ఇద్దరిని బలిగొన్న మూఢనమ్మకం

14 Jan, 2016 00:06 IST|Sakshi

 మక్కువ : మూఢ నమ్మకం ఇద్దరిని బలిగొంది. ఓ యువకుడి మృతికి గిరిజన దంపతుల చిల్లంగే కారణమని భావించి వారిని దారుణంగా హత్యచేసిన ఉదంతమిది. అడ్డుకోబోయిన కుటుంబసభ్యులను భయపెట్టి కిరాతకంగా కర్రలతో కొట్టి మట్టుబెట్టిన వైనమిది. మక్కువ మండలంలో సంచలనం కలిగించిన ఈ సంఘటన మంగళవారం రాత్రి ఎస్.పెద్దవలస పంచాయతీ కొత్తకాముడువలసలో చోటు చేసుకుంది. ఆటవిక రీతిలో సాగిన ఈ సంఘటనపై మృతుల కుమార్తె బుధవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు మొదలైంది.
 
 మృతుల కుమార్తె ఏమంటోందంటే...
 గ్రామానికి చెందిన గొల్లూరి పండు, సీతమ్మ దంపతులకు చిల్లంగి ఉందని గ్రామస్తుల్లో అనుమానం ఉంది. ఈ నెల 8వ తేదీన గ్రామానికి చెందిన జన్నిశ్రీను అనే వ్యక్తి కాలికి గాయమై మరణించాడు. ఆయన మరణానికి ఈ దంపతుల చిల్లంగే కారణమని కుటుంబ సభ్యుల అనుమానం. దీనిపైనే పెద్దల దగ్గర 9, 12 తేదీల్లో పంచాయతీ పెట్టించారు. కానీ వారేమీ తేల్చలేకపోవడంతో మంగళవారు సాయంత్రం నాలుగు గంటల సమయంలో గ్రామానికి చెందిన పాలిక వెంకటి, పాలిక చంద్రరావు, జన్నిధర్మ, పాలిక తిరుపతి, పాలిక జోగులు, జన్ని సన్యాసిరావు, ఒడిశాకు చెందిన జన్ని గంగరాజు, జన్ని గోవింద ఆ ఇద్దరినీ బలవంతంగా గ్రామం సమీపంలో ఉన్న పంటపొలంలోకి తీసుకెళ్లి కర్రలతో కొట్టి హతమార్చారు. వెంటనే వారి మృతదేహాలను చిట్టిగెడ్డ పక్కన మంగళవారం రాత్రి సుమారు 11గంటల సమయంలో దహనపరిచి, మిగిలిన చితిబుగ్గిని నదిలో కలిపేశారు. ఆనవాలు కనిపించకుండా కాల్చినస్థలాన్ని నీటితో కడిగేశారు. ఈ సంఘటనను అడ్డుకోబోయిన కుటంబసభ్యులనూ చంపేస్తామని హెచ్చరించడంతో అప్పటికి ఆగి... బుధవారం ఉదయం పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదుచేశారు.
 
 కదిలిన పోలీస్ యంత్రాంగం
 హత్యపై వచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎస్పీ సిద్ధార్థ్ కౌశల్, సీఐ జి.రామకృష్ట, ఎస్సై దాసరి ఈశ్వరరావు బుధవారం కొత్తకామునివలస గ్రామానికి చేరుకున్నారు. చిట్టిగెడ్డలో కరిగిన బూడిద, సంఘటన స్థలం వద్దనున్న అస్తికలను కనుగొన్నారు. గ్రామ సమీపంలోని పంటపొలాల్లో కొట్టిన స్థలాన్ని, దహనం చేసిన స్థలాన్ని పరిశీలించారు. సీఐ రామకృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 అనాథలైన పిల్లలు : పండు, సీతమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెద్దకుమార్తె రాధకు సాలూరు మండలం చింతలవ లస గ్రామానికి చెందిన వ్యక్తితో పెళ్లిచేయగా, రెండో కుమార్తె సూరమ్మ, మూడో కుమార్తె నర్సమ్మ చదువు మధ్యలో ఆపేసి వ్యవసాయ పనులు చేసుకుంటూ తల్లిదండ్రులకు ఆసరాగా ఉండేవారు. తల్లిదండ్రులు ఒకేసారి హత్యకు గురవ్వడంతో ఆ ఇద్దరూ అనాథలుగా మారారు. గతంలో ఇలాంటి సంఘటన మండలంలో చోటు చేసుకోకపోవడంతో ఇప్పుడిది సంచలనమైంది.
 
 అంతా ఒడిశా వాసులే... : కొత్తకామునివలస గ్రామం పేరు ఒక్కటైనప్పటకి రెండు గ్రామాలుగా ఉన్నాయి. ఎగువనున్న గ్రామంలో సుమారు ఏడు కుటుంబాలకు చెందినవారు నివసిస్తుండగా, హత్యకు గురైన పండు, సీతమ్మ ఉండే గ్రామంలో సుమారు 30కుటంబాలకు చెందినవారు నివసిస్తున్నారు. వీరంతా 50ఏళ్లుగా గ్రామానికి వలస వచ్చినవాళ్లే. హత్యకు గురైన వారి గ్రామం దిగువనుండగా, హత్యచేసినవారు ఎగువనున్న గ్రామంలో ఉంటారని కుటుంబీకులు పోలీసులకు ఇచ్చిన  ఫిర్యాదులో వివరించారు.
 

>
మరిన్ని వార్తలు