‘ఉదయ్‌’ వచ్చేసింది..

14 Aug, 2019 08:09 IST|Sakshi

ట్రయల్‌ రన్‌ సక్సెస్‌

కోరుకొండ వరకూ వెళ్లిన డబుల్‌ డెక్కర్‌

తొలి పరుగు త్వరలోనే..

విజయవాడ డివిజన్‌ నుంచి టైమ్‌ స్లాట్‌ రాకపోవడంతో ఆలస్యం

ఉదయ్‌ పట్టాలెక్కింది. వాల్తేరు డివిజన్‌ అధికారులు నిర్వహించిన ట్రయల్‌ రన్‌లో ఫస్ట్‌ క్లాస్‌లో పాసైంది. ఉదయం 9.55 గంటలకు బయలుదేరిన ఈ డబుల్‌ డెక్కర్‌ ట్రైన్‌ 11.45 గంటలకు కోరుకొండ స్టేషన్‌కు చేరుకుంది. మరో వారం రోజుల్లో ఉదయ్‌ ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. రాకపోకల వేళలు ఖరారైనప్పటికీ విజయవాడ డివిజన్‌ నుంచి టైమ్‌ స్లాట్‌ రాకపోవడంతో ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారు.

సాక్షి, విశాఖపట్నం, తాటిచెట్లపాలెం: 27 రోజుల సుదీర్ఘ కాలయాపన తర్వాత ఉత్కృష్ట డబుల్‌ డెక్కర్‌ ఎయిర్‌ కండిషన్డ్‌ యాత్రీ ఎక్స్‌ప్రెస్‌(ఉదయ్‌) ట్రయల్‌ రన్‌ జరిగింది. విశాఖపట్నం నుంచి విజయవాడకు కొత్త రైలుకు రైల్వే శాఖ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన నేపథ్యంలో ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. తొలుత ట్రయల్‌ రన్‌ నిర్వహించకుండా నేరుగా ప్రారంభించేందుకు వాల్తేరు డివిజన్‌ అధికారులు సన్నాహాలు చేశారు. ఉదయ్‌కు సంబంధించి 18 డబుల్‌ డెక్కర్‌ కోచ్‌లు, 4 పవర్‌ కార్లు వచ్చాయి. ఇందులో 9 కోచ్‌లను, 2 పవర్‌ కార్లను రెండు వారాల క్రితం చెన్నై పంపించారు. ఈ కోచ్‌లు విశాఖ–విజయవాడ మార్గంలోనే పంపించడంతో దాన్నే ట్రయల్‌ రన్‌గా తొలుత భావించారు. కానీ ఉన్నతాధికారులు మాత్రం కచ్చితంగా ట్రయల్‌ రన్‌ నిర్వహించాలని ఆదేశించడంతో మంగళవారం ఉదయం మర్రిపాలెంలోని కోచింగ్‌ కాంప్లెక్స్‌ నుంచి ట్రయల్‌ నిర్వహించారు. తొలుత విజయనగరం వరకు పంపించాలని భావించినా చివరి నిమిషంలో కోరుకొండ వరకూ మాత్రమే ఉదయ్‌ రైలు నడిపారు.


ట్రయల్‌ రన్‌ ఇలా....
ఉదయం 9.55 గంటలకు మర్రిపాలెం కోచింగ్‌ కాంప్లెక్స్‌ నుంచి ఉదయ్‌ డబుల్‌ డెక్కర్‌ బయలుదేరింది. ఈ ట్రయల్‌ రన్‌ను ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే చీఫ్‌ ఇంజినీర్, డివిజనల్‌ ఎలక్ట్రికల్‌ ఇంజినీర్, కోచ్‌ డిపో ఆఫీసర్‌ పర్యవేక్షించారు. 11.45 గంటలకు కోరుకొండ చేరుకుంది. కోరుకొండ నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు తిరుగు ప్రయాణమై.. 3.30 గంటలకు మర్రిపాలెం కోచింగ్‌ కాంప్లెక్స్‌కు చేరుకుంది. ట్రయల్‌ రన్‌లో ఎక్కడా ఎలాంటి అవరోధాలు ఎదురవ్వలేదని అధికారులు తెలిపారు.

ఇంకా కుదరని ముహూర్తం..
వాల్తేరు డివిజన్‌ నుంచి ప్రతిష్టాత్మకంగా నడవనున్న ఉదయ్‌ రైలు పట్టాలెక్కే సుమహూర్తం ఇంకా కుదరలేదు. ఏ సమయంలో నడపాలన్న వేళల్ని వాల్తేరు రైల్వే అధికారులు ధృవీకరించినా.. ఎప్పటి నుంచి సర్వీస్‌ ప్రారంభించాలన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. విజయవాడ డివిజన్‌ నుంచి తేదీ ఇంకా ఖరారు చెయ్యకపోవడం వల్లే.. ఆలస్యమవుతోందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. ఆ డివిజన్‌ నుంచి స్పష్టమైన ప్రకటన మరో వారం రోజుల్లో వచ్చేస్తుందని వాల్తేరు అధికారులు భావిస్తున్నారు. పది రోజుల్లోపే ఉదయ్‌ పట్టాలపై పరుగులు పెట్టే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని చెబుతున్నారు. 22701/22702 ట్రైన్‌ నంబర్‌గా విశాఖ నుంచి విజయవాడకు ఉదయ్‌ నడపనున్నారు. వారానికి 5 రోజుల పాటు ఈ రైలు పరుగులు తీయనుంది. ఆది, గురువారాలు మినహాయించి సోమ, మంగళ, బుధ, శుక్ర, శనివారాల్లో విశాఖ నుంచి ఉదయం 5.45 గంటలకు ఈ డబుల్‌ డెక్కర్‌ రైలు బయలుదేరి 10.50 గంటలకు విజయవాడ చేరుకోనుంది. అదేవిధంగా విజయవాడ నుంచి సాయంత్రం 5.45కి బయలుదేరి రాత్రి 11 గంటలకు విశాఖ చేరుకోనుంది.

ట్రయల్‌ రన్‌ విజయవంతంపై హర్షం..
ఉదయ్‌ సర్వీసు ప్రారంభమైతే, రద్దీ విపరీతంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. విశాఖ నుంచి విజయవాడకు వ్యాపారులు, ఉద్యోగులు భారీ సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటారు. అ లాంటి వారందరికీ ఈ డబుల్‌ డెక్కర్‌ సరైన ట్రైన్‌గా భావిస్తున్నారు. త్వరగా ఉదయ్‌ సర్వీసు ప్రా రంభించాలని విశాఖ ప్రజలు ట్రయల్‌ రన్‌ విజయవంతం కావడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు