కవలలు కన్నుతెరవకముందే కన్నతల్లి కన్నుమూత

11 Jun, 2020 13:37 IST|Sakshi
రిమ్స్‌ ఐపీ విభాగం వద్ద అధికారుల విచారణ

 ఖాదర్‌పల్లెలో అలముకున్న విషాదం

వైఎస్‌ఆర్‌ జిల్లా, చాపాడు: కవలలకు జన్మనిచ్చి ఓ తల్లి కన్నుమూసిన దయనీయ వైనమిది. మృతురాలి స్వగ్రామం చాపాడు మండలం ఖాదర్‌పల్లెలోవిషాదం నెలకొంది. దిగువ మధ్య తరగతికి చెందిన మృతురాలి(22) భర్త ..సోదరుడు ఉపాధి నిమిత్తం కువైట్‌లో ఉంటున్నారు. లాక్‌డౌన్‌ నిబంధనల వల్ల వారెవరూ ప్రస్తుతం ఇక్కడ లేరు. ఈమె తల్లిదండ్రులు..అత్తమామలు ఖాదర్‌పల్లెలోనే ఉంటున్నారు. గర్భిణీగా ఉన్న ఈమెను ప్రసవం కోసం కుటుంబ సభ్యులు ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చూపించారు. ఆరోగ్య పరిస్థితి సరిగా లేదని..రక్తస్రావం అధికంగా ఉందంటూ అక్కడి వైద్యులు చెప్పారు. దీంతో ఈనెల 4న కడపలోని రిమ్స్‌కు తరలించారు.

పరిస్థితి ఇబ్బందిగా ఉందని..వివిధ అనారోగ్య సమస్యలున్నట్లు రిమ్స్‌ వైద్యులు గుర్తించారు. ఈనెల 6న ఆమెకు శస్త్రచికిత్స చేశారు. కవలలు(ఇద్దరు మగబిడ్డలు)కు జన్మనిచ్చింది.అప్పటికే ఆమె పరిస్థితి విషమంగా తయారైంది. ప్రత్యేక గదిలో ఉంచి చికిత్స అందించినట్లువైద్యవర్గాల ద్వారా తెలిసింది. ఈ నేపథ్యంలో బుధవారం తెల్లవారుజామున కన్నుమూసింది. కన్ను తెరవని పసికందులను   చూడకుండానే ఆ తల్లి విగత జీవి అయ్యింది.   ఈ విషాద సంఘటన ఖాదర్‌పల్లెవాసుల హృదయాలను కదిలించింది. కవలల్ని ఆస్పత్రిలో ఉంచినట్లు సమాచారం. మృత దేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు అనుమతి లేకపోవటంతో ఆర్డీఓ నాగన్న, తహసీల్దారు శ్రీహరి ఆధ్వర్యంంలో బంధువుల సమక్షంలో కడపలోనే అంత్యక్రియులు నిర్వహించారు. ఇదిలా ఉండగా సాధారణంగా గర్భిణికి కరోనా పరీక్ష చేస్తారు. అదే విధంగా ఆమెకు పరీక్ష నిర్వహించగా పాజిటివ్‌ వచ్చినట్లు తెలిసింది. మృతురాలికి చెందిన 17మందిని కూడా అత్యవసరంగా క్వారంటైన్‌కు తరలించి పరీక్షలు నిర్వహించారు. అందరికీ నెగెటివ్‌ వచ్చింది. 

బాలింత మృతిపై అధికారుల విచారణ
కడప అర్బన్‌: బాలింత మృతి విషయం తెలిశాక ఆర్డీఓ మలోలా, కడప నగరపాలక సంస్థ కమిషనర్‌ లవన్న, డీఎస్పీ సూర్యనారాయణ, తహశీల్దార్‌ శివరామిరెడ్డిలు తమ సిబ్బంది బుధవారం ఐపీ విభాగానికి చేరుకున్నారు. ఆమె ఏ కారణం చేత మృతి చెందిందో డాక్టర్లను అడిగితెలుసుకున్నారు. మూడు సార్లు గుండెపోటు వచ్చినట్లు సమాచారం. మృతురాలి తండ్రి, బంధువుల స్టేట్‌మెంట్‌లను డాక్టర్లు తీసుకున్నారు. ప్రసవ సమయంలో శస్త్ర చికిత్స అనంతరం ఆరోగ్యం బలహీనమై ఉంటుందని కూడా వైద్యులు భావిస్తున్నారు. ప్రస్తుతం కవలలు ఎస్‌ఎన్‌సీయూలో చికిత్స పొందుతున్నారు. వారికి కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. ఫలితాలు రావాల్సి ఉంది.

ఏడాది తిరక్కమునుపే..
కుమార్తెకు, పొరుగున ఉండే ఫకృద్దీన్‌కు  గత ఏడాది ఆగస్టు 15న(స్వాతంత్య్ర దినోత్సవం రోజు) కావాలనే వివాహం జరిపించాను.  నాలుగునెలల తర్వాత  అల్లుడు గల్ఫ్‌కు జీవనోపాధి నిమిత్తం వెళ్లాడు. గర్భం దాల్చిన  కుమార్తెను మా దగ్గరే పెట్టుకుని బాగోగులు చూసుకునేవాళ్లం. ఈనెల 1,2 తేదీల్లో ప్రొద్దుటూరుకు వెళ్లాం.  కవలపిల్లలు, కాన్పు కష్టమని చెప్పారు. తరువాత రిమ్స్‌కు తీసుకుని వచ్చాం. ఈనెల 6న కవలపిల్లలకు జన్మనిచ్చింది. రక్తం తక్కువగా ఉందని..త్వరలో కోలుకుంటుందని డాక్టర్లు  చెప్పారు. ఇంతలోనే మృతి చెందింది. ఈ ఏడాది ఆగస్టు 15 రాకముందే మా అమ్మాయి అందరినీ విడిచి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.  –మృతురాలి తండ్రి కమాల్‌బాషా

మరిన్ని వార్తలు