కంచిలో విషాదం

4 Jul, 2019 08:41 IST|Sakshi

సాక్షి, చెన్నై: కాంచీపురంలో అత్తి వరదరాజ స్వామి ఆలయం వద్ద మహిళా పోలీస్‌ దాడి చేయడంతో రాజమండ్రికి చెందిన ఓ యువకుడు దుర్మరణం పాలవగా.. పోలీసుల ఓవరాక్షన్‌ కారణంగా ఓ ఆటో డ్రైవర్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. కాంచీపురంలో అత్తి వరదరాజ స్వామి దర్శన మహోత్సవం కనులపండువగా సాగుతోంది. స్వామి దర్శనం కోసం రాజమండ్రికి చెందిన శక్తి ఆకాశ్‌ అనే యువకుడు తల్లి నాగేశ్వరితో కలిసి సోమవారం కాంచీపురం వెళ్లాడు. బుధవారం వరదరాజ స్వామిని దర్శంచుకున్న తర్వాత శక్తి ఆకాశ్‌ ఆలయంలో ఉన్న మూలవిరాట్‌ విగ్రహాన్ని సెల్‌ఫోన్లో ఫొటో తీసే ప్రయత్నం చేశాడు. దీనిని గమనించిన మహిళా పోలీస్‌ అడ్డుకుని లాఠీతో అతడి తలపై బలంగా కొట్టింది. దీంతో ఆకాశ్‌ స్పృహ తప్పి పడిపోయాడు. చికిత్స నిమిత్తం అతడిని ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందాడు.

పోలీసుల తీరుతో ఆటోడ్రైవర్‌ ఆత్మాహుతి
భక్తుల తాకిడి అధికంగా ఉండటంతో కాంచీపురంలో వాహనాల రాకపోకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. కాంచీపురం కరుసపేటకు చెందిన కుమార్‌ అనే ఆటో డ్రైవర్‌ పాస్‌ తీసుకుని భక్తులను ఆలయానికి తరలిస్తున్నాడు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి ఆటోను ఆలయం వద్దకు అనుమతించలేదు. దీంతో పోలీసులకు, ఆటోడ్రైవర్‌ కుమార్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో కుమార్‌ ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుని మృతి చెందాడు. అతడు  మంటల్లో కాలిపోతున్నా పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోయారు.  


 

మరిన్ని వార్తలు