దుర్గమ్మకు పట్టువస్ర్తాలు సమర్పించిన టీటీడీ ఛైర్మన్‌

6 Oct, 2019 17:30 IST|Sakshi
(ఫైల్‌ ఫోటో)

సాక్షి, విజయవాడ: బెజవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఆదివారం పట్టువస్త్రాలు సమర్పించారు. ఆయనకు ఆలయ వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలి​కారు. టీటీడీ తరపున దుర్గమ్మకు పట్టు వస్ర్తాలు సమర్పించిన వైవీ సుబ్బారెడ్డి అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా  మీడియాతో మాట్లాడుతూ.. తిరుమలలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయన్నారు. టీటీడీ తరపున దుర్గమ్మకు సారె ఇవ్వడం ఆనవాయితీగా వస్తోందన్నారు. అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించడం అదృష్టంగా భావిస్తున్నానని వైవీ తెలిపారు.

రాష్ట్ర్రంలో అన్ని దేవాలయాల్లో ధూప,దీప నైవేద్యాలకు దేవాదాయ శాఖ నిధులు కేటాయించిందని వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలకు దుర్గమ్మ ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నానని తెలిపారు. సుబ్బారెడ్డికి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఈవో సురేష్‌బాబు,అర్చకులు స్వాగతం పలికారు. విజయవాడలో దసరా ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. దుర్గాదేవి అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.

దుర్గమ్మ తెప్పోత్సవానికి రెండంచెల భద్రత
దుర్గమ్మ తెప్పోత్సవం నిర్వహణపై జిల్లా కలెక్టర్‌ ఆదివారం వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. రెండంచెల భద్రత నడుమ దుర్గమ్మ తెప్పోత్సవాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. దసరా నవరాత్రుల సందర్భంగా విజయవాడ కనకదుర్గ అమ్మవారికి తెప్పోత్సవం నిర్వహించడం ఆనవాయితీ వస్తోందన్నారు. బోటు సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని  చర్యలు చేపట్టాలని సంబంధింత అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టిన తర్వాతే తెప్పోత్సవం నిర్వహించాలని వెల్లడించారు. ఈ సమీక్ష సమావేశంలో రెవెన్యూ,పోలీస్‌, దేవాదాయ, పురపాలక, విపత్తు నిర్వహణ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా