అచ్చుగుద్దినట్టుగా..

22 Feb, 2019 08:09 IST|Sakshi

ఒకే పోలికలతో ముచ్చటగొలిపే కవలలు

ఒక్క బండార్లంకలోనే 40 మందికి పైగా ట్విన్స్‌

నేడు కవలల దినోత్సవం

బుడిబుడి నడకలతో ముద్దులొలికే ఓ బాబు లేదా పాప ఉంటే ఆ ఇంట్లో సందడే వేరు. అలాంటిది తనువులు వేరైనా దాదాపు ఒకే రూపం కలిగిన కవలలుంటే ఆ ఇంట నెలకొనే ఆనందమే వేరు. సినిమాల్లో ద్విపాత్రాభినయంలా ఒకే వయస్సు, ఒకే రూపం.. ఒకే అలవాట్లు.. ఒకే రకం దుస్తులతో వారు చేసే సందడికి ఆ ఇల్లే ఓ స్వర్గసీమలా మారిపోతుంది. రోజూ చూస్తున్నా వారిలో ఎవరు ఎవరో గుర్తు పట్టలేక చాలామంది అయోమయానికి గురవుతుంటారు. దీనిని తల్లిదండ్రులు, వారి బంధువులు తమాషాగా చూసి వినోదిస్తుంటారు. అలాంటి కవలలను కన్న తల్లిదండ్రుల ఆనందానికి అవధులే ఉండవు. ఫిబ్రవరి 22– కవలల దినోత్సవం సందర్భంగా అలాంటి కవలలను చూసొద్దాం రండి..

తూర్పుగోదావరి, అమలాపురం టౌన్‌: పట్టణంలోని మద్దాలవారిపేటకు చెందిన వాసంశెట్టి సుభాష్, లక్ష్మీ సునీత దంపతుల రెండేళ్ల కవల పిల్లలు సత్య దీవిత, సత్య దీక్షిత చూడముచ్చటగా కనిపిస్తారు. ఒకరు ఏది చేస్తే అదే రెండో అమ్మాయి చేస్తుంది. అలాగే పట్టణానికి చెందిన ఉబ్బన శ్రీనివాస్, నాగలక్ష్మి దంపతుల మూడేళ్ల కవల పిల్లలు అలేఖ్య, అమూల్యలదీ ఇదే ఒరవడి. స్టాంపు గుద్దినట్లుగా ఇద్దరూ ఒకే పోలికతో ఉంటారు. కట్టు, బొట్టు, వేషధారణ అంతా ఒకేలా ఉంటాయి. ఏదైనా ఇద్దరూ ఒకటే అడుగుతారు. ఒకే వస్తువును ఇష్టపడతారు. అందుకే ఆ తల్లిదండ్రులు వారికి ఏది కొన్నా ఒకే రకానివి కొని ఆనందిస్తారు.

ఊరంతా డబుల్‌ పోజే
అమలాపురం రూరల్‌: మండలంలోని బండార్లంక గ్రామంలో ఏకంగా 40 మందికి పైగా కవలలు ఉన్నారు. వారందరూ ఒకే కుటుంబానికి చెందినవారు కాదు. అయినప్పటికీ ఇంతమంది కవలలు ఒకే ఊళ్లో ఉండడం విశేషమే. ఈ ఒక్క గ్రామంలోనే ఐదు నుంచి 60 ఏళ్ల వయసు వరకూ కవలలున్నారు.

ట్రిపుల్స్‌
సాధారణంగా ఒకే రూపంలో ఉన్న ఇద్దరిని సాధారణంగా కవలలు అంటాం. కానీ గ్రామంలో రాగిరెడ్డి లక్ష్మణ్, రాము, మోహినీపుష్ప ఒక నిమిషం తేడాతో ఒకే రూపంతో జన్మించారు.

పెళ్లయినా వీడని బంధం
గ్రామంలో అరవయ్యేళ్ల అక్కచెల్లెళ్లు కాశిన లక్ష్మీరాజ్యం, యర్రా రామరాజ్యం ఉన్నారు. వీరికో ప్రత్యేకత ఉంది. ఇదే ఊరిలో పుట్టిన వీరు విడిపోకుండా ఆదే ఊరి సంబంధం చేసుకుని తోటికోడళ్లుగా పెళ్లి తరువాత కూడా కలిసే ఉంటున్నారు. కవలలుగా పుట్టినా పేగుబంధం విడిపోదని వీరంటున్నారు.

ఇంకా..
ఇదే గ్రామంలో పడవల రాంబాబు – లక్ష్మణరావు, ఇనుమర్తి రామభద్రరావు – లక్ష్మణరావు, చింతపట్ల హేమకిరణ్‌ – హేమచరణ్, చింతా కృష్ణప్రియ – వంశీకృష్ణ, దొమ్మేటి భాస్కర రామమణికంఠ – లక్ష్మీ వైష్ణవిశ్రీ, దానిరెడ్డి సాయిరాం – లక్ష్మణదుర్గ, కడి భాగ్యలక్ష్మి – భాగ్యలత రూపంలో ఒకేలా ఉంటారు. చేనేత కార్మికులైన పడవల రాంబాబు, లక్ష్మణరావులు అచ్చుగుద్దినట్టు ఒకే పోలికలో ఉండడంతో వారిని పోల్చుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. టీడీపీలో తిరిగే ఉప్పు రాంబాబు, లక్ష్మణరావులను గుర్తించడానికి ఆ పార్టీ నాయకులు కూడా తికమకపడుతుంటారు. కోలిపాక రాజశేఖర్‌ – రత్నకుమార్, చింతా మోహన్‌ – మనోభిశివరామ్, వసా రోహిత కుమార్‌ – రోజా, చొల్లింగి సుశీల – హరిత, లంకాడి కార్తికేయ – జి.రాయ్‌వర్మ, బండార్లంకలోని బాపూజీ పాఠశాలలో చదువుతున్న తేజశ్రీసాయి – తేజశ్రీశైల, లోహిత – రుచిత, పి.లక్ష్మి – సాయి ఒకే రకమైన పోలికలు కలిగి ఉంటారు.

రూపురేఖలు ఒకేలా..
పిఠాపురం రూరల్‌: మండలంలోని పి.దొంతమూరుకు చెందిన వైఎస్సార్‌ సీపీ మండల యూత్‌ అధ్యక్షుడు కొత్తపల్లి రమణబాబ్జీ, మాజీ సర్పంచి కొత్తపల్లి వెంకటలక్ష్మి దంపతుల రెండో సంతానంగా జన్మించిన కవలలు శ్రీరామ్‌శివ ప్రశాంత్, లక్ష్మణŠదుర్గ సుశాంత్‌లు రూపురేఖల్లో ఒకేలా కనిపిస్తారు. ఎనిమిదేళ్ల వయస్సున్న వీరిద్దరూ చిన్నప్పటి నుంచీ ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. ప్రస్తుతం వీరు పిఠాపురంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నారు. ఒకరు ఏడిస్తే కారణం లేకుండానే రెండో వారు అదే పని చేస్తారు. ఎక్కడికైనా ఇద్దరినీ కలిపే తీసుకెళ్లాలి. డ్రెస్, రూపంలోను ఒకేలా ఉన్న వీరిని చుట్టుపక్కలవారు ముచ్చటగా చూస్తూంటారు.

చూస్తే తికమకే..
కొత్తపేట: స్థానిక పాఠశాలల్లో అనేకమంది కవలలు చదువుతున్నారు. వాడపాలెం గ్రామానికి చెందిన చింతపల్లి పళ్ళంరాజు కుమారులు వినయ్‌ – వివేక్‌లు స్థానిక ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నారు. స్థానికంగా ఉన్న మరో పాఠశాలలో బండారు సాయిమణి యశస్విని – సాయినాగ మేఘశ్విని, రుద్రా ప్రణవ్‌ – ప్రణీత్, నల్లా సత్య ‘బ్రహ్మ’ హర్షకుమార్‌ – ‘విష్ణు’ మణికంఠ – ‘మహేశ్వరి’, కొప్పుల శరవణ్‌ – శశాంక్, గుమ్మడి అజయ్‌ – అశ్విన్‌లు ఒకే రూపాలతో చూసినవారిని తికమక పెడుతూంటారు.

ముద్దులొలికే బొమ్మల్లా కనిపిస్తున్న కవలలుసత్య దీవిత, సత్య దీక్షిత
కవలల దినోత్సవం ఎందుకంటే..
కొత్తపేట: పోలెండ్‌ దేశంలోని బర్గ్‌ పట్టణంలో 1919లో తొలిసారిగా మోజేష్, ఆరెన్‌ విల్‌కార్స్‌ అనే కవలలు జన్మించారు. ఆడుతూ పాడుతూ జీవిస్తున్న వారికి ఒకే సమయంలో ఒకే రకం వ్యాధి సోకి ఒకే రోజు ఫిబ్రవరి 22న మృతి చెందారు. ఈ సంఘటన ఆ దేశాన్ని కలచివేసింది. దీంతో ఆ దేశ నేతలు స్పందించి కవలలను కలకాలం గుర్తుంచుకునేవిధంగా ఆ పట్టణాన్ని అప్పటినుంచీ ‘ట్విన్స్‌బర్గ్‌’గా పిలిచారు. ఆ కవలలు మృతి చెందిన రోజును ప్రపంచ కవలల దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది.

మరిన్ని వార్తలు