మరో భూవివాదంలో బోండా ఉమ

24 Feb, 2018 15:00 IST|Sakshi

సాక్షి, అమరావతి : టీడీపీ ఎమ్యెల్యే అక్రమాల పుట్ట రోజుకొకటి బయట పడుతున్నాయి. విజయవాడలో స్వతంత్ర్య సమరయోధుడి భూమిని కబ్జా చేసిన వివాదం మరవక ముందే బోండా ఉమ, ఆయన అనుచరులు తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. పెనమలూరు డెవెలప్‌మెంట్‌ పేరుతో తన 86 సెంట్ల భూమిని ఆక్రమించారని ఇద్దరు మహిళలు జాయింట్‌  కలెక్టర్‌ను ఆశ్రయించారు. అభివృద్ధి పేరుతో తమ భూమిని కాజేయాలని ఎమ్మెల్యే బోండా ప్రత్నిస్తున్నారని పెనమలూరుకు చెందిన ఉమాదేవి, లక్ష్మీ భవాని జాయింట్‌ కలెక్టర్‌నకు ఫిర్యాదు చేశారు.

భూమిని అప్పగించకపోతే చంపేస్తామంటూ బోండా ఉమ అనుచరులు పోలవరపు కిషన్‌, వెంకట నరసయ్య బెదిరిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గత మూడేళ్లలో వారి భూముల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టలేదని, పోనీ తమ భూములను అప్పగించమని కోరితే బెదిరింపులకు పాల్పడుతున్నారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. తమకు తెలియకుండానే తమ భూమిని తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి అప్పు తెచ్చామంటున్నారని, వాటికి వడ్డీ కట్టాలంటూ బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులను కలిసి తమ బాధలను చెప్పుకొని న్యాయం చేమని కోరితే ఎమ్మెల్యేకు వత్తాసు పలుకుతున్నారని వాపోయారు. ఏమైనా ఉంటే కోర్టులో తేల్చుకోవాలంటూ అధికారులు ఉచిత సలహాలు ఇస్తున్నారని కంటతడిపెట్టుకున్నారు.

మరిన్ని వార్తలు