‘తిరుమలలో రెండు బ్రహ్మోత్సవాలు’

31 Jul, 2018 16:46 IST|Sakshi

సాక్షి, తిరుమల: ఈ ఏడాది తిరుమల శ్రీవారి ఆలయంలో రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్‌కుమార్‌ సంఘాల్‌ వెల్లడించారు. సెప్టెంబర్‌ 12 నుంచి 21 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్‌ 9 నుంచి 18 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుపుతామని చెప్పారు. ఈ మేరకు మంగళవారం జరిగిన టీటీడీ ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. గత ఉత్సవాల్లో చోటుచేసుకున్న తప్పిదాలను దృష్టిలో పెట్టుకుని మెరుగైన ఏర్పాట్లు చేస్తామని అన్నారు. మాడ వీధుల్లో ఎల్‌ఈడీ తెరలను ఏర్పాటు చేస్తున్నామనీ, ఎన్డీఆర్‌ఎఫ్‌ బలగాల సేవలను సైతం బ్రహ్మోత్సవాల్లో వినియోగించుకుంటామని అన్నారు. ఆగస్టు 31 లోపు ఉత్సవాల ఏర్పాట్లు పూర్తి చేస్తామని స్పష్టం చెప్పారు. కాగా,టీటీడీ ఉన్నతస్థాయి సమావేశంలో కలెక్టర్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

వాహన సేవల్లో మార్పులు..
ఉత్సవాల్లో ఇబ్బందులు తలెత్తకుండా వాహన సేవల్లో మార్పులు చేశామని అనిల్‌కుమార్‌ చెప్పారు. శ్రీవారి వాహన సేవలు రాత్రి 8 గంటలకే ప్రారంభమవుతాయని అన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా 7 లక్షల లడ్డూలను నిల్వ చేశామని వెల్లడించారు. శ్రీవారికి గరుడ వాహన సేవ రోజున కొండపైకి ద్విచక్ర వాహనాలను అనుమతించబోమని అన్నారు. పిన్స్‌ సిస్టమ్‌, చైల్డ్‌ ట్యాగింగ్‌ సిస్టమ్‌ను ఈ ఏడాది కూడా అమలు చేస్తామని జిల్లా ఎస్పీ అభిషేక్‌ మహంతి తెలిపారు. పార్కింగ్‌ కోసం ప్రత్యేక యాప్‌ రూపొందించామనీ, బ్రహ్మోత్సవాలలో ఈ యాప్‌ను ప్రారంభిస్తామని తెలిపారు. 

మరిన్ని వార్తలు