మరింత వేగంగా ఉద్దానం ప్రాజెక్టు

18 Jul, 2020 13:08 IST|Sakshi

‘మేఘా’ సంస్థకు నిర్మాణ బాధ్యతలు

రూ.700 కోట్లతో 807 గ్రామాలకు తాగునీరు అందేలా చర్యలు

త్వరలోనే ప్రారంభం కానున్న పనులు

2051నాటి జనాభాకు వినియోగపడేలా అంచనాలు

శ్రీకాకుళం,అరసవల్లి: ఉద్దానం మంచినీటి ప్రాజెక్టును ‘మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌(హైదరాబాద్‌) సంస్థ దక్కించుకుంది. ప్రతిష్టాత్మకమైన ఉద్దానం ప్రాంతంలో శాశ్వత మంచినీటి పథకం నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిధుల మంజూరు, పనులకు చెందిన పరిపాలన ఆమోదాన్ని కూడా ప్రకటించింది. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ రోగులకు ఎన్నాళ్ల నుంచో వేధిస్తున్న మంచినీటి సమస్యకు ఈవిధంగా రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపింది. ఈ మేరకు రూ.700 కోట్లతో ఉద్దానంలో ప్రతి ఇంటికి మంచినీటిని అందించేలా ప్రత్యేక ప్రాజెక్టును నిర్మించేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవలే పారదర్శకంగా నిర్వహించిన టెండర్లను ప్రముఖ నిర్మాణ సంస్థ ‘మేఘా’ దక్కించుకుంది. పనులు పూర్తయితే ఉద్దాన ప్రాంతంలో ఉన్న మొత్తం ఏడు మండలాల్లో  807 గ్రామాలకు స్వచ్ఛమైన తాగునీరు అందనుంది. ఏపీ తాగునీటి సరఫరా సంస్థ (ఏపీడీడబ్ల్యూఎస్‌సీ) ఆధ్వర్యంలో ఉద్దానం తాగునీటి ప్రాజెక్టు పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి.

హిరమండలమే ప్రధాన నీటి వనరుగా....
ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ ప్రాజెక్టును మొదట్లో రేగులపాడు వద్ద ఉన్న ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ నుంచి ప్రధాన నీటి వనరుగా గుర్తించినప్పటికీ సాంకేతిక కారణాలతో తాజాగా హిరమండలం బీఆర్‌ఆర్‌ వంశధార ప్రాజెక్టును ఖరారు చేశారు. ఈ సోర్స్‌ సెంటర్‌ నుంచి సుమారు 19.2 టీఎంసీల నీటిని వినియోగించేలా ప్రాజెక్టును డిజైన్‌ చేశారు. దీంతో ఉద్దాన ప్రాంతంలోని ఇచ్ఛాపురం మండలంలో 45 గ్రామాలు, కంచిలిలో 138, కవిటిలో 118, సోంపేటలో 74, మందసలో 225, పలాసలో 86, వజ్రపుకొత్తూరులో 121 గ్రామాలకు మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. కిడ్నీ సంబంధిత రోగాలతో ఉద్దాన ప్రాంత ప్రజలు నిత్యం అవస్థలు పడుతున్న సంగతి విదితమే. వీరికి పూర్తి స్థాయిలో ఆరోగ్య పరిస్థితులు మెరుగయ్యేందుకు సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి ఈ ప్రాజెక్టు నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. 

2051 నాటి అవసరాలకు అనుగుణంగా...:
ఉద్దాన ప్రాంత పరిధిలో 2011 నాటి జనాభా లెక్కల ప్రకారం తాజా ప్రాజెక్టు ద్వారా మొత్తం ఏడు మండలాల్లోని 807 గ్రామాల్లోని సుమారుగా 4,69,157 మందికి ప్రస్తుతానికి మంచినీటి అవసరాలు తీరనున్నాయి. అయితే భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా 2051 నాటికి ఇదే ప్రాంతంలో సుమారు 7,82,707 మంది జనాభాకు ఈ ప్రాజెక్టు ద్వారా మంచినీటిని వినియోగించుకునేలా డిజైన్‌ చేశారు. ఈ మేరకు మేఘా సంస్థ త్వరలోనే నిర్మాణ పనులను ప్రారంభించనుంది. ఏడు మండలాలతో పాటు పలాస–కాశీబుగ్గ, ఇచ్ఛాపురం మున్సిపాల్టీల్లోనూ తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.

మరిన్ని వార్తలు