ఇద్దరిని కాటేసిన విద్యుదాఘాతం

28 Jul, 2015 23:27 IST|Sakshi

ప్రాణం తీసిన ఐరన్ రాడ్
 శృంగవరపుకోట: విద్యుదాఘాతంతో ఒకరు మృతి చెందగా మరొకరు గాయపడిన ఘటన పట్టణంలోని కాపు వీధిలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. వ్యాపారులు ఆదిమూలం రాము, లక్ష్మణలు కాపు వీధిలోని తమ ఇంటిపై అంతస్తు నిర్మిస్తున్నారు. మునసబువీధిలో నివాసం ఉండే పూసర్ల ప్రకాశ్(47) వీరి వద్ద పనిచేస్తున్నారు. ఆయన ఐరన్‌రాడ్‌ను మేడపైకి తీసుకెళుతుండగా వీధిలైన్ విద్యుత్ తీగలు తగలటంతో విద్యుదాఘాతానికి గురై కుప్పకూలిపోయారు. అదే ఐరన్‌రాడ్ తగలటంతో మేడపై హాలులో వండ్రంగి పనిచేస్తున్న పంతం ప్రకాశ్ తీవ్రంగా గాయపడ్డారు. జీసీసీ రోడ్డులో నివాసం ఉండే పంతం ప్రకాశ్ బిల్డింగ్ వుడ్‌వర్క్ కాంట్రాక్టు తీసుకున్న కార్పెంటర్ వద్ద రోజు కూలికి పనిచేస్తున్నారు. ఐరన్‌రాడ్ తగిలి షార్ట్ కావటంతో వీధి లైన్‌లోని విద్యుత్ తీగ తెగిపడింది.
 
  తీవ్రంగా గాయపడిన పూసర్ల ప్రకాశ్, పంతం ప్రకాశ్‌లను స్థానికులు హుటాహుటిన స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే పూసర్ల ప్రకాశ్ మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. తీవ్రంగా గాయపడిన పంతం ప్రకాశ్‌కు ప్రథమ చికిత్స చేసి విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. తహశీల్దార్ రాములమ్మ ఆస్పత్రికి వచ్చి క్షతగాత్రుడు ప్రకాశ్‌ను, మృతుడు ప్రకాశ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రమాద వివరాలు తెలుసుకుని ప్రభుత్వ సాయం అందేలా కృషి చేస్తానని చెప్పారు. విద్యుత్‌శాఖ ఏఈ సింహాచలం సిబ్బందితో ఘటనాస్థలికి వచ్చి తెగిపడ్డ విద్యుత్ వైరును కలిపి సరఫరాను పునరుద్ధరించారు. ఎస్.కోట ఎస్‌ఐ సాగర్‌బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
 సార్ నన్ను కాపాడండి..
 గాయాల పాలైన వండ్రంగి ప్రకాశ్‌కు భార్య తప్ప ఎవరూ లేరు. ఆమె కూడా అమాయకురాలు కావటంతో ప్రకాశ్ ఆందోళకు గురయ్యారు. ‘సార్ నాకు ఎవరూ లేరు. నా భార్య అమాయకురాలు. నన్ను కాపాడండి. ఏమైందో తెలీదు. పనిచేసుకుంటుండగా ఒక్కసారి షాక్ తగిలి పడిపోయాను’ అని ఏడుస్తూ చెప్పారు.
 
 సీతానగరం: దమ్ము చేస్తున్న పొలంలో మోటారు వేయబోయి విద్యుదాఘాతానికి గురై ఓ రైతు కన్నుమూశారు. భార్య, ఇద్దరు పిల్లలను అనాథలుగా చేశారు. మండలంలోని కొత్తవలస గ్రామంలో మంగళవారం ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. కొత్తవలస గ్రామానికి చెందిన రైతు యాండ్రాపు అప్పలనాయుడు తన పొలంలో వరిఉభాలు చేస్తున్నారు. మంగళవారం ఉదయం నుంచి దమ్ముపని చేపట్టారు. మధ్యాహ్నం త్రీఫేస్ విద్యుత్ సరఫరా జరగటంతో మోటారు వేసేందుకు వెళ్లారు. అప్పటికే తడిసి ఉన్న ఆయన విద్యుత్ బోర్డుకున్న వైరు తెగిన విషయాన్ని గుర్తించలేదు.
 
 మోటార్ స్విచ్ వేయబోయేసరికి తెగి ఉన్న వైరు తగలటంతో తీవ్ర విద్యుదాఘాతానికి గురయ్యారు. తీవ్రంగా గాయపడిన ఆయనను పొలంలోంచి బయటకు తీసుకొచ్చేలోగా మరణించారు. వీఆర్‌వో గౌరీశంకరరావు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ రాపాక వాసుదేవ్ మృతుని కుటుంబీకులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. కంటికి రెప్పలా చూసుకుంటున్న పెద్దదిక్కు పోవడంతో మృతుని భార్య రామలక్ష్మి, కుమార్తెలు భారతి, ప్రశాంతి బోరున విలపించారు. భారతి డిగ్రీ, ప్రశాంతి ఎనిమిదవ తరగతి చదువుతున్నారు.
 
 ఏమండీ.. లేవండీ..
 ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన పూసర్ల ప్రకాశ్‌కు భార్య చిన్న, నరేష్(12), తరుణ్(11) అనే కుమారులు ఉన్నారు. నిరుపేద వైశ్య కుటుంబానికి చెందిన ప్రకాశ్ పట్టణంలోని పెద్ద వర్తకుల వద్ద పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ప్రమాద వార్త తెలిసి ఆస్పత్రి వచ్చిన ప్రకాశ్ భార్య చిన్న భర్త శవాన్ని తట్టి లేపుతూ ‘ ఏమండీ లేవండీ. మమ్మల్ని ఎవరు చూస్తారు. దేముడా మాకు దిక్కెవరు’ అంటూ విలపించారు. కొడుకులు నరేష్, తరుణ్‌లు ‘నాన్నా.. లే నాన్నా.. మాట్లాడు నాన్నా.. అమ్మా నాన్నని లేపమ్మా’ అంటూ రోదించిన తీరు అందరినీ కలచివేసింది.
 

మరిన్ని వార్తలు