ఇద్దరిని బలిగొన్న వేగం

14 Jan, 2015 03:41 IST|Sakshi
ఇద్దరిని బలిగొన్న వేగం

ఉంగుటూరు:జాతీయ రహదారిపై ఉంగుటూరు వద్ద ఓ కారు డ్రైవర్ సృష్టించిన బీభత్సంతో మంగళవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ దుర్ఘటనలో ఇరువురు మృతిచెందగా ముగ్గురికి గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి తణుకు వెళుతున్న ఇన్నోవా కారు జాతీయ రహదారిపై ఉంగుటూరు వద్ద మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో అతి వేగంగా వచ్చి రోడ్డుపక్కన ఉన్న వ్యక్తులను ఢీకొట్టింది. ఈ సంఘటనలో నల్లజర్ల మండలం సింగరాజుపాలెం శివారు కొండాయిగుంటకు చెందిన పెనుమాక యాకోబ్(40) అక్కడికక్కడే మృతిచెందారు. ఉంగుటూరుకు చెందిన గేదేల రాంబాబు(45)కు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం 108 అంబులైన్స్‌లో తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందారు.
 
 ఉంగుటూరుకు చెందిన కొండ్రెడ్డి కృష్ణవేణి అప్పుడే బ్యాంక్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ఆమెను కారు ఢీకొనటంతో కాలు విరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో ఉంగుటూరుకు చెందిన టేకి బాలాజీ కుటుంబ సభ్యులు  సంక్రాంతి పండగకు రాజమండ్రి వెళ్లటానికి బస్ కోసం వేచి చూస్తున్నారు. దూసుకు వస్తున్న కారును గమనించిన బాలాజీ.. కుటుంబ సభ్యులను పక్కకు లాగివేయడంతో ఆయన భార్య ఆదిలక్ష్మి, కుమారై రమ్య స్వల్ప గాయాలతో బయట పడ్డారు. ఈ ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న గ్రామస్తులు కారుడ్రైవర్ పైన, కారులోని వారిపైన దాడి చేయటానికి ప్రయత్నించారు. కారులోని వారు ఒక షాపులో తలదాచుకోనే ప్రయత్నం చేయగా గ్రామస్తులు ఆ షాపుపై దాడి చేసి అద్దాలు పగులగొట్టారు. విషయం తెలిసిన వెంటనే చేబ్రోలు ఎస్సై సంఘటన స్థలానికి వచ్చిప్పటికీ గ్రామస్తులు ఎక్కువగా ఉండటంతో వారిని అదుపు చేయలేకపోయారు.
 
 మృతదేహంతో రాస్తారోకో
 యాకోబ్ మృతదేహాన్ని జాతీయ రహదారిపై ఉంచి సుమారు రెండుగంటలపాటు గ్రామస్తులు, బంధువులు రాస్తారోకో చేసి ధర్నా చేశారు. దీంతో కిలోమీటరు పైబడి వందలాది వాహనాలు నిలిచిపోయాయి. గణపవరం సీఐ ఎన్.దుర్గాప్రసాద్ మృతుల బంధువులతోను, ఆందోళనకారులతో చర్చలు జరపటంతో రాస్తారోకో విరమించారు. చేబ్రోలు ఎస్సై వి.చంద్రశేఖర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
 
 గ్రామంలో విషాదం
 కిళ్లీషాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్న ఆ కుటుంబం యాజమాని గేదేల రాంబాబు మృతిచెందటంతో ఆర్థికంగా అండను కోల్పోయింది. తెల్లవారితే పండగ ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడంతో ఆ కుటుంబంతో బాటు గ్రామం మొత్తం విషాదంలో మునిగిపోయింది. ఆదరించే కొడుకు ఇకలేరని తెలిసి రాంబాబు తల్లిదండ్రులు అప్పారావు,సత్యవతి దంపతులు రొదిస్తున్న తీరు కంటతడి పెట్టించింది. తెలుగుదేశం కార్యకర్తగా కొనసాగుతున్న రాంబాబు మృతి వార్త విని స్థానిక ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు సంఘటన స్థలానికి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మాజీ జెడ్పీటీసీ సభ్యులు రెడ్డి సత్యనారాయణమూర్తి, మండల టీడీపీ అధ్యక్షుడు పాతూరి విజయకుమార్, మాజీ సర్పంచ్ పెనుగొండ సూర్యచంద్రరావు, ఉంగుటూరు ఎంపీటీసీ సభ్యులు సందక శ్రీనివాస్‌లు ఆయన వెంట ఉన్నారు. రాంబాబుకు భార్య దుర్గ, కుమార్తెలు రేవతి సత్యవతి, వెంకటలక్ష్మి, కుమారుడు రామ లక్ష్మణ్‌లు ఉన్నారు. రాంబాబు రెండో కుమార్తెకు పెళ్లి సంబంధం కుదరగా రేపో మాపో ముహూర్తం పెట్టుకుందామనుకుంటుండగా ఈ విషాదం చోటు చేసుకుంది.
 
 వీధినపడ్డ కుటుంబం
 కూలి పని చేస్తూ జీవిస్తున్న పెనుమాక యాకోబ్ మృతి చెందటంతో ఆ కుటుంబం వీధిన పడిందని బంధువులు, కుటుంబ సభ్యులు విలపించారు. భార్య ఎస్తేరు, ఇద్దరు కుమార్తెలు కొండాయిగుంట నుంచి ఉంగుటూరు వచ్చి మృతదేహం వద్ద కన్నీరు మున్నీరుగా విలపించారు.
 
 వివరాలు చెప్పని పోలీసులు
 తన నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో ఇద్దరి మృతికి కారణమైన కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని వివరాలు మాత్రం విలేకరులకు చెప్పడానికి నిరాకరించారు. ఎన్నిసార్లు అడిగినా దాటవేత ధోరణిలో మాట్లాడిన పోలీసులు బుధవారం డ్రైవర్‌కు సంబంధించిన విషయాలు వెల్లడిస్తామని చెప్పారు.
 

మరిన్ని వార్తలు