బావా బావమరుదుల దుర్మరణం

13 Jul, 2014 01:10 IST|Sakshi
బావా బావమరుదుల దుర్మరణం

 తుని/తుని రూరల్ :జాతీయ రహదారిపై తుని మండలం ఎర్రకోనేరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బావాబావమరుదులు మరణించారు. కుమార్తె పెళ్లి కార్డులను బంధువులకు పంచడానికి కారులో వెళుతుండగా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వీరిద్దర్ని మృత్యువు కబళించింది. సంఘటన స్థలంలో ఉన్న పోలీసు సిబ్బంది, విలేకరులపైకి పది నిమిషాల వ్యవధిలో రెండు వాహనాలు దూసుకురావడంతో ఐదుగురు గాయపడ్డారు. ఎస్సైకు తృటిలో ప్రమాదం తప్పింది. తుని రూరల్ ఎస్సై శివప్రసాద్, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
 
 పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, పాలకొల్లుకు చెందిన బావ, బావమరుదులైన దాట్ల గంగరాజు (51), మంతెన  బలరామరాజు (51) కలిసి శనివారం ఉదయం పెళ్లి శుభలేఖలు పంచడానికి కారులో విశాఖపట్నం బయలుదేరారు. తుని మండలం ఎర్రకోనేరు వద్ద ఉదయం 9.30 సమయంలో వీరు ప్రయాణిస్తున్న కారు జాతీయ రహదారిపై వెళుతున్న లారీని వెనుక నుంచి ఢీకొంది. లారీ వెనుక భాగంలోకి కారు చొచ్చుకుపోవడంతో ఇద్దరూ సంఘటన స్థలంలోనే చనిపోయారు. నుజ్జయిన కారులోనే మృతదేహాలు చిక్కుకుపోయాయి. కారులో  చిక్కుకుపోయిన గంగరాజు, బలరామరాజు మృతదేహాలను బయటకు తీయడానికి రెండు గంటలు పట్టింది. పలుగులతో కారు డోర్లను పగులగొట్టి బయటకుతీశారు. స్థానికులు పోలీసులకు సహకరించారు. తుని ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం గంగరాజు, బలరామరాజు మృతదేహాలను బంధువులకు అప్పగించారు.
 
 దూసుకొచ్చిన వాహనాలు
 ఈ ప్రమాద వార్త తెలిసిన వెంటనే పోలీసులు, పాత్రికేయులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ సమయంలో వర్షం కురవడం వల్ల సహాయక చర్యలకు ఇబ్బంది ఏర్పడింది. కారును తాళ్లతో కట్టి లారీ నుంచి వేరు చేస్తుండగా, రాజమండ్రి నుంచి విశాఖపట్నం వెళుతున్న సుమో అటుగా దూసుకొచ్చి, డివైడర్ పైకి ఎక్కింది. పోలీసులు, విలేకరులు పక్కకు తప్పుకున్నారు. మరో పది నిమిషాల వ్యవధిలో విలేకరులు, పోలీసుల పైకి ఓ కారు వేగంగా వచ్చి అక్కడున్న పోలీసు జీప్‌ను ఢీకొంది. ఆ జీప్ లారీ కింద ఇరుక్కున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు పాత్రికేయులు, కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. అక్కడున్న ఎస్సై శివప్రసాద్ త్రుటిలో అపాయం నుంచి తప్పించుకున్నారు.
 
 పాత్రికేయులు ఎం.సూర్యనారాయణ, రామృకృష్ణ, వాసు, తుని మండలం రాజుపేటకు చెందిన కిల్లాడ దుర్గకు గాయాలు కావడంతో, 108లో తుని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి  తరలించారు. వాహనాలను నిర్లక్ష్యంగా నడిపిన ఇద్దరు డ్రైవర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పాత్రికేయులను తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా పరామర్శించారు. ‘సాక్షి’ తుని రూరల్ విలేకరి సూర్యనారాయణకు తీవ్ర గాయం కావడంతో వైద్యులు చికిత్స అందించారు.
 
 శుభలేఖలు పంచడానికి వెళ్తూ..
 బలరామరాజు పెద్ద కుమార్తెకు ఆగస్టు 13న వివాహం జరగనుంది. బంధువులు, స్నేహితులకు శుభలేఖలు పంచడానికి బావమరిది గంగరాజుతో కలసి శనివారం పాలకొల్లు నుంచి కారులో బయలుదేరారు. శుభలేఖలు పంచడానికి వెళ్లిన వీరు క్షేమంగా తిరిగొస్తారని ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులకు తీరని విషాదం మిగిలింది. బావ, బావమరుదులైనా స్నేహితుల్లా కలిసిమెలిసి ఉండేవారని గంగరాజు సోదరుడు వెంకట్రాజు కన్నీరు పెట్టుకున్నారు. భీమవరానికి చెందిన గంగరాజు ఆక్వా వ్యాపారం చేస్తున్నారు. ఆయనకు భార్య సుబ్బలక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు. పాలకొల్లుకు చెందిన బలరామరాజుకు భార్య రాధారాణి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
 

>
మరిన్ని వార్తలు