ఏవోబీలో రెండు మావో దళాలు!

9 Oct, 2018 03:49 IST|Sakshi

ఆర్కే, చలపతి నేతృత్వంలో కదులుతున్న దండు 

ఏవోబీలో జల్లెడపడుతున్న‘ఉమ్మడి’బలగాలు 

సాక్షి,అమరావతి/సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ మన్యంలో మావోయిస్టులు విసిరిన పంజాకు ఘోరంగా అభాసుపాలైన పోలీసులు సత్తా చాటుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఏకంగా ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ కిడారి సర్వేశ్వరరావు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే సివేరి సోమపై మావోయిస్టులు పేల్చిన తూట పోలీసు శాఖకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఈ నేపథ్యంలోనే మళ్లీ మావోయిస్టుల అణచివేతకు పోలీసులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. కొద్ది రోజుల క్రితం ఒడిశా డీజీపీ శర్మతో సమావేశమైన ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ ఉమ్మడి కార్యాచరణకు నిర్ణయం తీసుకున్నా రు. దీనిలో భాగంగానే కోరాçపుట్‌ జిల్లా చిక్కల్‌ములి వద్ద శని, ఆదివారాల్లో ఇరు రాష్ట్రాల పోలీసులు సం యుక్తంగా ఆపరేషన్‌ నిర్వహించారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు గాయపడినట్టు పోలీసులు చెబుతున్నప్పటికీ ఎవరనేది నిర్ధారణకు రాలేదు.  

ఆంధ్రలో దాడులు.. ఒడిశాలో షెల్టర్‌..  
ఒడిశాలో షెల్టర్‌ తీసుకుని ఏపీలోని సరిహద్దు ప్రాంతాల్లోకి వచ్చి లక్ష్యాలు నిర్దేశించుకుని మావోయిస్టులు దాడులు చేసేలా కదులుతున్నారు. ఇందుకు అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ ఆర్కే, చలపతి తదితర కీలక నేతలు నేతృత్వం వహిస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు ఏకంగా మిలటరీ బెటాలియన్‌ ఉన్నట్టు గుర్తించారు.  

టెక్నాలజీని ఆశ్రయించిన పోలీసులు 
మావోయిస్టుల కదలికలను గుర్తించేలా పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆశ్రయించారు. అన్‌ మాన్డ్‌ ఏరియల్స్‌(యుఏవీ), డ్రోన్‌లను వాడుకోవాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఏవోబీలో స్కానింగ్‌ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. రేడియో ట్రాన్సిస్టర్‌ మాదిరిగా ఉండే పరికరాన్ని ఎతైన ప్రదేశంలో అమర్చి దాని యాంటేనా ద్వారా స్కానింగ్‌ పద్ధతిని నిర్వహిస్తున్నారు. దీని ద్వారా ప్రస్తుతం మావోయిస్టులు వినియోగించే వైర్‌లెస్‌సెట్, మొబైల్‌ ఫోన్ల ద్వారా జరిగే సంభాషణలను రికార్డు చేయడంతోపాటు వారు ఏ ప్రాంతంలో, ఎంత దూరంలో ఉన్నారో గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. 

పోలీసులకు చిక్కిన మావోయిస్టు కీలక నేత 
చత్తీస్‌గఢ్, ఆంధ్ర సరిహద్దుల్లో ఇడుమా బెటాలియన్‌ డెప్యూటీ కమాండర్‌ పోడియం ముడా సోమవారం పోలీసులకు చిక్కాడు. అతని అరెస్టుతో తూర్పు మన్యంలో మావోలకు ఎదురు దెబ్బ తగిలిందని పోలీసులు చెబుతున్నారు. 2014లో చత్తీస్‌గఢ్‌ మంత్రి మహేందర్‌ కర్మా సహా అనేక దాడుల్లో 116 మంది పోలీసుల మృతికి కూడా కారకుడని పోలీసులు చెబుతున్నారు. 

ఏవోబీలోనే ఆర్కే.. 
మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ (ఆర్కే) ఆంధ్ర, ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లోనే ఉన్నట్టు పోలీసు ఉన్నతాధికారులు నిర్ధారణకు వచ్చారు. ఆయనతో సహా ఏవోబీలో తలదాచుకున్న మావోయిస్టు కీలక నేతలే లక్ష్యంగానే కూంబింగ్‌ జరుగుతోందని స్వయంగా పోలీసు ఉన్నతాధికారులే ఆఫ్‌ ది రికార్డ్‌గా అంగీకరిస్తున్నారు. 

మరిన్ని వార్తలు