రాష్ట్రంలో మరో రెండు సెల్‌ఫోన్‌ తయారీ యూనిట్లు

4 Jun, 2020 03:41 IST|Sakshi

శ్రీసిటీ యూనిట్‌ ఉత్పత్తి సామర్థ్యం పెంపు 

రాష్ట్రంలో కోవిడ్‌ నియంత్రణ చర్యలు బాగున్నాయి 

పారిశ్రామిక రంగం వెంటనే కోలుకునేలా రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంది 

ఫాక్స్‌కాన్‌ ఎండీ జోష్‌ ఫౌల్గర్‌

సాక్షి, అమరావతి: యాపిల్, రెడ్‌మీ వంటి ప్రముఖ బ్రాండ్ల సెల్‌ఫోన్లను తయారుచేసే తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్‌ రాష్ట్రంలో మరో రెండు యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. అదేవిధంగా ప్రస్తుతం శ్రీ సిటీలో ఉన్న యూనిట్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతామని ఫాక్స్‌కాన్‌ ఇంటర్నేషనల్‌ హోల్డింగ్‌ (ఇండియా) ఎండీ, కంట్రీ హెడ్‌ జోష్‌ ఫౌల్గర్‌ తెలిపారు. కోవిడ్‌ తర్వాత ఎలక్ట్రానిక్స్‌ తయారీ రంగంలో అవకాశాలపై కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఇన్వెస్ట్‌ ఇండియా ఈఐఎఫ్‌–2020 పేరిట నిర్వహించిన వెబ్‌నార్‌లో ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు. ఈ సందర్భంగా జోష్‌ ఫౌల్గర్‌ మాట్లాడుతూ.. కోవిడ్‌ తర్వాత వచ్చే ఐదేళ్లలో దేశీయ ఎలక్ట్రానిక్‌ మార్కెట్‌ విలువ 400 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని, ఈ అవకాశాన్ని రాష్ట్రం అందిపుచ్చుకోవాలన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్‌ను చాలా సమర్థవంతంగా కట్టడి చేసిందని, పారిశ్రామిక రంగం త్వరగా కోలుకునే విధంగా తక్షణ చర్యలు తీసుకుందని అభినందించారు. శ్రీ సిటీలోని ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించడానికి త్వరితగతిన అనుమతులు మంజూరు చేసిందని వెల్లడించారు. కాగా, ఏడాది పాలనలో భాగంగా పారిశ్రామిక రంగంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన సదస్సులో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఫౌల్గర్‌ మాట్లాడిన సంగతి తెలిసిందే. గతేడాది సెప్టెంబర్‌ 18న తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసి రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెడతామని ఫౌల్గర్‌ హామీ ఇచ్చారు. 

మరిన్ని వార్తలు