నెలకు రూపాయితో రూ.2 లక్షల బీమా

12 Mar, 2018 10:46 IST|Sakshi

అల్పాదాయ వర్గాలకు బీమా భరోసా

సామాజిక సురక్ష పథకం పీఎంఎస్‌బీవై

బద్వేలు: భారత ప్రభుత్వం ప్రకటించిన మూడు సామాజిక సురక్ష పథకాలలో ముఖ్యమైనది ప్రధానమంత్రి సురక్ష బీమా (పీఎంఎస్‌బీవై) ఒకటి. ప్రమాదవశాత్తు జరిగిన మరణాలకు, వైకల్యానికి ఏడాది సమయానికి బీమా సౌకర్యం కల్పిస్తుంది. ప్రతి ఏటా దీన్ని తిరిగి పొడగించుకోవాలి. కనీస ప్రీమియం రేటు ఏడాదికి రూ.12గా ఉండే ఈ పాలసీ పేదవాళ్లకు, అల్పాదాయ వర్గాలకు వరంగా చెప్పవచ్చు. ఈ బీమా యోజనలో మరణం/శ్వాశిత వైకల్యం సంభవిస్తే  రూ.రెండు లక్షల జీవిత బీమా, శాశ్విత పాక్షిక వైకల్యం సంభవిస్తే రూ.లక్ష బీమా సౌకర్యం అందుతుంది. ఏదైనా బ్యాంకు ఖాతా నుంచి ఈ బీమా సౌకర్యం పొందవచ్చు. ఈ బీమా పథకంపై పూర్తి వివరాలు ఇలా..

ప్రీమియం:ఒక వ్యకి ఏడాదికి జూన్‌ ఒకటిగాని లేదా అంతకంటే ముందుగాని తమ బ్యాంకుఖాతా నుంచి రూ.12 ఆటో డెబిట్‌ పద్ధతిలో వసూలు చేస్తారు. జూన్‌ ఒకటి తరువాత ప్రీమియం చెల్లిస్తే తరువాత నెల నుంచి బీమా సౌకర్యం వర్తిస్తుంది.

అర్హతలు: భాగస్వామ్య బ్యాంకులో 18 నుంచి 70 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న పొదుపు ఖాతాదారులు ఆటో డెబిట్‌ను అంగీకరించి  పై విధానంలో పథకంలో చేరవచ్చు.

బీమా వర్తించని సందర్భాలు:70 ఏళ్ల వయస్సు దాటిన తరువాత, బ్యాం కు ఖాతా మూసివేసినప్పుడు, బీమాను కొనసాగించడానికి  ఖాతాలో తగినంత సొమ్ము లేనప్పుడు బీమా వర్తించదు.

ప్రీమియం పంపకం:బీమా సంస్థకు చెల్లించే వార్షిక ప్రీమియం ఒక సభ్యుడికి ఏడాదికి రూ.10 మాత్రమే. మిగిలిన రెండు రూపాయలలో బీసీ/మైక్రో/కార్పొరేట్‌/ఏజెంట్‌కు ఖర్చుల చెల్లింపు ఒక సభ్యుడికి ఏడాదికి రూపాయి. బ్యాంకు నిర్వహణ ఖర్చుల నిమిత్తం ఏడాదికి ఒక రూపాయి ఇస్తారు.
♦ ఈ బీమా పథకం ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏదైనా మరణం, ప్రమాదాలు/అవిటితనం సంభవిస్తే పాలసీ కింద బీమా వర్తిస్తుంది. ఆత్మహత్యలకు వర్తించదు. హత్యలకు వర్తిస్తుంది.

క్లెయిం పొందడమిలా..: అకాల మరణం/అవిటితనం పొందితే బీమా పరిహారం పొందేందుకు తగిన ధ్రువీకరణ పత్రాలు చూపించాలి. బీమాదారుడు అకస్మాత్తుగా మరణిస్తే పోలీస్‌స్టేషన్‌లో ప్రమాదం గురించి అతడి సంబంధీకులు రిపోర్టు ఇవ్వాలి. ఆస్పత్రి రికార్డుల ద్వారా వెంటనే ధ్రువీకరించాల్సి ఉంటుంది. పాలసీ దరఖాస్తులో పేర్కొన్న నామినీ క్లెయిం చేసుకోవచ్చు. అదే అవిటితనం గురించి క్లెయిం చేసుకోవాలంటే సూచించబడిన మొత్తాన్ని పాలసీదారుడి ఖాతాలో జమ చేస్తారు.

మరిన్ని వార్తలు