విభజించు - పాలించు అనే రీతిలో కాంగ్రెస్ వ్యవహారం: ఉద్ధవ్ థాకరే

25 Nov, 2013 20:26 IST|Sakshi
విభజించు - పాలించు అనే రీతిలో కాంగ్రెస్ వ్యవహారం: ఉద్ధవ్ థాకరే

దేశాన్ని సర్వనాశనం చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందదని శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే అన్నారు. వాళ్లకు ఎలా నచ్చితే అలాచేస్తున్నారని, దీన్ని తాము నిరసిస్తున్నామని ఏపీ విభజనను తాము కూడా వ్యతిరేకిస్తున్నామని ఉద్ధవ్ థాకరే తెలిపారు. ప్రత్యేక విదర్భకు తాము వ్యతిరేకమని, జగన్‌ చెప్పినట్టు ఆర్టికల్‌ 3ని కేంద్రం దుర్వినియోగం చేయకూడదని ఆయన అన్నారు. అవసరమైతేనే రాష్ట్ర విభజన చేయాలని, ఆర్టికల్‌-3లో సవరణలు చేయాలని, రాష్ట్ర విభజనకు తీర్మానాన్ని తప్పనిసరిగా అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని థాకరే డిమాండ్ చేశారు.

అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించిన తర్వాతనే పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టాలని, అసెంబ్లీ ఆమోదించాకే పార్లమెంటుకు తీర్మానం వెళ్లాలని థాకరే చెప్పారు. ఢిల్లీలో అధికారంలో ఉన్నవాళ్లు విభజించు - పాలించు అనే రీతిలో చూస్తున్నారని, బ్రిటిష్‌ వారి విధానాన్ని కాంగ్రెస్‌ అమలు చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణ బిల్లు వస్తే తాము పార్లమెంట్‌లో నిరసన వ్యక్తం చేస్తామని, మహారాష్ట్రను విభజించడానికి తము వ్యతిరేకం అని ఆయన స్పష్టం చేశారు.

థాకరే మద్దతు ఇస్తామన్నారు: వైఎస్ జగన్

రాష్ట్ర విభజన ప్రక్రియను స్తంభింపచేసేలా మద్దతు ఇచ్చేందుకు శివసేన చీఫ్ ఉద్ధవ్‌ థాకరే అంగీకరించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు.  కొత్త రాష్ట్రాలు ఏర్పడితే గతంలో అసెంబ్లీలో తీర్మానాలు చేశారని ఆయన గుర్తు చేశారు. ఈ రోజు ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ ను, ఉద్ధవ్‌ ఠాక్రేను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్టికల్-3ని సవరించడానికి ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలిపారు. లోక్‌సభలో 270 మంది మద్దతున్న ఏ పార్టీ అయినా వాళ్ల వాళ్ల ప్రయోజనాల కోసం ఏ రాష్ట్రాన్నైనా విభజిస్తారని తెలిపారు. అందుకనే ఆర్టికల్‌ -3ని సవరించాలని తాము ఒత్తిడి తెస్తున్నామన్నారు. మొదటిసారిగా దేశంలో ఎప్పుడూ సంభవించనిది ఇప్పుడు జరిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలో తొలిసారిగా ఓట్లు, సీట్లకోసం కాంగ్రెస్‌పార్టీ విభజనకు పాల్పడుతోందన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉద్ధవ్‌ సహా అందరి సహకారం కోరుతున్నామన్నారు.

రేపు మహారాష్ట్ర, ఎల్లుండి కర్ణాటక, ఆ తర్వాత తమిళనాడునూ విభజిస్తారని మండిపడ్డారు. 2/3 మెజార్టీతో అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించడం తప్పనిసరి అవుతుందని జగన్ తెలిపారు. అధికారంలోకి రామని తెలిస్తే ఏ పార్టీ అయినా విభజనకు దిగడానికి పూనుకుంటుందని, ప్రాంతీయంగా ఉన్న భావోద్వేగాలతో ముడిపెట్టి ఇలాంటి ఆట ఆడటానికి ప్రతీ పార్టీ సిద్ధపడుతుందని తెలిపారు.

మరిన్ని వార్తలు