ఇద్దరు స్నేహితురాళ్ల ఆత్మహత్య

11 Aug, 2014 03:20 IST|Sakshi
ఇద్దరు స్నేహితురాళ్ల ఆత్మహత్య

వత్సవాయి/పెనుగంచిప్రోలు : చిన్ననాటి నుంచి కలిసి చదువుకున్నారు. కష్టసుఖాలు పంచుకున్నారు. చివరకు ఆ ఇద్దరు స్నేహితురాళ్లు కలిసే కన్నుమూశారు. రాఖీ పౌర్ణమిరోజు జరిగిన ఈ ఘటన రెండు కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. వత్సవాయి మండలం మక్కపేటకు చెందిన ధారావతు అరుణ(24), పెనుగంచిప్రోలుకు చెందిన సిరిపురపు సునీత(25) చిన్ననాటి నుంచే స్నేహితులు. ఇద్దరూ పదో తరగతి వరకు పెనుగంచిప్రోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు.

అరుణ ఎమ్మెస్సీ, సునీత బీఎస్సీ పూర్తిచేశారు. ప్రస్తుతం అరుణ మక్కపేటలోని ఆర్సీఎం పాఠశాలలో విద్యావాలంటీర్‌గా పనిచేస్తోంది. సునీత నందిగామలోని ఓ ప్రయివేటు కంపెనీలో పనిచేస్తోంది. ఇద్దరికీ వివాహాలైనప్పటికీ వ్యక్తిగత కారణాల వల్ల తమతమ భర్తల నుంచి విడాకులు పొందారు. సునీతకు రెండు నెలల క్రితమే హైదరాబాద్‌కు చెందిన యువకుడితో రెండో వివాహమైంది. వారి దాంపత్యజీవనం అన్యోన్యంగా సాగుతోంది.
 
సినిమా చూసేందుకు వెళ్లి..
 
ఈ క్రమంలో ఆదివారం అరుణ, సునీత కలిశారు. రాఖీ పండుగను పురస్కరించుకుని సినిమా చూసేందుకు పెనుగంచిప్రోలులోని ఓ థియేటర్‌కు వెళ్లారు. ప్రేక్షకులు లేని కారణంగా సినిమా వేయకపోవడంతో ఇద్దరు కలిసి మక్కపేటలోని అరుణ ఇంటికి చేరుకున్నారు. అరుణ తల్లిదండ్రులు కూలిపనులకు వెళ్లడంతో ఇంట్లో ఎవరూ లేరు. దీంతో లోపలికి వెళ్లిన ఇద్దరు తలుపునకు గడియపెట్టారు.

పెనుగంచిప్రోలులో కొనుగోలుచేసిన కూల్‌డ్రింక్ బాటిల్‌లో ఇంట్లో ఉన్న పురుగుల మందును కలుపుకుని ఇద్దరూ తాగారు. సాయంత్రం ఆరు గంటల సమయంలో అరుణ తండ్రి భాస్కరరావు కూలి పనులు ముగించుకుని ఇంటి వద్దకు వచ్చారు. తలుపులు వేసి ఉండటంతో ఎన్నిసార్లు పిలిచినా లోపలి నుంచి స్పందన రాకపోవడంతో అనుమానం వచ్చి స్థానికుల సాయంతో తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు.

అప్పటికే అరుణ మృతిచెందింది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న సునీతను 108 అంబులెన్స్‌లో జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించగా కొద్దిసేపటికే మరణించింది. అరుణ, సునీత అత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియరాలేదు. ఇద్దరు స్నేహితుల మరణంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఘటనాస్థలాన్ని వత్సవాయి ఎస్‌ఐ ఆర్.ప్రసాదరావు పరిశీలించి స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. మృతదేహాలకు సోమవారం పోస్టుమార్టం నిర్వహించనున్నారు.
 

మరిన్ని వార్తలు