భగభగ

20 May, 2015 05:24 IST|Sakshi

మంగళవారం 43 డిగ్రీలు
అల్లాడిపోతున్న జనం
రోడ్లన్నీ నిర్మానుష్యం
వడదెబ్బతో ఇద్దరి మృతి
 

 నెల్లూరు (అర్బన్) : భానుడు మండిపోతున్నాడు. తన ప్రతాపాన్ని పెంచేసి నిప్పులుగక్కుతున్నాడు. మే నెల కావడంతో జిల్లాలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్నాయి. రోజురోజుకు ఎండలు పెరుగుతున్నాయి. ప్రజలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. సోమవారం నుంచి సూర్యుడు భగభగమండుతున్నాడు. సోమవారం 39.9 డిగ్రీ ఉష్ణోగ్రత నమోదైంది. మంగళవారం అత్యధికంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండదెబ్బకు జనం ఇళ్లకే పరిమితమవుతున్నారు.

రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. రాత్రివేళల్లో కూడా ఉష్ణోగ్రత ఎక్కువగానే ఉంటున్నాయి. ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. పల్లె ప్రాంతాల్లో కరెంటు కోతల కారణంగా చిన్న పిల్లలు, వృద్ధులు అవస్థలు పడుతున్నారు. ఉపశమనం కోసం చెట్లకిందకు చేరుతున్నారు. ఎండలు కారణంగా ప్రజలు ఉదయం 10 గంటల తర్వాత రోడ్ల మీదకు వచ్చేందుకు భయపడుతున్నారు. సాయంత్రం ఎండ తగ్గాక బయటకు వచ్చే పరిస్థితులు వచ్చాయి.

 ఆగని వడదెబ్బ మృతులు
 ఎండలు కారణంగా వడదెబ్బకు గురై వృద్ధులు మృతిచెందుతున్న సంఘటనలు జిల్లావ్యాప్తంగా చోటుచేసుకుంటున్నాయి. ఈనెల 2వ తేదీన ఓజిలిలో ఒకరు, 8న గూడూరులో ఒకరు, 10న దొరవారిసత్రంలో ఒకరు, సూళ్లూరుపేటలో ఒకరు, 15వ తేదీ గూడూరులో ఒకరు మృతిచెందారు. ఒక్క మంగళవారం రోజే ఇద్దరు మృతిచెందారు. చిల్లకూరు మండలం తిప్పగుంటపాళెంలో ఒకరు, సూళ్లూరుపేటలో ఒకరు మృతిచెందారు. వీటిని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది.

వడదెబ్బ మృతులను తగ్గించాలంటూ డీఎంహెచ్‌ఓ భారతీరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించి ఆదేశాలు ఇచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో దీని గురించి పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎండలు ఎక్కువగా ఉన్నందున వడదెబ్బకు ఎవరూ చనిపోకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మరిన్ని వార్తలు