ఉదయ్‌ ముహూర్తం కుదిరింది

22 Aug, 2019 10:33 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : ఉదయ్‌ రైలు పట్టాలెక్కేందుకు సర్వం సన్నద్ధమైంది. ఈ నెల 27న తొలి సర్వీసు విశాఖపట్నం నుంచి ప్రారంభం కానుంది. ఇటీవలే.. విశాఖలోని మర్రిపాలెం కోచింగ్‌ కాంప్లెక్స్‌ నుంచి కోరుకొండ వరకు ట్రయల్‌ రన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ఇప్పటికే బయలుదేరే వేళలు ఖరారు చేసిన వాల్తేరు డివిజన్‌ రైల్వే అధికారులు.. తాజాగా ప్లాట్‌ఫామ్‌లను కూడా కేటాయించారు. 22701/22702 ట్రైన్‌ నంబర్‌గా విశాఖ నుంచి విజయవాడకు ఉదయ్‌ నడవనుంది. వారానికి 5 రోజుల పాటు ఈ రైలు పరుగులు తీయనుంది.

ఆదివారం, గురువారం మినహాయించి సోమ, మంగళ, బుధ, శుక్ర, శనివారాల్లో విశాఖ నుంచి ఉదయం 5.45 గంటలకు ఈ డబుల్‌ డెక్కర్‌ రైలు బయలుదేరి 10.50కి విజయవాడ చేరుకోనున్న ఈ రైలు(22701)కు ఆరో నంబర్‌ ప్లాట్‌ఫామ్‌ కేటాయించారు. అదేవిధంగా విజయవాడ నుంచి సాయంత్రం 5.45కి బయలుదేరి రాత్రి 11 గంటలకు విశాఖ చేరుకోనున్న రైలు(22702)కి ఒకటో నంబర్‌ ప్లాట్‌ఫామ్‌ కేటాయించారు.

ప్రయాణానికి అనుకూలం..
విశాఖపట్నం నుంచి రాష్ట్ర రాజధాని నగరం విజయవాడకు రద్దీ ఎక్కువగా ఉంది. ఉదయ్‌ పేరుతో కేటాయించిన డబుల్‌ డెక్కర్‌ రైలు(ట్రైన్‌ నం. 22701/22702)ని వాల్తేరు డివిజన్‌ నుంచి భువనేశ్వర్‌కు తరలించేందుకు ఈస్ట్‌ కోస్ట్‌ అధికారులు ప్రయత్నాలు చేశారు. ఈ ట్రైన్‌ నిర్వహణకు సరైన సిబ్బంది వాల్తేరు డివిజన్‌లో లేరనే సాకు చూపిస్తూ.. ఉదయ్‌ రైలుని తరలించేందుకు కుయుక్తులు పన్నారు. కానీ.. జిల్లా వైఎస్సార్‌సీపీ ఎంపీలు కేంద్రంతో పోరాడటంతో విశాఖ నుంచే కొనసాగించాలని నిర్ణయించారు. దీంతో ఉదయ్‌ను నడిపేందుకు అవసరమైన సిబ్బందిని ఈస్ట్‌ కోస్ట్‌ కేటాయించింది.

ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో నడవనున్న ఈ రైలుకి అవసరమైన సిబ్బందిని సంసిద్ధుల్ని చేసేందుకు డివిజన్‌కు చెందిన ఏడుగురు  సిబ్బందిని పంజాబ్‌లోని కపుర్తలా కోచ్‌ ఫ్యాక్టరీలో శిక్షణ అందించారు. వివిధ స్టేషన్ల నుంచి విశాఖ మీదుగా వెళ్తున్న రైళ్లతో పాటు విశాఖ నుంచి బయలుదేరే ట్రైన్లు కలిపి మొత్తం రోజుకు 107 వరకు అందుబాటులో ఉన్నాయి. పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకొని ఉదయ్‌ని కేటాయించారు. ఈ ట్రైన్‌ సర్వీసు ప్రారంభమైతే, రద్దీ విపరీతంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. విశాఖ నుంచి విజయవాడకు వ్యాపారులు, ఉద్యోగులు భారీ సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటారు. అలాంటి వారందరి ప్రయాణానికి ఈ డబుల్‌ డెక్కర్‌ ట్రైన్‌ అనువైందిగా భావిస్తున్నారు.

కేంద్ర సహాయమంత్రి చేతుల మీదుగా...
ఉదయ్‌ డబుల్‌ డెక్కర్‌ రైలు ప్రారంభోత్సవానికి రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్‌ అంగడి హాజరవుతారని రైల్వే వర్గాలు తెలిపాయి. 26వ తేదీన విశాఖకు రానున్న మంత్రి సురేష్, 27 ఉదయం 5.45కి ఉదయ్‌ తొలి సర్వీసుని ప్రారంభించనున్నట్లు సమాచారం. అయితే ఈ పర్యటన వాయిదా పడే అవకాశాలున్నాయని అధికారిక వర్గాలు చెబుతున్నాయి.

ప్రత్యేకలివీ...

  • ఉదయ్‌ డబుల్‌ డెక్కర్‌ ట్రైన్‌ అయినా అనేక ప్రత్యేకతలతో కూడుకున్నది. 2 పవర్‌ కార్‌లు, 8 డబుల్‌ డెక్కర్‌ ఛైర్‌ కార్స్‌ ఉన్నాయి.
  • అన్ని కోచ్‌లనూ సాన్‌రాక్‌ (సెంటర్‌ బఫర్‌ కప్లర్స్‌తో) అనుసంధానం చెయ్యడం వల్ల ప్రయాణ సమయంలో ఎలాంటి జర్క్‌లు ఉండవు
  •  అన్ని కోచ్‌ల్లో డిస్క్‌ బ్రేక్‌లతో పాటు ఫెయిల్యూర్‌ ఇండికేషన్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ని ఏర్పాటు చేశారు. దీని వల్ల ఏ చిన్న సమస్య తలెత్తినా వెంటనే సమాచారం అందుతుంది.
  • ప్రతి కోచ్‌లోనూ రెండు బయో టాయిలెట్స్‌ ఉన్నాయి. సబ్బులు కూడా అందుబాటులో ఉంచనున్నారు.
  • తదుపరి స్టేషన్‌ వివరాలు, ప్రయాణం వేగం.. ఇతర వివరాలు ప్రయాణికులకు తెలిపేందుకు ప్రతి కోచ్‌లోనూ 6 డిస్‌ప్లే మానిటర్స్‌ ఉన్నాయి.
  •  చిన్న పొగ వచ్చినా.. వెంటనే సమాచారం అందేలా అన్ని కోచ్‌లలోనూ వెస్‌డా యంత్రాలు అమర్చారు
  •  ఇందులో ఏర్పాటు చేసిన సీటింగ్‌ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ వంటివి అమర్చారు.
  •   ప్రయాణీకులకు వినోదం కోసం ఎల్‌సీడీ స్క్రీన్లు, వైఫై సౌకర్యంతో పాటు జీపీఎస్‌ ఆధారిత పాసింజర్‌ సమాచార వ్యవస్థ ఏర్పాటు చేశారు.
  •  ప్రతి మూడో కోచ్‌ తర్వాత పాంట్రీ, డైనింగ్‌ ఏరియా ఏర్పాటు చేశారు.
  •   ఆటోమేటిక్‌ ఫుడ్, టీ, కాఫీ వెండింగ్‌ మెషీన్లున్నాయి.
  •  స్టెయిన్‌లెస్‌ స్టీల్‌తో తయారుచేసిన ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు అమర్చారు.
  •  6 కోచ్‌లు 120 సీటింగ్‌ సామర్థ్యంతోనూ, మిగిలినవి పాంట్రీతో కూడిన కోచ్‌లుగా 104 సీటింగ్‌ సామర్ధ్యంతో ఉన్నాయి.
మరిన్ని వార్తలు