బోటును వెలికి తీసేందుకు ముమ్మర చర్యలు

25 Sep, 2019 04:54 IST|Sakshi
లభ్యమైన మృతదేహాన్ని అంబులెన్సులో తరలిస్తున్న దృశ్యం

తాజాగా మరో రెండు మృతదేహాలు లభ్యం

13 మంది కోసం కొనసాగుతున్న గాలింపు

విశాఖ పోర్టు నుంచి భారీ క్రేన్, రోప్‌లు

వాటిని ఘటనా స్థలానికి చేర్చడమే పెద్ద సమస్య

దేవీపట్నం నుంచి సాక్షి ప్రతినిధి బృందం: తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద రాయల్‌ వశిష్ట పున్నమి ప్రైవేట్‌ బోటు బోల్తా ఘటనలో మంగళవారం మరో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా వైపు పోలవరం మండలం వాడపల్లి వద్ద పురుషుడి మృతదేహాన్ని, అదే జిల్లా తాళ్లపూడి మండలం వేగేశ్వరపురంలోని పంతులు గారి లంక వద్ద రాత్రి పొద్దుపోయాక మహిళ మృతదేహాన్ని కనుగొన్నారు. పురుషుడి మృతదేహాన్ని రాజమహేంద్రవరం జీజీహెచ్‌కు తరలించగా.. మహిళ మృతదేహాన్ని తరలించాల్సి ఉంది.

రెండు మృతదేహాలు పూర్తిగా పాడైపోయి గుర్తు పట్టలేని విధంగా ఉండటంతో డీఎన్‌ఏ పరీక్షల ద్వారా మృతులెవరనేది గుర్తిస్తామని వైద్యులు తెలిపారు. అధికారిక లెక్కల ప్రకారం బోటులో ప్రయాణించిన 77 మందిలో 26 మంది ప్రాణాలతో బయటపడగా.. మంగళవారం దొరికిన మృతదేహంతో కలిపి ఇప్పటివరకు 38 మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో 13 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. ఇదిలావుంటే.. మునిగిపోయిన బోటును వెలికి తీసేందుకు ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోంది. గల్లంతైన వారి ఆచూకీ కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు గాలింపు చర్యల్ని కొనసాగిస్తున్నాయి.

భారీ క్రేన్, రోప్‌లు రప్పిస్తున్నాం
బోటును వెలికి తీసేందుకు విశాఖ పోర్టు నుంచి యంత్ర సామగ్రి రప్పించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ విషయాన్ని ఏపీ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వై.సత్యనారాయణ మంగళవారం తెలిపారు. బోటు జాడను గుర్తించిన ప్రాంతంలో గోదావరి ప్రవాహ తీరును, అక్కడి పరిస్థితులను ఆయన బోటులో వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం గోదావరిలో వరద ఉధృతి కొంతమేర తగ్గిందన్నారు. అయినప్పటికీ అక్కడ తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని చెప్పారు.

బోటును వెలికితీసేందుకు భారీ పొక్లెయిన్, 800 మీటర్ల పొడవైన ఐరన్‌ రోప్‌లను విశాఖ పోర్టు నుంచి రప్పిస్తున్నట్లు తెలిపారు. పోర్టు, జల వనరుల శాఖ అధికారులు, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ ఉన్నతాధికారులతో చర్చించిన ఆయన భారీ యంత్రాన్ని ప్రమాద స్థలానికి తరలించేందుకు మంటూరు వైపు నుంచి గల రహదారి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. బోటు మునిగిన ప్రాంతాన్ని పలుమార్లు పరిశీలించామని, సాంకేతికతకు తోడు సంప్రదాయ పద్ధతిలో బోటు వెలికితీసే ఏర్పాట్లు చేస్తున్నామని పోర్టు అధికారి కెప్టెన్‌ ఆదినారాయణ తెలిపారు.

మరిన్ని వార్తలు