పొట్టకూటికొచ్చి కానరాని లోకాలకు...

17 Feb, 2015 03:42 IST|Sakshi
పొట్టకూటికొచ్చి కానరాని లోకాలకు...

ఆత్మకూరు రూరల్ : పొట్టకూటి కోసం ఊరు కాని ఊరొచ్చిన ఇద్దరు యువకులను రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు బలితీసుకుంది. ట్రాక్టర్ బోల్తాపడటంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రగాయాలపాలయ్యారు. ఈ ఘటన ఆత్మకూరు మండలంలోని కరటంపాడు, బసవరాజుపాళెం డొంక రోడ్డులో చెరువు కట్ట వద్ద సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కృష్ణపట్నం నుంచి రాయలసీమకు విద్యుత్ సరఫరా చేసేందుకు టవర్లు నిర్మించే కాంట్రాక్టర్ వద్ద పశ్చిమబెంగాల్‌లోని మాల్దా జిల్లాకు చెందిన పలువురు కూలీలు పనిచేస్తున్నారు.

వీరు అల్లీపురం సమీపంలోని గోదాము వద్ద ఉంటూ పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో బసవరాజుపాళెం వద్ద నిర్మాణం ఉన్న టవర్ వద్దకు సామాన్లతో పాటు 15 మంది కూలీలు, వారికి కావాల్సిన ఆహారపదార్ధాలతో అల్లీపురం నుంచి ట్రాక్టర్ బయలుదేరింది. కరటంపాడు దాటిన తర్వాత మహిమలూరు చె రువు కట్ట వద్ద ఆదివారం రాత్రి బొంతరాళ్ల లారీ బోల్తాపడటంతో అందులోని రాళ్లు దారికి అడ్డంగా ఉన్నాయి. దీంతో కూలీలతో వెళుతున్న డ్రైవర్ రాజేష్ ట్రాక్టర్‌ను చెరువు కట్టపైకి మళ్లించాడు. కట్ట పైభాగానికి వెళ్లిన తర్వాత ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. డ్రైవర్‌కు ఇరువైపులా కూర్చున్న షేక్ అలాం(32), షేక్ కలాం (31) ఇంజన్ కింద ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతిచెందారు. అక్కడే కూర్చున్న షేక్ షౌకత్ ఆలిని దారిన వెళుతున్న వారు బయటకు లాగారు.

ఆలితో పాటు గాయపడిన రాజేష్‌ను 108 అంబులెన్స్‌లో ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. షౌకత్ ఆలి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఘటనా స్థలాన్ని ఆత్మకూరు డీఎస్పీ కేఎస్‌ఎస్‌వీ సుబ్బారెడ్డి, సీఐ అల్తాఫ్‌హుస్సేన్, ఎస్సై వేణుగోపాల్‌రెడ్డి పరిశీలించారు. ట్రాక్టర్‌ను క్రేన్‌సాయంతో లేపి మృతదేహాలను వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అలాంకు భార్య, ముగ్గురు పిల్లలు ఉండగా, కలాంకు భార్య, ఓ కుమారుడు ఉన్నారు. కరటంపాడు సెంటర్‌లో టీ తాగి బయలుదేరిన పది నిమిషాలకే ప్రమాదానికి గురయ్యామని మృతుల బంధువు బాబు ఆవేదన వ్యక్తం చేశాడు.

మరిన్ని వార్తలు