సోదరిని చూడకుండానే అనంతలోకాలకు..

19 Nov, 2017 09:08 IST|Sakshi

ఇసుక లారీ ఢీకొని ఇద్దరు యువకులు మృతి

బైక్‌పై వెళ్తుండగా గోదావరి గట్టుపై ఘటన

కపిలేశ్వరపురం (మండపేట): మండలంలోని తాతపూడి గ్రామ శివారు గోపాలరావుపేట గోదావరి గట్టుపై శుక్రవారం ఇసుక లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. అంగర పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... కేదారిలంక గ్రామానికి చెందిన గంధం ఈశ్వరరావు (32), వీరా జయబాబు (26) సీబీజెడ్‌ బైక్‌పై జొన్నాడ నుంచి కపిలేశ్వరపురం వైపునకు గోదావరి గట్టుపై వస్తున్నారు. తాతపూడి గ్రామశివారు గోపాలరావుపేట వద్దకు వచ్చేసరికి కోరుమిల్లి ఇసుక ర్యాంపు నుంచి ఇసుక లోడ్‌తో వస్తున్న లారీ బైక్‌ను ఢీకొట్టింది. దీంతో ఈశ్వరరావు తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. జయబాబుకు పలు చోట్ల గాయాలు కావడంతో 108 వాహనంలో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయారు.

 విషయం తెలుసుకున్న మండపేట రూరల్‌ సీఐ లక్షణరెడ్డి, అంగర ఎస్సై బి.రాజేష్‌కుమార్‌ తన సిబ్బందితో వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీఐ పర్యవేక్షణలో ఎస్సై రాజేష్‌కుమార్‌ కేసు చేస్తున్నారు. మృతుడు ఈశ్వరరావుకు భార్య పార్వతి, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ట్రాక్టరు డ్రైవరుగా జీవనం సాగిస్తున్నారు. మరో మృతుడు జయబాబు ఇటుక బట్టీలో కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇంటికి పెద్ద కొడుకు కావడంతో జయబాబు మృతి వార్తను కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేక తల్లడిల్లుతున్నారు. జయబాబు మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి, ఈశ్వరరావు మృతదేహాన్ని కొత్తపేట ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. 

అనురాగం పొందకుండానే అనంతలోకాలకు...
మృతుడు జయబాబు ఇటీవల అయ్యప్ప మాల ధరించాడు. కఠిన దీక్ష కావడంతో కుటుంబ సభ్యులకు కాస్త దూరంగా ఉన్నాడు. ద్వారపూడిలో దీక్ష విరమణ చేశారు. సోదరిని చూద్దామని జయబాబు తన గ్రామానికి చెందిన ఈశ్వరరావుతో కలిసి అయ్యప్ప స్వామి ప్రసాదాన్ని తీసుకుని బైక్‌పై కె.గంగవరం మండలం తమ్మయ్యపాలెం గ్రామానికి బయలుదేరారు. ఈలోగా లారీ రూపంలో మృత్యువు కాటేసింది. సోదరి అనురాగం పొందకుండానే అనంత లోకానికేగిపోయాడు.

మరిన్ని వార్తలు