ఆ ఒక్కటి వదిలేస్తే..!

11 Jun, 2016 02:45 IST|Sakshi

ఇంకెక్కడ స్థలం కావాలన్నా ఓకే
ఒకవైపు స్వాధీనానికి నోటీసులు..  మరోవైపు బేరసారాలు
బడాబాబుల పక్షాన వుడా ద్వంద్వవైఖరి
అలా కుదరదన్న కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ
వందలాది స్థలాలు ఖాళీగా ఉన్నా పట్టించుకోలేదు
అడ్డగోలుగా ముందుకెళ్లి.. బోల్తా పడిన వుడా

 

 నిబంధనలు అలా ఉన్నాయంటున్నారు.. ఏళ్ల తరబడి ఖాళీగా ఉంటే స్వాధీనం చేసుకుని తీరుతామని బీరాలు పోతున్నారు. కానీ నగరంలో ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు ఇచ్చిన వందలాది స్థలాలు  ఏళ్ల తరబడి ఖాళీగానే పడున్నాయి. అడపదడపా నోటీసులివ్వడం తప్ప.. వాటి జోలికి ఏనాడూ వెళ్లని వుడా బాబులు.. కేంద్ర ప్రభుత్వ సంస్థకు ఇచ్చిన స్థలం విషయంలో ఎందుకింత కఠినంగా వ్యవహరించారని ఆరా తీస్తున్న కొద్దీ కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. పైగా స్వాధీనం చేసుకుంటామన్న వారు.. మధ్యలో దాన్ని వదిలేసుకుంటే.. ప్రత్యామ్నాయంగా మరో స్థలం ఇస్తామని బేరాసారాలకు దిగడమేమిటన్న తాజా వివాదం రాజుకుంటోంది.

 

విశాఖపట్నం : వంద కోట్ల విలువైన ఎన్‌ఎండీసీకి చెందిన  భూమిని వెనక్కి తీసుకోవాలన్న వుడా వివాదాస్పద నిర్ణయం వెనుక మరో కోణం వెలుగుచూస్తోంది. పాతికేళ్ల క్రితం ఎన్‌ఎండీసీ కొనుగోలు చేసిన అర ఎకరా భూమిని అడ్డగోలుగా స్వాధీనం చేసుకుని ఇంటర్ గ్లోబ్ హోటల్స్ ప్రైవేటు లిమిటెడ్‌కు నామమాత్రపు ధరకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో వుడా బరితెగింపునకు అడ్డుకట్ట పడినా..  తెరవెనుక జరిగిన వ్యవహారాలు ఇప్పుడు ఒక్కోటీ బయటకు వస్తున్నాయి.

 
ఖాళీగా వందలాది స్థలాలు

ఏళ్ల తరబడి ఎటువంటి నిర్మాణాలు చేపట్టకుండా  ఖాళీగా వదిలేయడం వల్లే బీచ్‌రోడ్డులో ఉన్న జాతీయ ఖనిజాభివృద్ధి సంస్ఖ (ఎన్‌ఎండీసీ)  స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపట్టామని వుడా అధికారులు బీరాలు పోతున్నారు. నిబంధనల మేరకే అలా చేశామని వాదిస్తున్నారు. వాస్తవానికి అలా ఖాళీగా వదిలేసిన స్థలాలు నగరంలో లెక్కలేనన్ని ఉన్నాయి. ఆయా స్థలాల యజమానులకు అడపాదడపా నోటీసులు ఇవ్వడం తప్పించి ఒక్క గజం భూమిని కూడా స్వాధీనం చేసుకునేందుకు వుడా అధికారులు కనీస చర్యలు చేపట్టలేదు. కానీ ఏకంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌ఎండీసీ స్థలానికి ఎసరు పెట్టేందుకు మాత్రం నిబంధనలను సాకుగా చూపించారు. మరోవైపు ఎన్‌ఎండీసీతో  తెరవెనుక రాయబేరాలూ సాగించారు. బీచ్ రోడ్డులోని స్థలం అప్పజెబితే..నగరంలో ఎక్కడ కావాలంటే అక్కడ మరో స్థలం ఇస్తామని హామీ ఇవ్వడం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే స్వాధీనం చేసుకోవాలే గానీ.. ప్రత్యామ్నాయ స్థలం ఇస్తామని బేరం పెట్టడం చూస్తే.. వుడా కుట్ర ఏమిటో అర్థమవుతుంది.

 
ఇంటర్ గ్లోబ్ ఎంచుకున్న స్థలమట

పర్యాటకాభివృద్ధి కోసం రాష్ర్టంలో పెట్టుబడులు పెట్టాలన్న ప్రభుత్వ ఆహ్వానంపై జాతీయస్థాయి కార్పొరేటు సంస్థలు ఇటీవల విశాఖ, విజయవాడ, తిరుపతి నగరాల్లో పర్యటించాయి. ఆ క్రమంలో విశాఖలో పర్యటించిన ఇంటర్ గ్లోబ్ హోటల్స్ ప్రతినిధులను బీచ్ రోడ్డులో సువిశాలంగా ఉన్న ఎన్‌ఎండీసీకి చెందిన ఖాళీ స్థలం ఆకర్షించింది. ఇక్కడైతే స్టార్ హోటల్ కట్టేందుకు తాము సిద్ధమని అప్పటికప్పుడే వారు ప్రకటించేశారు. పర్యాటకశాఖ అధికారులు ఈ విషయమై జీవీఎంసీ, రెవెన్యూ ఉన్నతాధికారులతో మాట్లాడగా, అది గతంలో వుడా విక్రయించిన స్థలమని తేలింది. అంతే.. ఆ స్థలాన్ని ఎలాగైనా స్వాధీనం చేసుకునే పనిని ప్రభుత్వ పెద్దలు వుడా అధికారులకు అప్పజెప్పారు. మొదట్లో వుడా అధికారులు తటపటాయించినా బడాబాబులు రంగప్రవేశం చేయడంతో అడ్డగోలుగా ముందుకు వెళ్లిపోయారు.  ఆ భూమిని వెనక్కి తీసుకునే ప్రక్రియను వేగవంతం చేశారు.  కండిషనల్ రిజిస్ట్రేషన్‌లో ఉన్న నిబంధనను తెరపైకి తెచ్చి స్థలాన్ని వెనక్కి తీసుకునేందుకు నోటీసులిచ్చారు.

 
వుడా అధికారులకు అక్కడా అవమానమే..

ఖాళీగా ఉన్న స్థలంలో వెంటనే నిర్మాణాలు చేపడతామని, వెనక్కి తీసుకునే చర్యలు ఉపసంహరించుకోవాలన్న ఖనిజాభివృద్ధి సంస్థ విశాఖ అధికారుల గోడును పట్టించుకోని వుడా అధికారులు.. ఇదే సమయంలో ఎన్‌ఎండీసీ ఉన్నతస్థాయి అధికారులతో రాయబేరం నడిపారు. బీచ్‌రోడ్డు పక్కన స్థలాన్ని వదిలేస్తే ప్రత్యామ్నాయంగా మీకు మరో చోట స్థలం ఇస్తామనే  ప్రతిపాదన  తీసుకొచ్చారు. వెంటనే కావాలంటే  రుషికొండ సమీపంలో ఇప్పటికే నిర్మించిన రే హౌసింగ్ ప్లాట్స్ ను  కేటాయిస్తామని హామీ ఇచ్చారు.  ఈ మేరకు  వుడా వీసీ టి.బాబూరావునాయుడు మే నెలలో హైదరాబాద్ వెళ్లి ఎన్‌ఎండీసీ చైర్‌పర్సన్ భారతి ఎస్.సిహాగ్‌ను కలిసేందుకు ప్రయత్నించారు. వుడా వ్యవహారశైలితో గుర్రుగా ఉన్న  ఆమె వీసీకి కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదని తెలిసింది. దీంతో ఆగ్రహించిన వుడా అధికారులు ఈ నెల 6న ఎన్‌ఎండీసీకి కేటాయించిన స్థలాన్ని వెనక్కి చేసుకుంటామంటూ నోటీసులు  జారీ చేశారు. దీనిపై ఎన్‌ఎండీసీ ఉన్నతాధికారులు హైకోర్టుకు వెళ్లడంతో వుడా నిర్ణయాన్ని రద్దు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇక కేంద్ర గనులు, ఉక్కు శాఖ మంత్రి తోమర్  ఎన్‌ఎండీసీకి జరిగిన అన్యాయంపై  ప్రధాని నరేంద్రమోదీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ఓ పక్క కోర్టు అక్షింతలు, మరో పక్క కేంద్ర ప్రభుత్వ పెద్దల ఆగ్రహావేశాలతో  వుడా పరువు నట్టేట మునిగినట్టయిందని స్వయంగా వుడా వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.

 

మరిన్ని వార్తలు