ఎరుపెక్కిన ఏఓబీ.. మహిళా మావోయిస్టుల మృతి

12 Apr, 2017 16:21 IST|Sakshi
ఎరుపెక్కిన ఏఓబీ.. మహిళా మావోయిస్టుల మృతి

ఆంధ్రా - ఒడిషా సరిహద్దు ప్రాంతం (ఏఓబీ) మళ్లీ ఎరుపెక్కింది. భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మరణించారు. ఒడిషాలోని రాయగఢ్‌ జిల్లాలో మావోయిస్టులు సమావేశమైనట్లు విశ్వసనీయంగా సమాచారం అందడంతో ఒడిషాకు చెందిన ఎస్ఓటీ బలగాలు, సీఆర్పీఎఫ్ దళాలు అక్కడకు చేరుకున్నాయి. ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు జరగడంతో ఇద్దరు మహిళా మావోయిస్టులు మరణించారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ఒక గిరిజనుడు కూడా గాయపడినట్లు తెలుస్తోంది. మహిళా మావోయిస్టులు మరణించినట్లు చెబుతున్నా, వాళ్లు ఏ రాష్ట్రం, ఏ దళానికి చెందినవారనే విషయం మాత్రం ఇంకా గుర్తించాల్సి ఉంది.

అక్కడ కొన్ని ఆయుధాలు లభించినట్లు పోలీసులు చెబుతున్నారు. దొరికిన వాటిలో ఒక ఏకే-47 కూడా ఉందని సమాచారం. సాధారణంగా ఈ తుపాకులను కేంద్రకమిటీ సభ్యులు గానీ స్పెషల్ జోన్ కమిటీ సభ్యులుగానీ మాత్రమే వాడతారు. దాంతో ఇక్కడకు ఎవరైనా మావోయిస్టు అగ్రనేతలు వచ్చి తప్పించుకున్నారా అనే దిశగా కూడా దర్యాప్తు సాగుతోంది. వేసవి కాలం కావడంతో ఏఓబీలో భద్రతా దళాల కూంబింగ్ ముమ్మరంగా సాగుతోంది. మరోవైపు మావోయిస్టులు కూడా భారీగా రిక్రూట్‌మెంట్లు చేసే పనిలో కనిపిస్తున్నారు. వేసవిలో నీళ్ల కరొత ఉంటుంది కాబట్టి.. మావోయిస్టులు గ్రామాలకు దగ్గరలోకి వస్తారు. ఇదే అదనుగా వాళ్లను ఏరివేయాలని భద్రతా దళాలు ప్రణాళికలు రచిస్తున్నాయి. దాంతో రాబోయే రోజుల్లో ఏఓబీ ప్రాంతం మరింత ఉద్రిక్తంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి.



మరిన్ని వార్తలు