26న ఉదయ్‌ రైలు ప్రారంభం?

18 Sep, 2019 11:09 IST|Sakshi

 విశాఖ, విజయవాడ మధ్యలో 7 స్టేషన్లలో హాల్టులు

విశాఖలో ప్రారంభించనున్న కేంద్ర మంత్రి

సాక్షి, విశాఖపట్నం: రెండు నెలలుగా ఊరిస్తున్న ఉత్కృష్ట డబుల్‌ డెక్కర్‌ ఎయిర్‌ కండిషన్డ్‌ యాత్రీ ఎక్స్‌ప్రెస్‌(ఉదయ్‌) ఎట్టకేలకు పట్టాలెక్కనుంది. ఈ నెల 26వ తేదీన కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్‌ అంగడి చేతుల మీదుగా ఉదయ్‌ సర్వీసు ప్రారంభమయ్యే అవకాశం ఉందని వాల్తేరు డివిజన్‌ అధికారిక వర్గాలు వెల్లడించాయి. 26వ తేదీ ఉదయం 10 నుంచి 11 గంటల ప్రాంతంలో విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో లాంఛనంగా ప్రారంభించనున్నట్లు సమాచారం. 27వ తేదీ నుంచి ముందుగా ప్రకటించినట్లుగానే 22701/22702 ట్రైన్‌ నంబర్‌గా విశాఖ నుంచి విజయవాడకు ఉదయ్‌ నడవనుందని తెలిసింది. వారానికి 5 రోజుల పాటు ఈ రైలు పరుగులు తీయనుంది.

ఆదివారం, గురువారం మినహాయించి సోమ, మంగళ, బుధ, శుక్ర, శనివారాల్లో విశాఖ నుంచి ఉదయం 5.45 గంటలకు ఈ డబుల్‌ డెక్కర్‌ రైలు బయలుదేరి 10.50కి విజయవాడ చేరుకోనుంది. అదేవిధంగా విజయవాడ నుంచి సాయంత్రం 5.45కి బయలుదేరి రాత్రి 11 గంటలకు విశాఖ చేరుకుంటుంది. దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం స్టేషన్లలో స్టాపేజ్‌ హాల్ట్‌లు ఇచ్చారు. తొమ్మిది ఏసీ డబుల్‌ డెక్కర్‌ కోచ్‌లు, రెండు మోటర్‌ పవర్‌ కార్లతో ఉదయ్‌ రైలు నడవనుందని వాల్తేరు డివిజన్‌ అధికారులు తెలిపారు. వాస్తవానికి ఆగస్టు 26వ తేదీన ఉదయ్‌ ప్రారంభించేందుకు సన్నాహాలు చేశారు. అయితే.. కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ మరణించడంతో ఈ రైలు ప్రారంభాన్ని వాయిదావేశారు. అప్పటి నుంచి రైలు ఎప్పుడు ప్రారంభమవుతుందోనని విశాఖ, విజయవాడ ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని వార్తలు