుడా వైస్‌ చైర్మన్‌ బాపిరెడ్డి, డీఆర్‌డీఏ పీడీ వీకే శీనానాయక్, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ రాజ్యలక్ష్మి, జీజీహెచ్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రీహరి, ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సాంబశివరావు, నగరపాలక సంస్థ కమిషనర్‌ పీవీవీఎస్‌ మూర్తి పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు