కూలి కోసం వెళితే కరెంటు కాటేసింది

15 May, 2016 03:37 IST|Sakshi
కూలి కోసం వెళితే కరెంటు కాటేసింది

 దారవరం(చాగల్లు) :   విద్యుదాఘాతం వల్ల శనివారం ఇద్దరు కూలీలు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది.  పోలీసుల కథనం ప్రకారం..

 చాగల్లు మండలం దారవరం శివారులో ఉన్న సూర్య రైస్‌మిల్లులో శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన కొంతమంది జట్టు కార్మికులు పనిచేస్తున్నారు. శనివారం ఉదయం మిల్లులో పనికి వెళ్లిన కార్మికులు లారీలో నుంచి ధాన్యం బస్తాలను స్ట్రెగర్(క్రేన్) సాయంతో దిగుమతి చేశారు. తరువాత మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో స్ట్రెగర్‌ను రైస్‌మిల్లు గోదాములోకి తరలించేందుకు మిల్లు పక్కనే ఉన్న మట్టి రోడ్డుపైకి తీసుకువస్తుండగా.. విద్యుత్ తీగలు అడ్డువచ్చాయి.

దీంతో కూలీలు స్ట్రెగర్‌ను కొంచెం కిందకి దించారు. ఈ సమయంలో 11కేవీ విద్యుత్ తీగలకు స్ట్రెగర్‌పైభాగం తగలడంతో దానిలోకి కరెంట్ ప్రసరించింది. దీంతో విద్యుదాఘాతానికి గురై  తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం మల్లవరం గ్రామానికి చెందిన నున్నగొప్పుల శ్రీను(35), శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం పున్నామి గ్రామానికి చెందిన పిన్నింటి రామకృష్ణ(38) మరణించారు. మీసాల సన్యాసినాయుడు, కొటికలపూడి వీరబాబు గాయపడ్డారు. క్షతగాత్రులు నిడదవోలు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ప్రమాద సమయంలో స్ట్రెగర్‌కు ఉన్న తాడు భాగం పట్టుకోవడంతో మిగిలిన కూలీలు సురక్షితంగా బయటపడ్డారు. విషయం తెలుసుకున్న విద్యుత్ శాఖాధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి వచ్చారు.  నిడదవోలు సీఐ ఎం.బాలకృష్ణ మాట్లాడుతూ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని చెప్పారు. ఎస్సై ఎం.జయబాబు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
 మరో రెండురోజుల్లో ఇంటికి వెళ్లిపోయేవాడు
 ప్రమాదంలో మృతి చెందిన శ్రీను మరో రెండు రోజుల్లో పనులు ముగించుకుని ఇంటికి వెళ్లిపోయేవాడని అతని మేనమామ సోమరాజు కన్నీరుమున్నీరయ్యారు. శ్రీను సొంతగ్రామమైన తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం మల్లవరంలో పనులు లేకపోవడంతో కుటుంబ పోషణకు వలస వచ్చాడు. స్థానిక రైస్‌మిల్లులో జట్టు పనులకు సుమారు 20 రోజుల క్రితం మరో పదిమందితో కలిసి వచ్చాడు. శ్రీనుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.  
 
 అనాథలను చేసి వెళ్లిపోయాడు
 ప్రమాదంలో మృతి చెందిన రామకృష్ణ భార్య ధనలక్ష్మి భర్త మృతదేహంపై పడి రోదిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది. తన ఇద్దరి అడపిల్లలను, తనను అనాథలను చేసి వెళ్లిపోయాడంటూ భోరున విలపించింది. కొద్దిసేపట్లో భోజనానికి వచ్చేవాడని, ఇంతలోనే ఇలా జరిగిపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. రామకృష్ణ శ్రీకాకుళం జిల్లా నుంచి రెండేళ్ల క్రితం కుటుంబంతో సహా వలస వచ్చాడు. భార్యతో కలిసి రైస్‌మిల్లులో పనిచేస్తున్నాడు.  
 

మరిన్ని వార్తలు