ఎమ్మెల్యేపై హత్యాయత్నం కేసులో ఇద్దరి అరెస్టు

9 Jan, 2020 08:42 IST|Sakshi
పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై దాడి దృశ్యాలు

సాక్షి, గుంటూరు: ప్రభుత్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడిన కేసులో ఇద్దరిని బుధవారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. ఈ ఘటనపై గుంటూరు అర్బన్‌ పోలీసులు ఐపీసీ 307 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. గుంటూరు అర్బన్‌ ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. అరెస్టు చేసిన ఇద్దరిలో ఒకరు తాడికొండకు చెందిన టీడీపీ నేత, మాజీ ఉప సర్పంచ్‌ కొమ్మినేని రాము కాగా, మరొకరు చినకాకానికి చెందిన లారీ డ్రైవర్‌ సోమవరపు ప్రకాశ్‌ అని పోలీసులు తెలిపారు.

ఎమ్మెల్యేపై హత్యాయత్నానికి పాల్పడిన వారందరూ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలిసింది. సుమారు 20 నుంచి 50 మంది టీడీపీ గూండాలు దాడికి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే, గుంటూరు అర్బన్‌ జిల్లాలో సెక్షన్‌ 144, 30 పోలీసు యాక్ట్‌ అమలులో ఉన్నప్పటికీ ఎలాంటి అనుమతులు లేకుండా మంగళవారం ఎన్‌హెచ్‌–16పై రాస్తారోకో నిర్వహించిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. రహదారిని నిర్బంధించిన వారిలో 35 మందిని పోలీసులు ఇప్పటికే గుర్తించినట్లు సమాచారం. 

సంబంధిత వార్తలు..

రైతుల ముసుగులో టీడీపీ గూండాల దౌర్జన్యం  

దాడి చేసింది రైతులు కాదు.. టీడీపీ గూండాలే 

ఆ భయంతోనే బాబు దాడులు చేయిస్తున్నారు

చంద్రబాబు భారీ మూల్యం చెల్లించక తప్పదు..!

మరిన్ని వార్తలు