కృష్ణానదిలో ఇద్దరు గల్లంతు

15 Sep, 2013 02:07 IST|Sakshi

విజయవాడ, న్యూస్‌లైన్ : ఈత సరదా ఇద్దరిని బలిగొంది. రణదీవె నగర్ కరకట్ట ప్రాంతంలో ఆరుగురు యువకులు వినాయక చవితి పందిరి వేశారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వినాయకుడుకి పూజలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో శనివారం సాయంత్రం నాలుగు గంటలకు ఈ ఆరుగురు యువకులు కృష్ణానదిలో స్నానంచేసివచ్చి యథావిధిగా వినాయకుడికి పూజ చేయాలని నిర్ణయించుకున్నారు.

వీరంతా వారధి  కింద స్నానానికి దిగారు. స్నానాలు ముగించుకుని తిరిగి వస్తుండగా, వరుసకు అన్నదమ్ములైన  పినెటి రాజు (19), కెల్ల చందు(16) మరికొద్దిసేపు ఈత కొడదామని  మరలా వెనక్కి వెళ్లారు. అంతే ఇక తిరిగి రాలేదు. నది ప్రవాహం ఎక్కువగా ఉండడంతో 32,33 ఖానాల వరకు కొట్టుకుపోయారు.  

నదిలో స్నానం చేస్తున్న చందు, రాజు  ఎంతకూ   తిరిగి రాకపోవడంతో   ఒడ్డున ఉన్న మిగతా నలుగురికి అనుమానం వచ్చి నదిలో పరికించి చూడగా ఇరువురి చేతులు కనపడ్డాయి. దీంతో వారు కుటుంబసభ్యలకు సమాచారం అందించారు. వెంటనే కొంతమంది నదిలో దూకి చందూ, రాజుల  ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే వారు మృతిచెందారు. పోలీసులకు సమాచారం అందించారు. దీంతో కృష్ణలంక సీఐ టిఎస్‌ఆర్‌కె.ప్రసాద్  వివరాలు సేకరించారు.

 కుటుంబానికి అండగా ఉంటానని వచ్చి......

 శ్రీకాకుళానికి చెందిన పినెటి అప్పన్న, దుర్గంబలకు ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు. పేదరికంలో ఉన్న కుటుంబానికి  సాయపడాలని పెద్ద కుమారుడైన పినెటి రాజు (19) తల్లిదండ్రులను వదలి నగరానికి వచ్చాడు.  రణదీవెనగర్‌లో నివాసముంటున్న మేనమామ కీర్తి రాజీనాయుడు దగ్గరకు చేరాడు.    తాపీపని చేసి జీవనయానం సాగిస్తున్నాడు. అలాగే  అదే ప్రాంతంలో నివాసముంటూ కూలిపని చేసుకుంటూ జీవనం సాగించే కెల్ల దుర్గారావు, నర్సమ్మలకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు పెద్ద కుమారుడు చందు  స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు.  

 ఫోన్‌లో సమాచారం....

  కృష్ణానదిలో రాజు గల్లంతైన విషయం శ్రీకాకుళంలోని రాజు తల్లిదండ్రులకు, అతని  మేనమామ రాజీనాయుడు ఫోన్‌లో సమాచారం అందించారు. వార్తను విన్న వారు హుటాహుటిన నగరానికి బయలుదేరారు. చేతికి అంది వచ్చిన కొడుకు చనిపోయాడని తెలుసుకున్న రాజు తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నట్లు రాజీనాయుడు తెలిపారు. కాగా చందూ కృష్ణానదిలో మునిగి పోవడంతో అతని కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.
 

మరిన్ని వార్తలు