బోరుబావిలో పడిపోయిన బాలుడు.. ఉత్కంఠ

15 Aug, 2017 19:20 IST|Sakshi
బోరుబావిలో పడిపోయిన బాలుడు.. ఉత్కంఠ

గుంటూరు: పెద్దల నిర్లక్ష్యం మరో చిన్నారిని ప్రమాదంలో పడేసింది. గుంటూరు జిల్లా వినుకొండ మండలం ఉమ్మడివరం గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌(2) అనే బాలుడు మంగళవారం సాయంత్రం ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడిపోయాడు. తండ్రి మల్లికార్జున్‌తో కలిసి పశువుల కొట్టం దగ్గరికి వెళ్లిన బాలుడు.. ఆడుకుంటూండగా ఈ ఘటన జరిగింది.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రెస్క్యూ టీమ్‌లను ఉమ్మడివరానికి పంపించారు. గుంటూరు రూరల్‌ ఎస్పీ, జాయింట్‌ కలెక్టర్‌, డీఎంహెచ్‌ఓలు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం బాలుడు.. సుమారు ఇరవై అడుగులు లోతులో చిక్కి ఉన్నట్లు తెలిసింది. దీంతో బోరుబావికి సమాంతరంగా ఎక్స్‌కవేటర్లతో తొవ్వకం చేపట్టారు. కలెక్టర్‌ కోన శశిధర్‌ కూడా ఘటనా స్థలికి రానున్నట్లు అధికారులు చెప్పారు. బాలుడిని రక్షించేందుకు అవసరమైన అన్నిరకాల చర్యలను తీసుకుంటామని తెలిపారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నిరుపయోగంగా ఉన్న బోరుబావుల్లో చిన్నపిల్లలు పడిపోవడం పరిపాటిగా మారింది. కొద్ది నెలల కిందట తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చన్‌వెళ్లిలో బోరుబావిలో పడిన చిన్నారి మీనా మృతి చెందిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు