యురేనియం బాధితులకు ఊరట

17 Jul, 2019 10:43 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి

సాక్షి, కడప : వేముల మండలంలోని యురేనియం ప్రభావిత గ్రామాల సమస్యల పరిష్కారానికి వీలుగా గ్రీవెన్స్‌ కమిటీ పునరుద్ధరణకు యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (యూసీఐఎల్‌) అధికారులు అంగీకరించారు. తరచూ గ్రీవెన్స్‌ కమిటీ సమావేశాలు నిర్వహించి కాలుష్యం, భూసేకరణ, ఉద్యోగాలు తదితర సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి చొరవతో మంగళవారం కలెక్టర్‌ సమక్షంలో యూసీఐఎల్‌ సీఎండీ, ప్రభావిత గ్రామాల ప్రజలతో సమావేశం జరిగింది.

యూసీఐఎల్‌ పరిధిలోని కేకే కొట్టాల, కనంపల్లె, మబ్బుచింతలపల్లె, భూమాయపల్లె ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అవినాష్‌రెడ్డి వివరించారు. టెయిలింగ్‌ పాండ్‌లోని వ్యర్థ జలాలు భూమిలోకి ఇంకి భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని తెలిపారు. ఇందువల్ల పంటలు పూర్తిగా దెబ్బతింటున్నాయని చెప్పారు. కలుషిత జలాలు సేవించడం వల్ల పశువులు చనిపోతున్నాయని, ప్రజలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని వివరించారు.

కొంతమంది బాధితులకు పరిహారం చెల్లించాల్సి ఉందన్నారు. పలువురికి ఉద్యోగాలు ఇవ్వాలన్నారు.  126 ఎకరాల భూమిని సేకరించాలన్నారు. ఇలాంటి సమస్యలను తెలుసుకుని సకాలంలో పరిష్కరించేందుకు గతంలో గ్రీవెన్స్‌ కమిటీ సమావేశాలు తరుచూ జరిగేవని పేర్కొన్నారు.  ఐదారేళ్లుగా ఈ ఆనవాయితీకి యూసీఐఎల్‌ అధికారులు స్వస్తి చెప్పడం దురదృష్టకరమన్నారు. కేకే కొట్టాలలో ఏడాదిన్నరగా ప్రజలు కాలుష్యం బారిన పడి అల్లాడుతున్నారని తెలిపారు. గ్రీవెన్స్‌ కమిటీ తక్షణమే పునరుద్ధరించి బాధిత గ్రామాల ప్రజల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఇందుకు యూసీఐఎల్‌ సీఎండీ అంగీకరించారు.నెలాఖరులోపు కమిటీని పునరుద్ధరించి తరుచూ సమావేశాలు నిర్వహించడం ద్వారా అక్కడి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు

పంట నష్టపరిహారమివ్వాలి
కాలుష్యం కారణంగా పంట నష్టపోయిన అరటి రైతులకు పరిహారం ఇవ్వాలని ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి కోరారు. ఆరోగ్య పరిరక్షణకు తరచూ మెడికల్‌ క్యాంపులు నిర్వహించాలని కోరారు. దీనికి కూడా సంస్థ అధికారులు సమ్మతించారు. టెయిలింగ్‌పాండ్‌ నుంచి రివర్స్‌ పంపింగ్‌కు సహకరించాలని యూసీఐఎల్‌ అధికారులు కోరారు. బా«ధిత గ్రామాల ప్రజల సమస్యలు పరిష్కరిస్తేనే తాము సహకరిస్తామని ఎంపీ అవినాష్‌రెడ్డి అన్నారు. సుమారు రూ.6 కోట్ల వ్యయంతో పైపులైన్ల ద్వారా రక్షిత తాగునీటి సరఫరా చేస్తామని గతంలో ఇచ్చిన హామీని యూసీఐఎల్‌ నిలబెట్టుకోవాలని కోరారు.

అందుకు యూసీఐఎల్‌ అధికారులు ఆమోదం తెలిపారు. యురేనియం తవ్వకాల వల్ల భూమిలో నుంచి వెలువడుతున్న తెల్లటి దుమ్ము పంటలను ఆవరించి నష్టపరుస్తోందని రైతులు ఈ సందర్భంగా చెప్పారు. పంటలపై పేరుకుపోతున్న వైట్‌ పౌడర్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని, అక్కడి భూముల్లో ఉన్న ఖనిజాల వల్లే  పంటలు కలుíషితంగా మారి దెబ్బతింటున్నాయని యూసీఐఎల్‌ అధికారులు బదులిచ్చారు. ఇందుకు వైఎస్‌ అవినాష్‌ రెడ్డి అభ్యంతరం చెబుతూ గతంలో ఎన్నడూ లేని ఇలాంటి సమస్య యురేనియం ప్లాంటు ఏర్పాటు చేసిన తర్వాతనే ఎందుకు వచ్చిందంటూ నిలదీశారు.

మినిస్ట్రీ ఆఫ్‌ ఎన్విరాన్‌మెంట్‌ క్లియరెన్స్‌ ఇచ్చిన విధంగా 360 హెక్టార్లలో యూసీఐఎల్‌ మొక్కలు నాటాల్సి ఉన్నా ఆ పని ఎందుకు చేయలేదంటూ ప్రశ్నించారు.టెయిలింగ్‌పాండ్‌ వ్యర్థాలు భూమిలోకి దిగుతున్న విషయాన్ని తెలుసుకునేందుకు మానిటరింగ్‌ వెల్స్‌ను యూసీఐఎల్‌ అధికారులు పరిశీలించడం లేదని ఎంపీ అన్నారు. శ్యాంపిల్స్‌ కూడా సేకరించడం లేదని చెప్పారు. రెయిన్‌వాటర్‌ హార్వెస్టింగ్‌ పనులు కూడా చేపట్టడం లేదన్నారు.

గతంలో 200 అడుగుల లోతులో ఉన్న భూగర్బ జలం యూసీఐఎల్‌ వచ్చాక 1000 నుంచి 1500 అడుగుల్లోకి వెళ్లిపోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేకే కొట్టాల గ్రామ ప్రజలు కోరుతున్న విధంగా ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. పబ్లిక్‌ హియరింగ్‌ నిర్వహించిన తర్వాత చర్యలు తీసుకుంటామని యూసీఐఎల్‌ అధికారులు అన్నారు. కాలుష్యాన్ని పరిశీలించేందుకు ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలికి చెందిన ఓ అధికారిని ఇక్కడికి డెప్యూట్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామని అవినాష్‌ ఈ సందర్బంగా తెలిపారు. ఈ సమావేశంలో యూసీఐఎల్‌ సీఎండీ సీకే అస్నాని, డి(టి)ఎస్‌ఆర్‌ ప్రణేష్, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఏకే సారంగి, జనరల్‌ మేనేజర్‌ ఎంఎస్‌ రావు, డీజీఎంఎస్‌ ఎస్‌కే శర్మ, యూకే సింగ్, మేనేజర్‌ సంజయ్‌చటర్జీ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు