విజయవాడ రైల్వేస్టేషన్‌లో మరో రెండు ఫ్లాట్‌ఫామ్స్

7 Oct, 2017 14:47 IST|Sakshi

సాక్షి,విజయవాడ: విజయవాడ రైల్వేస్టేషన్‌లో మరో రెండు ఫ్లాట్‌ఫామ్స్ ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ప్రస్తుతం 6,7 ప్లాట్‌ఫారాల మధ్య ఉన్న భవనాలను తొలగించి వాటి స్థానంలో కొత్త ప్లాట్‌ ఫారాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కొత్త ప్లాట్‌ఫారాల ఏర్పాటుకు రూ.12 కోట్లు వ్యయం అవుతుందని అంచనాలు వేశారు. దీనికి రైల్వే జీఎం వినోద్‌ కుమార్‌ యాదవ్‌ సుముఖంగా వున్నట్టు రైల్వే వర్గాల్లో చర్చ జరుగుతోంది.

విజయవాడ రైల్వే స్టేషన్‌ నిత్యం రద్దీ
విజయవాడ రైల్వేస్టేషన్‌ మీదుగా నిత్యం 250 పాసింజర్‌ రైళ్లు, మరో 150 గూడ్స్‌ రైళ్లు వెళుతున్నాయి.నిత్యం 2లక్షల మంది ప్రయాణికులు ఈ స్టేషన్‌ నుంచి  రాకపోకలు సాగిస్తున్నారు. రైల్వేస్టేషన్‌లో  ప్రస్తుతం పది ప్రయాణికుల రైళ్లు ఆగే ప్లాట్‌ఫారాలు ఉండగా అదనంగా  మరో 12 గూడ్స్‌ రైళ్ల ట్రాక్‌లు ఉన్నాయి. అయినప్పటికీ  పెరుగుతున్న అవసరాలకు తగినట్టుగా ప్లాట్‌ఫారాలు సరిపోవడం లేదు దీంతో కొత్త ప్లాట్‌ఫారాల ఏర్పాటుపై అధికారులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఒన్‌టౌన్‌ తారాపేట వైపు కొండ అడ్డంగా ఉండడం, తూర్పువైపు రైల్వే భవనం ఉండడంతో దీన్ని విస్తరించడం సాధ్యపడడం లేదు.

శిథిలమైన పాత భవనాలు
6,7 నంబర్‌ ప్లాట్‌ఫారాలపై నిర్మించిన భవనాలు వంద సంవత్సరాలు దాటిపోయాయి. గతంలో ఏడవ ఫ్లాట్‌ఫారం వరకు మాత్రమే ఉండేది అందువల్ల అక్కడ భవనాలు నిర్మించారు. ఆ భవనాల్లో జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్‌ పోలీసుస్టేషన్లు, క్రూ ఆఫీసు, సీటీఐ కార్యాలయం, ఆర్‌ఎంఎస్‌ కార్యాలయం తదితర కార్యాలయాలను నడుపుతున్నారు. 2004లో ట్రాఫిక్‌ రద్దీని దృష్టిలో ఉంచుకుని పశ్చిమం వైపు 8,9,10 ప్లాట్‌ఫారాలను ఏర్పాటు చేశారు. అయినా ప్రస్తుతం ట్రాఫిక్‌కు తగినట్టుగా ప్లాట్‌ఫారాలు సరిపోకపోవడంతో రాబోయే రోజుల్లో రాజధానికి వచ్చే వారి సంఖ్య పెరిగితే మరిన్ని ఇబ్బందులు వస్తాయి.

ఈ నేపథ్యంలో వందేళ్ల నాటి భవనాలను తొలగించి అక్కడ మరొక రెండు ట్రాక్‌లు ఏర్పాటు చేస్తే ప్రయాణికులకు ఉపయుక్తంగా ఉంటుందని విజయవాడ డివిజన్‌ అధికారులు నిర్ణయించారు. ఇటీవల రైల్వే జీఎం వినోద్‌కుమార్‌ యాదవ్‌ వచ్చినప్పుడు ఇదే విషయం చర్చించగా, ఆయన స్టేషన్‌ను పరిశీలించారు. ఫ్లాట్‌ఫారంపై ఉన్న భవనాలు ఏ నిముషంలోనైనా కూలిపోవచ్చని, అదే జరిగితే ప్రాణనష్టం జరుగుతుందని భావించిన అధికారులు వాటిని తొలగించాలని నిర్ణయించారు. అక్కడ తిరిగి కొత్త భవనాలు నిర్మించే కంటే మరో రెండు ప్లాట్‌ఫారాలు నిర్మిస్తే సరిపోతుందని ఒక నిర్ణయానికి వచ్చారు.

కార్యాలయాలు సర్దుబాటు
6,7 నంబర్‌ ప్లాట్‌ఫారాలను పదవ నంబరు లేదా ఒకటవ నంబర్‌ ప్లాట్‌ఫారానికి సర్దుబాటు చేయాలని నిర్ణయించారు. స్టేషన్‌లో ఉండాల్సిన అవసరం లేని కార్యాలయాలను డీఆర్‌ఎం కార్యాలయంలో కాని మరొక చోట కాని సర్దుబాటు చేయాలని భావిస్తున్నారు. ఈ విధంగా చేయడం వల్ల తూర్పు వైపు ఒక భవనం, పశ్చిమం వైపు పదవ నంబర్‌ ఫ్లాట్‌ఫారంపై మరొక భవనం మాత్రమే ఉంటుంది. ఫ్లాట్‌ఫారాలు పెరగడం వల్ల ప్రయాణికులకు ఉపయుక్తంగా ఉంటుందని నిర్ణయించారు.

మరిన్ని వార్తలు