టగ్‌ ప్రమాదం: మరో ఇద్దరి మృతి

20 Aug, 2019 11:01 IST|Sakshi

 మరో రెండు కుటుంబాల్లో విషాదం నింపిన టగ్‌ ప్రమాదం

 మూడుకు చేరిన మృతుల సంఖ్య

ఇటీవల విశాఖ ఔటర్‌ హార్బర్‌లో పనులు నిర్వహిస్తున్న టగ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు సోమవారం ఆస్పత్రిలో మరణించారు. దీంతో ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య మూడుకు చేరింది. గల్లంతైన ఒకరి ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. 

పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణం): ఇటీవల విశాఖ ఔటర్‌ హార్బర్లో జరిగిన టగ్‌ ప్రమాదం మరో రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. కాలిన గా యాలతో జిల్లా పరిషత్‌ వద్దనున్న మై క్యూర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 10 మందిలో ఇద్దరు సోమవారం మృతి చెందారు. వీరిలో కేరళకు చెందిన జువిన్‌ జోషి(24)ను మెరుగైన చికిత్స కోసం ముంబయిలోని నేషనల్‌ బర్న్స్‌ సెంటర్‌కు ఆదివారం విమానంలో తరలించా రు. చనిపోయిన వారిలో కోటవీధికి చెందిన కాసారపు భరద్వాజ్‌(23), కోల్‌కతాకు సమీప నూర్‌పుర్‌కు చెందిన అన్సర్‌(39) ఉన్నారు. వీరి మృతదేహాలను కేజీహెచ్‌ మార్చురీకి తరలించారు. హెచ్‌పీసీఎల్‌ అద్దెకు తీసుకున్న జాగ్వర్‌ టగ్‌లో ఈ నెల 13న అగ్ని ప్రమాదం సంభవించడం తెలిసిందే. అదే రోజు ఒకరు మృతి చెందగా.. తాజాగా సోమవారం మరో ఇద్దరు క్షతగాత్రులు చనిపోయారు. ఈ ఘటనలో 15 మంది గాయపడిన సంగతి తెలిసిందే.

కోటవీధిలో విషాదఛాయలు..
కోటవీధిలో నివాసం ఉంటున్న కాసారపు కల్యాణ్, తిరుమలకు ఏకైక సంతానం భరద్వాజ్‌(23). తండ్రి కల్యాణ్‌ టగ్‌ మాస్టర్‌గా పనిచేస్తూ కుమారుడిని కూడా అదే వృత్తిలో పైకి తీసుకురావాలన్న ఆశతో భరద్వాజ్‌కు ఇటీవల శిక్షణ కూడా ఇప్పించారు. ఇంటర్‌ వరకూ చదువుకున్న భరద్వాజ్‌ టగ్‌ ట్రైనింగ్‌ పూర్తి చేసుకుని తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటాడనుకున్నారు. అయితే టగ్‌ ప్రమాదంలో భరద్వాజ్‌కు తీవ్ర కాలిన గాయాలై మైక్యూర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. దీంతో కోటవీధి ప్రాంతం విషాదంలో మునిగిపోయింది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల రోదనలతో మిన్నంటింది. భరద్వాజ్‌ అంత్యక్రియలో వందలాది మంది పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు.మరో మృతుడు అన్సర్‌ పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం కోల్‌కత్తాకు సమీపంలో ఉన్న నూర్‌పుర్‌ గ్రామానికి చెందిన వ్యక్తి. ఇతడి వివరాలు తెలిపేందుకు స్నేహితులు, బంధువులు ఎవరూ అందుబాటులో లేరు.

మరిన్ని వార్తలు