స్టేషన్‌లోనే తన్నుకున్నారు..!

9 Dec, 2017 10:32 IST|Sakshi

మామూళ్ల పంపకాల్లో విభేదాలే కారణం

ఎర్ర స్మగ్లర్లను వదిలేసినట్లు ఆరోపణలు

బద్వేలు(అట్లూరు): బద్వేలు పోలీస్‌స్టేషన్‌లో ఆ ఇద్దరు కానిస్టేబుళ్లు రాజు, మంత్రిగా రాజ్యమేలుతున్నారు. తప్పులు చేసిన వారి నుంచి డబ్బులు తీసుకుని కేసుల నుంచి తప్పిస్తున్నారు. పై అధికారులు సైతం వారు చెప్పినదే తడవుగా తలూపుతున్నట్లు సమాచారం. నాలుగు రోజుల క్రితం ఆ ఇద్దరు కానిస్టేబుళ్లు ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి తెచ్చుకున్న మామూళ్లను పంచుకోవడంలో తలెత్తిన విభేదాలు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఒకరు హెడ్‌కానిస్టేబుల్, మరొకరు కానిస్టేబుల్‌. హెడ్‌ కానిస్టేబుల్‌ రైటర్‌గా, కానిస్టేబుల్‌ ఐడీ పార్టీలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఆ స్టేషన్‌లో ఇటీవల చోటుచేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నాలుగు రోజుల క్రితం ఎర్రచందనం దుంగల లోడుతో వాహనం వెళ్తోందని.. ఆ ఇద్దరికి వేర్వేరుగా సమాచారం అందింది. వారు ఎవరికి వారు మైదుకూరు రోడ్డులోని చెన్నంపల్లి, నందిపల్లి మార్గంమధ్యలో ఆ వాహనాన్ని నిలిపారు.

ఉన్నతాధికారులకు సమాచారం అందించి ఆ వాహనాన్ని స్టేషన్‌కు తీసుకు రావాల్సింది పోయి స్మగ్లర్లతో బేరసారాలకు దిగారు. ఇద్దరు వేర్వేరుగా డిమాండ్‌ చేస్తే ఎలా.. ఇద్దరు కలసి చెప్పాలని వారు అన్నారు. దీంతో ఐదు లక్షల రూపాయలు డిమాండ్‌ చేశారు. వారు మూడు లక్షలు ఇచ్చినట్లు సమాచారం. అయితే ఆ మూడు లక్షల పంపకంలో హెడ్‌ కానిస్టేబుల్‌ నాకు రెండు భాగాలు కావాలనడంతో.. ఆయనకు కానిస్టేబుల్‌కు మధ్య గొడవ జరిగింది. స్టేషన్‌లోనే నోటి మాటలతో మొదలై బూతులకు దారి తీసింది. చివరకు కొట్టుకున్నారు. దీంతో ఆ స్టేషన్‌ ఎస్‌ఐ వారి మధ్య సర్దుబాటు చేసినట్లు తెలిసింది. అలాగే వారు ఆరుగురు మట్కా నిర్వాహకులను ఇటీవల తీసుకొచ్చారు. అందులో తండ్రీకొడుకు ఉండగా కొడుకును తప్పించి భారీ మొత్తంలో వసూలు చేసుకున్నట్లు సమాచారం. ఇలా అన్ని పంచాయితీలలో ఆ ఇద్దరిదే స్టేషన్‌లో కీలక పాత్ర.

గతంలోనూ ఇంతే..
ఆ ఇద్దరూ ఎనిమిదేళ్లుగా ఇక్కడే విధులు నిర్వహిస్తున్నారు. గతంలో వీరిపై పలు అవినీతి ఆరోపణలు రావడంతో ఉన్నత అధికారులు ఒకరిని రైల్వేపోలీస్‌స్టేషన్‌కు, ఒకరిని జిల్లా చివరి మండలానికి పనిష్మెంట్‌ కింద సాగనంపారు. తర్వాత పలుకుబడిని ఉపయోగించుకుని నెలలలోనే మళ్లీ అదే స్టేషన్‌కు వచ్చారు.

విచారణ చేస్తా..
ఈ విషయంపై బద్వేలు సీఐ రెడ్డెప్పను ‘సాక్షి’ వివరణ అడగగా.. ‘ఎవరండీ మీరు. ఎక్కడ రిపోర్టరు. మాస్టేషన్‌లో జరిగినట్లు నా దృష్టికి రాలేదు. అయినా సరే విచారణ చేస్తా’ అని అన్నారు.

మరిన్ని వార్తలు