ఓటు నమోదుకు...48 గంటలే

14 Mar, 2019 09:24 IST|Sakshi

సాక్షి, కడప : ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం.. నచ్చని నేతలను ఇంటికి సాగనంపడానికి ఉన్న ఒకే ఒక మార్గం.. నచ్చిన నాయకులను అధికారంలోకి తెచ్చుకుని చక్కని భవితను నిర్మించుకునే సాధనం.. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన ఓటు లేదని తర్వాత దిగులు పడేకన్నా ముందే మేలుకోవాలని జిల్లా అధికార యంత్రాంగం కోరుతోంది. ఓటరు ఐడీ ఉందనో.. గత ఎన్నికల్లో ఓటేశామనో ధీమా పడితే పొరపాటే.. తాజా జాబితాలో  పేరు ఉందో లేదో తక్షణం చూసుకోవాల్సిందే. లేకపోతే ఓటరుగా పేరు నమోదు చేయించుకోవాలి.

ఎన్నికల కమిషను నిర్దేశించిన ఫారం–6 ద్వారా కొద్దిపాటి వివరాలు సమర్పిస్తే చాలు..మండలంలోని తహసీల్దారు కార్యాలయంలో ఈ దరఖాస్తు సమర్పించాలి. పట్టణాలు లేదా నగరాల్లో మున్సిపల్‌ కమిషనరు కార్యాలయంలో దరఖాస్తు అందజేయాలి. బూత్‌ లెవల్‌లో కూడా అధికారి ఉన్నారు. ఆయనకూ ఫారం–6 అందజేయవచ్చు.www.nvsp.in వెబ్‌సైట్‌ ద్వారా కూడా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే వీలుంది.

ఆలస్యం చేస్తే ఈసారి ఎన్నికల్లో ఓటేసే అవకాశాన్ని జారవిడుచుకుంటారు. ఈనెల 15 తర్వాత వచ్చిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోరు. ఉన్న అవకాశమల్లా ఓటరుగా నమోదు చేసుకోవడమే. మునుపెన్నడూ లేనివిధంగా ఎన్నికల కమిషను కొత్త ఓటర్లను చేర్పించడంపై ఎంతో అవగాహనకు కృషి చేస్తోంది. ఎన్నికల వేళ ఓటు లేదనే గందరగోళం.. వివాదాలకు తెరదించేందుకు ముందుచూపుతో అడుగులేస్తోంది.
వైస్సార్‌ జిల్లాలో ..
మొత్తం ఓటర్లు : 20,56,660
పురుషులు :10,15,964
మహిళలు : 10,40,400
ఇతరులు : 296

మరిన్ని వార్తలు