మలేరియాతో ఇద్దరు విద్యార్థుల మృతి

21 Sep, 2013 01:32 IST|Sakshi

 రాజవొమ్మంగి, న్యూస్‌లైన్ :
 తూర్పు ఏజెన్సీ ప్రాంతం రాజవొమ్మంగిలో మలేరియాతో ఒకేరోజు ఇద్దరు విద్యార్థులు మరణించారు. వీరిలో ఒకరు ఓ ప్రయివేటు పాఠశాలలో ఆరోతరగతి చదువుతున్న స్థానిక గిరిజనుడు కాగా, మరొకరు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రయివేటుగా ఇంటర్మీడియెట్ చదువుతున్న విద్యార్థిని. వివరాలు ఇలా ఉన్నాయి. రాజవొమ్మంగికి చెందిన పాతర శామ్యూల్‌రాజు (13) ఏలేశ్వరం మండలం పరింతడక గ్రామంలోని ఏఎంజీ పాఠశాలలో చదువుతున్నాడు. పదిరోజులుగా మలేరియా వ్యాధితో బాధపడుతున్న ఈ బాలుడు సకాలంలో సరైన వైద్యం అందక శుక్రవారం తెల్లవారుజామున కాకినాడ జీజీహెచ్‌లో మరణించాడు. ఈ నెల 9న శామ్యూల్‌రాజుకు నీరసంగా ఉందనే కబురు రావడంతో అతడి తల్లి సత్యవతి ఏలేశ్వరం వెళ్లి రాజవొమ్మంగి తీసుకొచ్చింది. స్థానిక ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స చేయించాలని ప్రయత్నించగా, అప్పటికే పరిస్థితి విషమంగా వుందని సత్యవతి తెలిసింది. దీంతో అతడ్ని ఈ నెల 11న కాకినాడ జీజీహెచ్‌కి తరలించారు. అక్కడ రెండు రోజుల అనంతరం కోమాలోకి వెళ్లిన  శామ్యూల్‌రాజు మరణించాడని కుటుంబసభ్యులు తెలిపారు. చదువుకొని పైకి వస్తాడని ఎంతో ఆశించామని, దేవుడు తమను అన్యాయం చేశాడని చెబుతూ సత్యవతి కన్నీరు మున్నీరుగా విలపించింది. శామ్యూల్‌రాజుకు రక్త పరీక్షలు చేయించగా సెలిబ్రల్ మలేరియా సోకినట్టు నిర్ధారణ అయిందని కుటుబసభ్యులు చెప్పారు.  
 
 ఇదిలాఉండగా  పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు కు చెందిన కె.సీతామహాలక్ష్మి స్థానిక ఆంజనేయస్వామి గుడి సమీపంలో తన పిన్ని, ఫిజిక్స్ లెక్చరర్  దమయంతి వద్ద ఉంటోంది. సీతామహాలక్ష్మి  ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రయివేటుగా బైపీసీ చదువుతోంది. కాగా వారం రోజులుగా ఆమె  జ్వరంతో బాధపడుతుంటే ప్రయివేటు ఆస్పత్రిలో పరీక్షలు చేయించారు. ఆమెకు సెరిబ్రల్ మలేరియా, టైఫాయిడ్, కామెర్లు సోకినట్టు తెలిసింది. దీంతో ఆమెను శుక్రవారం భీమడోలు తరలిస్తూ ఉండగా దారిలో మరణించింది. ఇలా ఒకేరోజు ఇద్దరు మలేరియాకి బలి కావడంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు