గర్భశోకం

8 Jan, 2016 00:28 IST|Sakshi
గర్భశోకం

కేజీహెచ్‌లో ఇద్దరు శిశువుల మృతి
నర్సు నిర్లక్ష్యం.. వైద్య సేవల లోపమేనంటూ బంధువుల ఆందోళన
విచారణకు మంత్రి  ఆదేశం

 
విశాఖ మెడికల్ : కేజీహెచ్ పిల్లల వార్డులో చికిత్స పొందుతూ గురువారం ఉదయం  ఇద్దరు శిశువులు మృతిచెందారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శిశువులు మృతిచెందారని ఆరోపిస్తూ తల్లిదండ్రులు ఆందోళనకు దిగడంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విజయనగరం జిల్లా తెర్లాం మండలం కె.సీతారాంపురానికి చెందిన 29 రోజుల ఆడ శిశువును చికిత్స కోసం విశాఖ కేజీహెచ్‌లో ఈ నెల 4న  చేర్పించారు. కాలికి పుండు కావడంతో   5న ఆపరేషన్ చేశారు. 6వ తేదీన రక్తం ఎక్కించారు. ఆ బాలిక గురువారం ఉదయం మృతిచెందింది. అయితే  తమ బిడ్డకు  వైద్యుడి పర్యవేక్షణలో కాకుండా  నర్సు నిర్లక్ష్యంగా వేరే గ్రూపు రక్తం ఎక్కించడంతో  మృతి చెందిందని తల్లిదడ్రులు సౌందర్య, సామంతుల శివరావ్  ఆరోపించారు. ఈ మేరకు వారు బంధువులతో కలిసి  పిల్లల వార్డు వద్ద ఆందోళనకు దిగారు. తరువాత కేజీహెచ్ సూపరింటెండెంట్ తో పాటు వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  అదే సమయంలో మధ్యాహ్నం కేజీహెచ్‌లో  న వజాత శిశువు ప్రత్యేక వైద్య (ఎస్‌ఎన్‌సీయూ) విభాగాన్ని ప్రారంభించేందుకు వచ్చిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాసరావును ఆడ  శిశువు కుటుంబీకులు అడ్డగించి తమ గోడును వినిపించే ప్రయత్నం చేయగా,  మంత్రి వినిపించుకోకుండా కేవలం ఆస్పత్రి సూపరింటెండెంట్ చెప్పిన విషయాన్నే నమ్ముతూ 24 గంటల్లోగా విచారణ జరిపిస్తామని చెప్పి వెళ్లారు. కాగా,  వైద్య వర్గాలు మాత్రం రక్తంలో తీవ్రమైన ఇనెఫెక్షన్ (సెప్సీసీమియా) కారణంగా మృతి చెందినట్టు చెబుతున్నారు.

ఆక్సిజన్ లేక మరో శిశువు మృతి!
ఆయాసంతో బాధపడతున్న విశాఖ జిల్లా అరకులోయ గన్నెల గ్రామానికి చెందిన రెండు నెలల లోపు గిరిజన మగ శిశువును అంబులెన్స్‌లో గురువారం ఉదయం 7 గంటల ప్రాంతంలో తెచ్చారు.   తరువాత పిల్లల వార్డులోకి  ఆక్సిజన్ సిలిండర్ లేకుండా తరలించడంతో ఊపిరి ఆడక   మృతి చెందినట్టు శిశువు తల్లిదండ్రులు సంతోష్‌కుమార్, చంద్రకళ  ఆరోపించారు. వీరు కూడా పిల్లల వార్డు వద్ద కాసేపు ఆందోళనకు దిగారు. అయితే వీరి వెంట బంధువులెవరూ లేకపోడంతో ఏమీ చేయలేక మృతదేహాన్ని తరలించేందుకు కనీసం అంబులెన్స్ సదుపాయమైనా కల్పించాలని అధికారులను అభ్యర్థించినా ఫలితం లేకపోయింది. 

ఐదేళ్ల పైబడిన గిరిజనులు మృతి చెందినప్పుడు మాత్రమే అంబులెన్స్ సౌకర్యం ఉంటుందని ఆస్పత్రి అధికారులు చెప్పడంతో చేసేది లేక నిరుపేదలైన ఆ గిరిజన దంపతులు అప్పుచేసి రూ.3,500తో ఓ ప్రైవేట్ అంబులెన్స్‌లో మృతదేహాన్ని తీసుకెళ్లారు. ఈ సంఘటనలపై ఆస్పత్రి సూపరింటె ండెంట్ డాక్టర్ ఎం.మధుసూధనబాబురు వివరణ కోరగా ఈ ఇద్దరు శిశువుల మృతిపై  ముగ్గురు సభ్యులతో కూడిన ఆస్పత్రి క్రమ శిక్షణ కమిటీతో విచారణకు ఆదేశించామని చెప్పారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా