వైభవంగా ఉగాది ఆస్థానం

1 Apr, 2014 03:18 IST|Sakshi
వైభవంగా ఉగాది ఆస్థానం

ఆలయంలో పంచాంగ శ్రవణం
శ్రీవారికి నూతన పట్టువస్త్రాల సమర్పణ
మహాభారతం గ్రంథావిష్కరణ

 
 సాక్షి, తిరుమల : జయనామ సంవత్సరాదిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం ఉగాది ఆస్థానం వైభవంగా నిర్వహించారు. వేకువజామున సుప్రభాతం, తోమాల సేవ శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. తర్వాత ఉదయం 6 గంటలకే బంగారు వాకిలిలో సర్వభూపాల వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామిని వేంచేపు చేశారు. ఆలయ పెద్ద జీయరు, చినజీయరు, చైర్మన్, ఈవో, జేఈవో సతీసమేతంగా నూతన పట్టువస్త్రాలు ప్రదర్శనగా తీసుకొచ్చి స్వామివారికి సమర్పించారు. అనంతరం శాస్రోక్తంగా ఆస్థానం పూజలు నిర్వహించారు. స్వామివారి పాద పద్మాల వద్ద ఉంచిన నూతన సంవత్సర పంచాంగాన్ని ఆస్థాన సిద్ధాంతి శ్రవణం చేశారు.
 
 నూతన సంవత్సర ఫలితాలు, లాభ నష్టాలు, నవగ్రహాలు, సస్యవృద్ధి, పశువృద్ధి, 27నక్షత్ర జాతకుల కందాయ ఫలాలు, రాజ పూజ్యం, అవమానాలు స్వామివారికి వినిపించారు. కాగా, ఆలయం మహద్వారం నుంచి గర్భాలయం వరకు సంప్రదాయ పుష్పాలు, పలు రకాల పండ్లతో చేసిన ప్రత్యేక అలంకరణలు భక్తులను విశేషం గా ఆకట్టుకున్నాయి. ధ్వజస్తంభం, బలిపీఠం అలంకరణతో పాటు పండ్లు, కూరగాయలతో ఏర్పాటు చేసిన దశావతారాలు, వివిధ పశుపక్ష్యాదుల ఆకృతులు భక్తులను మైమరపించాయి. కార్యక్రమం అనంతరం టీటీడీ పునఃముద్రించిన ‘కవిత్రయ మహాభారతం’ గ్రంథాన్ని చైర్మన్, ఈవో, జేఈవోలు ఆవిష్కరించారు.

మరిన్ని వార్తలు