బతుకు పచ్చడి

29 Oct, 2015 01:53 IST|Sakshi
బతుకు పచ్చడి

కొండెక్కిన పప్పులు.. నూనెలు
గత ఏడాదితో పోలిస్తే రెండు రెట్లు అధికం
పేద, మధ్యతరగతి ప్రజల జీవనం దుర్భరం
పట్టించుకోని ప్రభుత్వం


కొండెక్కిన నిత్యావసర వస్తువుల ధరలతో సామాన్యుడు విలవిల్లాడుతున్నాడు. సలసల కాగుతున్న నూనెల ధరలను తలుచుకుని బెంబేలెత్తిపోతున్నాడు. రోజంతా కష్టించినా.. కనీసం కందిపప్పు కూడా కొనలేని పరిస్థితిలో పచ్చడి మెతుకులతో సరిపెట్టుకుంటున్నాడు. కొందరైతే.. మజ్జిగనీళ్లు.. రసంతోనే కాలం గడుపుతున్నారు. కృత్రిమ కొరత సృష్టించి పబ్బం గడుపుకుంటున్న వ్యాపారులను.. వారిని కట్టడి చేయలేని ప్రభుత్వ పెద్దల అసమర్థతను గుర్తుచేసుకుంటూ.. గంజినీళ్లతో గొంతుతడుపుకుంటున్నారు.        
 
తిరుపతి: నిత్యావసర వస్తువుల ధరలు జెట్ వేగంతో దూసుకుపోతున్నాయి. పప్పుల ధరలు అందనంత ఎత్తుకు చేరాయి. నూనెల రేటు సలసలకాగుతున్నాయి. కూరగాయలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఉల్లి ఘాటు తగ్గలేదు. ఎండుమిర్చి ధర పెరుగుతూనే ఉంది. మొత్తం మీద సామాన్యుడు పచ్చడి మెతుకులు కూడా తినే పరిస్థితి లేకుండా పోయింది. గత ఏడాదితో పోలిస్తే నిత్యావసర వస్తువుల ధరలు రెండు రెట్లు పెరిగాయి. వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి అందిన కాడికి దోచుకుంటున్నారు. ధరలను నియంత్రించాల్సిన ప్రభుత్వం నామమాత్రపు చర్యలతో సరిపెడుతూ వ్యాపారులకు కొమ్ముకాస్తోంది. ఒకవైపు అన్నదాత వరుస కరువుతో అల్లాడుతుండగా మరోవైపు పేద, మధ్య తరగతి ప్రజలను ధరాఘాతం వెంటాడుతోంది. చిన్న తరగతి ఉద్యోగులు కుటుంబాలను నెట్టుకురావడానికి నానా తంటాలు పడుతున్నారు. అర్ధాకలితో కాలం నెట్టుకొస్తున్నారు.

తగ్గిన పంటల సాగు విస్తీర్ణం..
ఈ ఏడాది పప్పుల పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. దిగుబడులు పడిపోయాయి. దీన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది వ్యాపారులు సరుకును బ్లాక్ మార్కెట్‌కి తరలించి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. దీంతో పప్పుల ధరలు అమాంతం పెంచేశారు.
 
పప్పు కరువు.. హోటళ్లలో సైజు తగ్గిన ఇడ్లీ, దోసెలు
 సగటు జీవి ఇంట్లో పప్పు కనుమరుగైంది. హోటళ్లలో సైతం నీళ్ల సాంబారే దర్శనమిస్తోంది. మినప్పప్పు ధర పెరగడంతో ఇడ్లీ, దోసెల  పరిమాణం తగ్గిపోయాయి. వేరుశెనగ పప్పు ధర పెరగడంతో నీళ్ల చెట్నీ గతి అవుతోంది. పచ్చడి మెతుకులు తిని కాలం గడుపుదామని అనుకుంటే ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయల ధరలు సైతం కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. చాలామంది తమగోడు చెప్పుకోలేక లోలోపల కుమిలిపోతున్నారు.

 ధరలపై కొరవడిన పర్యవేక్షణ..
 మార్కెట్‌లో నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ధరలు పెరిగినప్పుడు సామాన్యులకు అందుబాటులోకి తెచ్చేవిధంగా సబ్సిడీ ధరలతో సరఫరా చేయాలి. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. సామాన్యులకు ఉపయోగపడే కొన్ని వస్తువులనైనా సబ్సిడీ ధరలకు సరఫరా చేయకపోవడంపై మండిపడుతున్నారు.
 

మరిన్ని వార్తలు