జేసీ ట్రావెల్స్‌ ఫోర్జరీ కేసు: మరో ఇద్దరు అరెస్ట్‌

7 Feb, 2020 19:53 IST|Sakshi

సాక్షి, అనంతపురం: జేసీ ట్రావెల్స్‌ ఫోర్జరీ కేసులో మరో ఇద్దరు నిందితులను తాడిపత్రి పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. పరారీలో ఉన్న రామ్మూర్తి, ఇమామ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు నలుగురు జేసీ ట్రావెల్స్‌ ఉద్యోగులను అరెస్ట్‌ చేశారు. సీఐలు, ఎస్సైలు, ఆర్టీఏ అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి నకిలీ క్లియరెన్స్‌ సర్టిఫికెట్లు సృష్టించినట్లు పోలీసులు గుర్తించారు. జేసీ ట్రావెల్స్‌ యాజమాన్యం ఆదేశాలతోనే నకిలీ క్లియరెన్స్‌ సర్టిఫికెట్లు తయారు చేసినట్లు పోలీసుల విచారణలో నిందితులు వెల్లడించారు.

తాడిపత్రి ఎస్‌ఐ సంతకాన్ని ఫోర్జరీ చేయడంతో పాటు పోలీస్‌స్టేషన్‌కు సంబంధించిన నకిలీ స్టాంపులు వినియోగించినట్లు విచారణలో బయటపడింది. నకిలీ పత్రాలతో 6 లారీలను జేసీ ట్రావెల్స్‌ బెంగుళూరులో విక్రయించింది. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి భార్య ఉమారెడ్డి జేసీ ట్రావెల్స్‌ ఎండీగా వ్యవహరిస్తున్నారు.

ఫోర్జరీ సర్టిఫికెట్ల తయారీ వెనుక జేసీ దివాకర్‌ రెడ్డి హస్తం
జేసీ ట్రావెల్స్‌ ఫోర్జరీ బాగోతంపై సమగ్ర విచారణ జరిపించాలని తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి డిమాండ్‌ చేశారు. టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి అవినీతికి చిరునామా అని ధ్వజమెత్తారు. జేసీ వ్యాపారాలన్నీ అక్రమాలేనని, బోగస్‌ సర్టిఫికెట్లు తయారీలో జేసీ దివాకర్‌ రెడ్డి పాత్ర ఉందని ఆరోపించారు. జేసీ బద్రర్స్‌ డబ్బు పిచ్చి వల్ల అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే జేసీ ట్రావెల్స్‌ బస్సులు నడిపారని.. అక్రమ మైనింగ్‌తో వందల కోట్ల రూపాయలు జేసీ దోచుకున్నారని పెద్దారెడ్డి మండిపడ్డారు. జేసీ దివాకర్‌రెడ్డి పాపం పండిందని.. ఆయన చేసిన అక్రమాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయన్నారు. జేసీ బ్రదర్స్‌ను అరెస్ట్‌ చేసి విచారించాలని పోలీసులకు తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి విజ్ఞప్తి చేశారు.
(చదవండి: జేసీ ట్రావెల్స్‌లో బయటపడ్డ ఫోర్జరీ బాగోతం)

మరిన్ని వార్తలు