రెండు బాల్యవివాహాలు నిలిపివేత

8 May, 2018 11:28 IST|Sakshi

కారంపూడి: జిల్లా కలెక్టర్‌ ఆదేశాలతో మండలంలోని నరమాలపాడు గ్రామంలో ఇద్దరు గిరిజన బాలికలకు త్వరలో జరగనున్న రెండు బాల్య వివాహాలను ఆపడానికి అధికారులు సోమవారం చర్యలు తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే గ్రామ శివార్లలోని ఎస్సీ కాలనీలో, వైకుంఠపురంలో ఇద్దరు బాలికలకు వివాహాలు చేయడానికి పెళ్లి ముహూర్తాలు పెట్టుకున్నారని కలెక్టర్‌కు సమాచారం అందింది. దీంతో కలెక్టర్‌ కారంపూడి తహసీల్దార్, గురజాల ఐసీడీఎస్, పోలీసు అధికారులను ఈ విషయమై చర్యలు తీసుకోవాలని తగిన ఆదేశాలిచ్చారు. సీడీపీవో బి. స్వరూపారాణి, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ బి. నాగేంద్రం వీఆర్వో అక్కుల శివారెడ్డి గ్రామానికి వెళ్లి పెళ్లికుమార్తెలు కానున్న బాలికల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు.

 పెళ్లిళ్లు నిలిపి వేస్తామని వారి నుంచి హామీ పత్రాలు తీసుకున్నారు. ఎస్సీ కాలనీకి చెందిన 14 ఏళ్ల బాలిక యాదల నాగలక్ష్మీకి జమ్మలమడుగు చెందిన వర్రె రాజేష్‌తో బుధవారం 9వ తేదీ వివాహం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే వైకుంఠపురానికి చెందిన 15 ఏళ్ల బాలిక చలంచర్ల పవిత్రకు స్వగ్రామానికే చెందిన మానికల దుర్గా ప్రసాద్‌తో ఈ నెల 11వ తేదీ వివాహం నిశ్చయమైంది. అధికారులు నాగలక్ష్మీ తల్లిదండ్రులు సైదులు, దీనమ్మ, పవిత్ర తల్లిదండ్రులు లక్ష్మయ్య, పద్మల నుంచి బాల్య వివాహాలు చేయబోమని వారికి పెళ్లీడు వచ్చాకే వారికి పెళ్లి చేస్తామని వారి నుంచి అలాగే బాలికల నుంచి అధికారులు స్టేట్‌మెంట్స్‌ తీసుకున్నారు. పవిత్ర 7వ తరగతితో చదువుకు స్వస్తి పలికింది.

అలాగే నాగలక్ష్మీ చదువు కూడా నాలుగో తరగతితో ఆపేశారు. బాలికల రెండు కుటుంబాలు వారు పేద వ్యవసాయకూలీలే. బాలికలు కూడా తల్లిదండ్రులకు ఆసరాగా కూలీ పనులకు వెళుతున్నారు. పైగా పెళ్లి కుమారులు కూడా 20 ఏళ్ల లోపువారే. బాల్య వివాహాల వల్ల  కలిగే అనర్థాలను గుర్తించి తల్లిదండ్రులు తమ బిడ్డలను చదివించాలని, యుక్త వయస్సు వచ్చాకే పెళ్లిళ్లు చేయాలని ఎవరైనా అలా చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సి వస్తుందని తహసీల్దార్‌ సాయిప్రసాద్‌ హెచ్చరించారు. 

మరిన్ని వార్తలు