గోదావరిలో మునిగి ఇద్దరు విద్యార్థులు మృతి

19 Mar, 2019 11:42 IST|Sakshi
విద్యార్థుల మృత దేహలను చూసి కన్నీటి పర్యంతమవుతున్న ఉపాధ్యాయులు, విద్యార్థులు, నిబంధనలకు విరుద్ధంగా నదిలో వేసిన రోడ్డు

సాక్షి, నిడదవోలు రూరల్‌:  సరదాగా గోదావరి స్నానానికి దిగిన ఇద్దరు విద్యార్థులు నీట మునిగి మరణించారు. ఈ దుర్ఘటన సోమవారం మధ్యాహ్నం నిడదవోలు మండలం పందలపర్రు ఇసుక ర్యాంపు వద్ద గోదావరి మధ్యలో సంభవించింది. స్నానానికి దిగిన విద్యార్థులు పెట్టా సతీష్‌ (15), పూడి రాజు (14) నదీ గర్భంలో గొయ్యి ఉండటంతో నీటమునిగి మృత్యువాత పడ్డారని స్థానికులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. నిడదవోలు మండలం పురుషోత్తపల్లిలోని జెడ్పీ హైస్కూల్లో పెట్టా సతీష్‌ పదో తరగతి, పూడి రాజు తొమ్మిదో తరగతి చదువుతున్నారు.

సతీష్‌కు సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కావడంతో ఉదయం  జరిగిన తెలుగు పరీక్ష రాసి వచ్చాడు. మధ్యాహ్నం సతీష్, రాజు కలిసి పందలపర్రు ఇసుక ర్యాంపువద్ద గోదావరిలో స్నానం చేయటానికి దిగారు. కొద్దిసేపటికే వీరు గల్లంతవ్వడంతో అదే గ్రామానికి చెందిన షకీన్‌ అనే విద్యార్థి గమనించి స్థానికులకు సమాచారం అందించాడు. దీంతో కొంతమంది వ్యక్తులు నదిలో గాలించి సతీష్, రాజు మృతదేహలను బయటకు తీశారు. సమిశ్రగూడెం ఎస్సై ఎస్‌.శంకర్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వారి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ పాపం ఎవరిది!
ఇద్దరు బాలుర మరణానికి కారకులు ఎవరు? విచక్షణా రహితంగా ఇసుక తవ్వి గోదావరిలో గోతులు మిగిల్చిన ర్యాంపు నిర్వాహకులదా? అయినా పట్టించుకోని రెవెన్యూ, పోలీస్‌ అధికారులదా? పందలపర్రు ఇసుక ర్యాంపులో నదిలోని ఇసుకను అక్రమంగా తరలించేందుకు నిబంధనలకు విరుద్ధంగా రోడ్లు వేసేశారు. గత నెల 28 నుంచి ర్యాంపు మూతబడింది. నదీ గర్భంలోకి వేసిన రోడ్లు మాత్రం తొలగించకపోవడంతో పందలపర్రు, పురుషోత్తపల్లి గ్రామాలకు చెందిన విద్యార్థులు ప్రతిరోజు స్నానాలకు వస్తున్నారు. ర్యాంపులో ఇష్టానుసారంగా ఇసుకను తవ్వేయడంతో పెద్దపెద్ద గోతులు ఏర్పడ్డాయి. రోడ్డు మధ్యలో ఏర్పాటు చేసిన తూరలు వద్ద స్నానానికి దిగడంతో గోతుల్లో పడి ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. రెవెన్యూ, పోలీస్‌ అధికారులు సైతం పట్టించుకోకపోవడంతో ర్యాంపు ప్రమాదాలకు నిలయంగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.  


అప్పటి వరకు కలసి మెలసి..
అప్పటి వరకు వారితో కలసి మెలసి తిరిగిన స్నేహితులిద్దరూ మృతి చెందడంతో ఘటనా స్థలంలో మృతదేహలను చూసి పురుషోత్తపల్లి జెడ్పీ హైస్కూల్‌ ఉపాధ్యాయులు, విద్యార్థులు కంటి నీరు పెట్టారు. సతీష్‌ తండ్రి స్వామి తాపీమేస్త్రి.  నాయనమ్మ ఇంటి వద్ద ఉంటూ చదువుకుంటున్నాడు. రాజు తండ్రి శ్రీను కూలీ. రాజు అన్నయ్య రాము పదో తరగతి చదువుతున్నాడు. తెలుగు పరీక్ష రాసి మరో పరీక్షకు ప్రిపేర్‌ అవుతుండగా తమ్ముడు రాజు మృతదేహన్ని చూసి గుండెలవిసేలా విలపించాడు. కుటుంబసభ్యులు, బంధువుల రోదనలతో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి.

 

మరిన్ని వార్తలు