భద్రత డొల్ల

28 Sep, 2015 23:18 IST|Sakshi

ఫార్మాసిటీ పేలుడులో ఇద్దరు మృతి
అయిదుగురికి తీవ్ర గాయాలు
సాయినార్ కంపెనీలో కానరాని భద్రత
{పమాదాలు జరుగుతున్నా మారని తీరు

 
పెందుర్తి: అందరూ విధుల్లో నిమగ్నమై ఉన్నారు..ఒక్కసారిగా భారీ పేలుడు..క్షణాల్లో దట్టమైన పొగ..పేలుడు దాటికి ఎగిరిపడుతున్న ఇటుకులు..అద్దాలు..మిషనరీ..కొద్ది నిమిషాలు గడిచాక అంతా కారు చీకట్లు..ఏం జరిగిందో తెలుసుకునే లోపే ఇద్దరు ఉద్యోగులు బూడిద అయ్యారు. పరవాడృలోని జవహర్‌లాల్ నెహ్రు ఫార్మాసిటీలో సాయినార్ లైఫ్ సెన్సైస్ కంపెనీలో సోమవారం జరిృన భారీ పేలుడులో రెండు నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో పూర్తిగా కంపెనీ నిర్లక్ష్యం కారణంగానే సంభవించినట్లు సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వలనే పేలుడు జరిగిందని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి.

 ప్రమాదం జరిగిందిలా..
 కంపెనీలో సోమవారం ఉదయం ప్రొడక్షన్ బ్లాక్‌లో 15 మందికి పనులు కేటాయించారు. ఈ బ్లాక్‌లో 24 రియాక్టర్లు ఉన్నాయి. 11.45-12 గంటల మధ్యలో బ్లాక్‌లో రసాయన చర్యలు చేస్తున్నారు. ఓమోప్రొజల్ కెమికల్‌ను వేడి చేస్తున్న సమయంలో ఒత్తిడి పెరిగిపోయి రియాక్టర్ వాల్వ్ తెరుచుకుంది. ఒక్కసారిగా పేలుడు జరిగింది.  రియాక్టర్ సమీపంలో ఉన్న బ్లాక్ షిఫ్ట్ ఇన్‌చార్జ్ వి.హరీష్‌కుమార్(30), ఆపరేటర్ వి.శ్రీనివాసరావు(50) మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు.  కొద్దిదూరంలో ఉన్న ఎస్.నూకరాజు, ఎల్.గంగాధర్‌రావు, జి.రాజు, ఈ.శేఖర్, బి.కొండలరావులు తీవ్రంగా గాయపడ్డారు. ఉద్యోగులంతా బయటకు పరుగులు తీశారు. పేలుడు తీవ్రతకు బ్లాక్‌లోని అద్దాలు, గోడలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. బాధితుల దుస్తులు, హెల్మట్‌లు, మిషనరీ బాగాలు వందల మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాయి. మంటలు చెలరేగడంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ వ్యాపించింది.  అగ్నిమాపక శకటాలు మంటలను అదుపులోకి  తెచ్చాయి. క్షతగాత్రులను అంబులెన్స్‌ల్లో నగరంలోని కేర్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో మృతిచెందిన హారీష్‌కుమార్‌ది శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస కాగా, శ్రీనివాసరావుది కశింకోట. బాధితులంతా ఐదేళ్ళుగా కంపెనీలో పనిచేస్తున్నారు. ఎమ్మెల్యే  బండారు సత్యనారాయణమూర్తి, జిల్లా కలెక్టర్ ఎన్.యువరాజ్, వైఎస్సార్ కాంగ్రేస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త అన్నంరెడ్డి అదీప్‌రాజ్, సీఈసీ సభ్యుడు పైలా శ్రీనివాసరావు, ఎంపీపీ మాసవరపు అప్పలనాయుడు, జెడ్పీటీసీ సభ్యుడు పైలా జగన్నాధరావు, అధికారులు ఘటనాస్థలికి చేరుకుని బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఫార్మాసిటీలోని పలు కంపెనీలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి.

ఉలిక్కిపడ్డారు
ఫార్మాసిటీలోని వరుస ప్రమాదాలు స్థానికంగా నివాసం ఉంటున్న ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. సోమవారం సాయినార్‌లో భారీ పేలుడు జరగడంలో చుట్టు పక్కల గ్రామాలు ఉలిక్కిపడ్డాయి. పొగ కమ్ముకోవడంతో ఆందోళనకు గురయ్యారు. కంపెనీకి సమీపంలోని ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేశారు.

 అధికారులను సస్పెండ్ చేయాలి.. ఎమ్మెల్యే బండారు
 అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఫార్మాసిటీలో వరుస అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మండిపడ్డారు. సాయినార్ కంపెనీలో కూడా అధికారుల నిర్లక్ష్యం కొట్టచ్చినట్లు కనిపిస్తుందని ఆయన ఆక్షేపించారు.
 ఘటనాస్థలానికి వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడుతూ బాధిత కుటుంబాలను ప్రభుత్వం పరంగా అన్నివిదాల ఆదుకుంటామన్నారు. పరిశ్రమల అధికారి వర్మ వైఖరి కారణంగానే కంపెనీల్లో భద్రత కనిపించడం లేదన్నారు. తక్షణమే వర్మ సహా ప్రమాదానికి కారణమైన అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

తగిన న్యాయం చేస్తాం.. కలెక్టర్
మృతి చెందిన, గాయపడిన కుటుంబాలకు తగిన న్యాయం చేస్తామని జిల్లా కలెక్టర్ ఎన్.యువరాజ్ తెలిపారు. ఆయా కుటుంబాలకు ఆర్థిక సహాయంతో పాటు ఉపాధి కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ దుర్ఘటనపై పరిశ్రమల శాఖ సీనియర్ జాయింట్ ఇన్‌స్పెక్టర్ విచారణ జరిపిస్తామన్నారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పారు.రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మంగళవారం ఫార్మాసిటీలోని ఘటనాస్థలికి చేరుకుంటారు. బాధిత కుటుంబాలను పరామర్శిస్తారు.
 

మరిన్ని వార్తలు