ఏమైందో ఏమో...!

12 Aug, 2018 08:21 IST|Sakshi

అనుమానాస్పదంగా ఇద్దరు యువకుల మృతి

మద్యం మత్తే మట్టుబెట్టిందా..?

రైలు పట్టాలపై  మృతదేహాలు..

కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు

బొబ్బిలి: ప్రమాదమో.. నిర్లక్ష్యమో తెలియదు గాని రెండు నిండు ప్రాణాలు గాలిలో కలసిపోయాయి. రైలు పట్టాలపై ఇద్దరు యువకుల మృతదేహాలు పడి ఉన్న సంఘటన స్థానికులను కలిచివేసింది. ఈ విషయం శనివారం ఉదయం బొబ్బిలి చుట్టు పక్కల ప్రాంతాల్లో దావానంలా వ్యాపిం చింది. వివరాల్లోకి వెళితే... శ్రీకాకుళం జిల్లా పలాస మండలం గోపాలపురం గ్రామానికి చెం దిన రౌతు ధనుంజయ (35), సాలూరు మండలం నెలిపర్తికి చెందిన బెజ్జి సిసింద్రీ(21) బొబ్బిలి రైల్వే ఫ్‌లై ఓవర్‌ బ్రిడ్జి సమీపంలోని పట్టాలపై విగతజీవులుగా పడి ఉన్నారు.

 గుర్తు తెలియని రైలు ఢీకొనడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని రైల్వే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  ధనుంజయ, సిసింద్రీలిద్దరూ పెయింటర్లుగా పనిచేస్తున్నారు. సిసింద్రీ  విశాఖలో పనిచేస్తుండగా... ధనుంజయ రంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్నాడు. ధనుంజయ కుటుంబం రంగారెడ్డి వెళ్లిపోయి అక్కడే స్థిరపడ్డారు. ధనుంజయకు తల్లి ధనలక్ష్మి ఉండగా తండ్రి సీతారాం గతంలోనే మృతి చెందాడు. ఇక నెలిపర్తికి చెందిన సిసింద్రీ రెండేళ్ల కిందటే విశాఖకు వెళ్లిపోయి పెయింటింగ్‌ పనులు చేసుకుంటున్నాడు. ఈ ఇద్దరికీ ఎక్కడ స్నేహం కుదిరిందో తెలియదు కాని ఇద్దరూ కలిసి పెయింటింగ్‌లు వేస్తున్నట్లు సమాచారం. 

రంగులు వేయడానికి వచ్చి..
కొద్ది రోజుల కిందట సిసింద్రీ తన తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి బొబ్బిలిలోని పిన్ని ఇంటికి వచ్చానని, వారి కొత్త ఇంటికి రంగులు వేసి ఇంటికి వస్తానని తల్లిదండ్రులు జెబ్జి బుగ్గమ్మ, సన్నాసిలకు తెలిపాడు. ఈ క్రమంలో సిసింద్రీ, ధనుంజయ నూతన గృహానికి కొద్దిమేర మాత్రమే రంగులు వేశారు. సిసింద్రీ తన పిన్ని వారికి చెందిన ద్విచక్ర వాహనాన్ని  శుక్రవారం ఉదయం తీసుకుని ధనుంజయతో కలసి బయటకు వెళ్లి మళ్లీ మధ్యాహ్నానికి వచ్చి వాహనాన్ని ఇంటి వద్ద పెట్టేశాడు. మళ్లీ వస్తామని చెప్పి బయటకు వెళ్లిన వీళ్లు ఇలా మృతదేహాలుగా తేలడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

సిసింద్రీ అమాయకుడు
తన కుమారుడికి మద్యం తాగే అలావాటున్నా అమాయకుడని సిసింద్రీ తల్లి బుగ్గమ్మ చెబుతోంది. ఒక్కగానొక్క కొడుకు ఇలా అర్ధంతరంగా మృతి చెందడంతో కన్నీరుమున్నీరుగా రోదిస్తోంది. ఇక మాకు దిక్కెవరురా భగవంతుడా అంటూ రోదిస్తున్న తీరు చూపరులను కలిచివేసింది.  ధనుంజయ మృతి వార్త తెలుసుకున్న తల్లి ధనలక్ష్మి రంగారెడ్డి నుంచి బొబ్బిలికి బయలుదేరింది. ఇదిలా ఉంటే మద్యం మత్తులో వీరు రైల్వే పట్టాలపైకి వెళ్లగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.  

సిసింద్రీ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి
సిసింద్రీ కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు సంఘటనా స్థలానికి చేరుకోవడంతో శవపంచనామ నిర్వహించి మృతదేహానికి పోస్టుమార్టం చేపట్టి అప్పగించారు. ధనుంజయ తల్లి ధనలక్ష్మి ఆదివారం నాటికి వచ్చే అవకాశం ఉండడంతో ఆ రోజే ధనుంజయ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తామని రైల్వే పోలీసులు తెలిపారు. 

మరిన్ని వార్తలు