కౌలుకు రాంరాం!

18 Jul, 2014 00:50 IST|Sakshi
కౌలుకు రాంరాం!
  • వర్షాభావం నేపథ్యంలో ముందుకురాని కౌలు రైతులు
  •  రేటు తగ్గించి, వడ్డీలేని రుణం ఇస్తామన్నా ససేమిరా
  •  సాగు ఆలస్యం నేపథ్యంలో తపానులతో నష్టమని భయం
  •  ఆందోళన చెందుతున్న భూయజమానులు
  • గుడివాడ : జిల్లా వ్యాప్తంగా వరిసాగయ్యే భూములు 6.34 లక్షల ఎకరాలు ఉన్నాయి. ఈ భూములను యజమానులతోపాటు, కౌలు రైతులు సాగుచేస్తుంటారు. జిల్లాలో 3.40 లక్షల మంది  కౌలు రైతులు ఉన్నారు. ఒకప్పుడు పొలాలను కౌలు తీసుకోవడానికి గుడివాడ, చల్లపల్లి, ఉయ్యూరు, కంకిపాడు తదితర డెల్టా ప్రాంతాల్లో కౌలు రైతులు పోటీపడేవారు. కొన్ని చోట్ల కౌలు మొత్తం ముందుగానే చెల్లించే వారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల్లో వ్యవసాయం చేసేందుకు కౌలు రైతులు ముందుకు రావడంలేదు.

    గుడివాడ నియోజకవర్గంలోనే దాదాపు 35వేల మంది కౌలు రైతులు ఉన్నారని అధికారుల అంచనా. కౌలు రైతులకు ప్రభుత్వం రుణార్హత కార్డులు ఇచ్చినా బ్యాంకర్లు మాత్రం అప్పు ఇవ్వడంలేదు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు, కాలువలకు నీళ్లు వస్తాయో రావో తేలియని పరిస్థితి కౌలు రైతులను ప్రశ్నార్థకంగా మార్చింది. దీంతో కౌలుకు తీసుకోవడానికి వెనుకడుగు వేస్తున్నారు.

    గుడివాడ ప్రాంతంలో ఎకరానికి గతేడాది 17 నుంచి 20 బస్తాలు కౌలు ఉండగా ఈ ఏడాది ఎకరానికి రెండు బస్తాలు కౌలు తగ్గిస్తామని యజమానులు చెబుతున్నారు. దీనికి తోడు ఎటువంటి వడ్డీ లేకుండా ఎకరానికి రూ.5వేల చొప్పున రుణం ఇస్తామని ఆశపెడుతున్నా కౌలుదారులు ముందుకు రావటం లేదు. ఏడాది మొదట్లో చేసుకున్న ఒప్పందాలను సైతం రైతులు ఇప్పుడు రద్దుచేసుకుంటున్నారు.
     
    ఒకొక్కరిది ఒక్కో కథ

    గుడివాడకు చెందిన శ్యామ్ పాలవ్యాపారం చేస్తుంటాడు. వ్యవసాయంపై ప్రేమ, లాభాలు వస్తాయన్న ఆశతో ఏటా 20 ఎకరాలు  కౌలు చేస్తున్నాడు. ఎకరానికి రూ.20 వేల చొప్పున పెట్టుబడులకు వెచ్చిస్తున్నాడు. రెండేళ్లుగా వరుస తుపానుల కారణంగా పెట్టుబడులు సం గతి దేవుడెరుగు అప్పులు తెచ్చి కౌలు చెల్లించాల్సి వచ్చింది. ఈ ఏడాది ఎకరం కూడా కౌలు చేయకూడదని ఒట్టుపెట్టుకున్నాడు.
     
    మోహన్‌రావుదీ అదే పరిస్థితి తన కుటుంబం మొత్తం ఒకరి వద్ద కూలికి వెళ్లే కంటే తన పొలంలోనే పనిచేసుకుంటే హుందాగా ఉంటుందని ఏళ్లతరబడి కౌలు వ్యవసాయం చేస్తున్నాడు. తుపానుల కారణంగా మూడేళ్లుగా ఒక్క గింజ మిగల్లేదు. వ్యవసాయంపై ప్రేమ చావక ఈ ఏడాది రెండు ఎకరాలే కౌలు చేయాలని నిర్ణయించాడు.
     
    గుడివాడ రూరల్ మండలానికి చెందిన నరసింహారావుదీ అదే పరిస్థితి. గతేడాది కంటే ఈఏడాది ఎకరానికి రెండు బస్తాల కౌలు తగ్గించి ఇవ్వాలని భూయజమాని చెప్పినా తనవల్ల కాదని కాడిపడేశాడు.  
     
     రెండు ఎకరాలే ఒప్పుకున్నా
     ఏటా ఏడెకరాలు కౌలు చేస్తున్నా. ఎప్పటికప్పుడు నష్టాలే మిగులుతున్నాయి. ఈ ఏడాది కౌలు చేయకూడదని నిర్ణయించుకున్నా. మమకారం చావక రెండు బస్తాలు కౌలు తగ్గిస్తానని రైతు చెబితే ఈ ఏడాది కేవలం రెండు ఎకరాలు మాత్రమే కౌలు చేస్తున్నా. ఈ ఏడాదీ వర్షాలు లేకపోవడంతో పంట  దిగుబడిపై అనుమానంతో ఎవరూ ముందుకు రావడం లేదు.
     - గూడపాటి మోహన్, గుడివాడ
     
     ఈ ఏడాది సాగు చేయడం లేదు
     ఏటా కౌలు చేయడం వల్ల నష్టాలు బారిన పడుతూనే ఉన్నాం. కౌలు చెల్లించలేక అప్పులపాలు అవుతున్నాం. ప్రభుత్వ రుణామాఫీ ఇంకా అమలు చేయలేదు. దీంతో ఈ బాధలు ఇక పడలేమని ఈ ఏడది కౌలు చేయడం మానేశాను. ప్రభుత్వం ఇప్పటికైన కళ్ళు తెరవకపోతే కౌలు వ్యవస్థ పూర్తిగా కనుమరుగవుతుంది.     
     - నిమ్మగడ్డ నాగశాస్త్రి, బిళ్లపాడు, గుడివాడ రూరల్ మండలం.
     
     సాగు నీరు ఆలస్యమైంది
     సాగు నీటి విడు దల ఆలస్యంగా వల్ల సార్వా సాగు చేయడం కష్టంగా మారింది. కాల యాపన కావడం వల్ల దిగుబడి  తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది కూడా ప్రభుత్వం సాగునీటిపై స్పష్టత ఇవ్వలేదు. ఈ సమయంలో వ్యవసాయం చేసినా నష్టాలు తప్ప మిగిలేది ఏమీ లేదు. అందువల్ల ఏడాది వ్యవసాయం మానేశా.    
     - కొండపల్లి రేణుకారెడ్డి, జనార్దనపురం, నందివాడ మండలం
     

>
మరిన్ని వార్తలు