రెండువేల ఎకరాల్లోనే బందరు పోర్టు నిర్మించాలి

13 Jul, 2016 00:39 IST|Sakshi

గతంలో ప్రతిపక్షంలో ఉండగా చెప్పిన మాట ప్రకారమే పోర్టు నిర్మించాలి
విదేశీ కంపెనీలకు కట్టబెట్టేందుకే  1.05లక్షల ఎకరాలు
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పి.గౌతంరెడ్డి

 
 
విజయవాడ (గాంధీనగర్) :     ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు చెప్పిన విధంగా బందరు పోర్టును  రెండు వేల ఎకరాల్లో నిర్మించాలని  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పూనూరు గౌతంరెడ్డి డిమాండ్ చేశారు. విజయవాడలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు అవినీతికి అంతులేకుండా పోతోందని, అబద్ధాలతో చంద్రబాబు రోజులు గడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు  ప్రతిపక్షంలో ఉండగా పోర్టు నిర్మాణానికి భూములు తీసుకోవడానికి వీల్లేదు, 2వేల నుంచి 4వేల ఎకరాలు సరిపోతుందని చెప్పారని ఆయన గుర్తుచేశారు. ఆయన నాలుక నాలుగు రకాలుగా మడత పెట్టగలడని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు మాటమార్చి బందరు పోర్టు పేరుతో 1.05 లక్షల ఎకరాలు పూలింగ్ విధానంలో రైతుల నుంచి లాక్కునేందుకు సన్నద్ధమవుతున్నారన్నారు. కేబినెట్‌లో నిర్ణయాలు ఒక రకంగా, బయటకు వచ్చి మీడియా ఎదుట మరో రకంగా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. రాజధాని పేరుతో 33వేల ఎకరాల భూమిని రైతుల నుంచి లాక్కున్న చంద్రబాబు, జిల్లాల్లోని అసైన్డ్, పోరంబోకు, దేవాలయాలకు చెందిన లక్షల ఎకరాలు కైంకర్యం చేసేందుకు కుయుక్తులు పన్నుతున్నారని చెప్పారు. పోర్టు పేరుతో భూములు లాక్కుని సింగపూర్, జపాన్ కంపెనీలకు కట్టబెడితే సహించేది లేదని హెచ్చరించారు.
 
కేంద్రం ఎందుకు అడ్డుకోవడం లేదు..
చంద్రబాబు చైనా పర్యటనలో అక్కడి కంపెనీలతో చేసుకున్న రహస్య ఒప్పందాలు బహిర్గతం చేయాలని గౌతంరెడ్డి డిమాండ్ చేశారు. ఇతర దేశాలతో చంద్రబాబు ఒప్పందాలు చేసుకుని భారత్ భూభాగంలోని పోర్టులు, భూములు అప్పగిస్తుంటే మోదీ ప్రభుత్వం కళ్లు మూసుకుందా? అని ప్రశ్నించారు. ఒప్పందాలను అడ్డుకోవాల్సిన బాధ్యత  కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై ఉందన్నారు.
 
మంత్రులు డూడూ బసవన్నలు
మంత్రులు డూడూ బసవన్నల్లా తలూపుతున్నారు. గొర్రెల్లా తల ఒంచుకుని వెళ్తున్నారు. రాష్ట్ర మంత్రులకు ఏమాత్రం విలువలేదని గౌతంరెడ్డి అన్నారు. మంత్రులతో నిమిత్తం లేకుండా చంద్రబాబే  నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు.
 
పురాతన కోర్టులో పనిచేయడం అదృష్టం
జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మణరావు

మచిలీపట్నం : న్యాయవ్యవస్థలో ఎంతో చరిత్ర కలిగిన మచిలీపట్నంలోని జిల్లా కోర్టులో పనిచేయడం తన అదృష్టమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై.లక్ష్మణరావు అన్నారు. మచిలీపట్నం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి పరిచయ కార్యక్రమం మచిలీపట్నం బార్ అసోసియేషన్ హాలులో మంగళవారం జరిగింది. బార్  అధ్యక్షుడు కూనపరెడ్డి శ్రీనివాసరావు జిల్లా ప్రధాన న్యాయమూర్తిని న్యాయవాదులకు పరిచయం చేశారు. అసోసియేషన్ తరఫున జిల్లా ప్రధాన న్యాయమూర్తిని సన్మానించారు. అనంతరం జిల్లా కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు. పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు.
 
 

>
మరిన్ని వార్తలు