లెక్కివ్వకుండా సంబరాలా?

8 Apr, 2016 11:56 IST|Sakshi

 సంక్రాంతి సంబరాలకు వెచ్చించిన డబ్బుకే దిక్కులేదు..
 అప్పట్లో ఒక్కో ఎంపీడీఓ రూ.50 వేలు చేతి నుంచి పెట్టుకున్న వైనం
  ఆ డబ్బుల కోసం ఇప్పటికీ ఎదురు చూపు
  తాజాగా ఉగాది సంబరాలు నిర్వహించాలంటూ ఆదేశం
  మండలానికి రూ.20 వేలు ఖర్చు చేయాలని సూచన
  స్మార్ట్ విలేజ్, జీపీడీపీ కార్యక్రమాల బకాయిలూ అందలేదు..
  ఇలాగైతే ఎలా అంటూ లబోదిబోమంటున్న ఎంపీడీఓలు

 
ప్రొద్దుటూరు : ఉగాది సంబరాలను శుక్రవారం ఘనంగా నిర్వహించాలని ఉన్నట్లుండి గురువారం ఆదేశాలు రావడంతో ఎంపీడీఓలు అసహనానికి గురవుతున్నారు. అన్ని మండల కేంద్రాల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు దుర్ముఖి నామ సంవత్సర ఉగాది ఉత్సవాలు నిర్వహించాలని వైఎస్ఆర్ జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ శ్వేత నుంచి ఆదేశాలు జారీ కావడంతో ఎంపీడీఓలు ఆందోళనకు గురయ్యారు. కనీసం రెండు రోజులు ముందైనా సమాచారం అందజేస్తే బావుండేదని, ఉన్నపళంగా చెబితే ఏర్పాట్లు ఎలా చేయాలని అధికారులు ఒకరినొకరు చర్చించుకుంటున్నారు. చుట్టుపక్కల జిల్లాల్లో మూడు రోజుల ముందుగానే ఎంపీడీఓలకు జిల్లా అధికారులు సమాచారం ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవానికి ఉగాది ఉత్సవాలను నిర్వహించాలని ప్రభుత్వం గత నెల 28న జీఓ ఆర్‌టీ నెంబర్ 97ను జారీ చేసింది.

అయితే ఇంత వరకు మండల అధికారులకు ఈ సమాచారం అందలేదు. గురువారం సాయంత్రం 3.30 గంటల నుంచి ఎంపీడీఓ, తహశీల్దార్లు, మండల స్థాయి అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివిధ అభివృద్ధి అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారని ముందుగా ఆదేశాలు రావడంతో అధికారులంతా ఆయా తహశీల్దార్ కార్యాలయాల్లో నిమగ్నమయ్యారు. అదే సమయంలో  ఎంపీడీఓలకు ఉగాది ఉత్సవాల సమాచారం మెయిల్ ద్వారా అందింది. ఇప్పటికిప్పుడు ఆదేశాలు జారీ చేసి ఉత్సవాలు నిర్వహించమనడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ సందర్భంగా ఆదేశాలు అందుకున్న అధికారులు కొంత సమయం అయిపోగానే వీడియో కాన్ఫరెన్స్ నుంచి బయటికి వచ్చి ఏర్పాట్లల్లో నిమగ్నమయ్యారు.

ఉగాది ఉత్సవాల నిర్వహణకు పురోహితుల ఏర్పాటు, ప్రజాప్రతినిధుల ఆహ్వానం కోసం ఫోన్‌లలో బిజీగా గడిపారు. వాస్తవానికి తమ యూనియన్ బలంగా లేకపోవడం వల్లే ఇలా జరుగుతోందని, పక్క జిల్లాల్లో ముందుగా సమాచారం అందించగా, ఇక్కడ 24 గంటలు కూడా సమయం ఇవ్వకుండా ఆదేశాలు జారీ చేయడం ఏమిటని ఈ సందర్భంగా ఓ ఎంపీడీఓ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల కారణంగానే ఇప్పటికే జిల్లాలో ఓ ఎంపీడీఓ మరో విభాగానికి వెళ్లారని, మరొకరు కూడా అదే ప్రయత్నాల్లో ఉన్నారని జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్‌లో పనిచేస్తున్న ఓ ఎంపీడీఓ తెలిపారు. గత ఏడాది ఎంపీడీఓస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మురళీమోహన్ ఆత్మహత్యాయత్నం చేసుకుని కర్నూలు జిల్లాకు బదిలీపై వెళ్లిన తర్వాత నూతన కమిటీని ఎన్నుకోవడంలో జాప్యం జరుగుతోంది. తమలో తాము మాట్లాడుకున్నా ఇంకా యూనియన్‌ను అధికారికంగా ప్రకటించలేదన్న విష యం కూడా  చర్చకు వచ్చింది. ఉగాది ఉత్సవాల నిర్వహణకు మండలానికి రూ.20 వేలు, మున్సిపాలిటీలు ఉన్న మండలానికి రూ.25 వేలు చొప్పున ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నట్లు ఆదేశాలు జారీ అయ్యాయి.

ఈ ప్రకారం పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనం, హంస ఉగాది పురస్కారాలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఎంపీడీఓ, తహశీల్దార్, మున్సిపల్ కమిషనర్, మండల అగ్రికల్చర్ ఆఫీసర్, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్‌తోపాటు ఇతర మండలాధికారులతో కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ ఉత్సవాలకు ఎంపీపీలు, మున్సిపల్ చైర్‌పర్సన్‌లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, వార్డు కౌన్సిలర్లను ఆహ్వానించాలని తెలిపారు. ఈ ప్రకారం పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనానికి రూ.5 వేలు, కళాజాత నిర్వహణకు రూ.5 వేలు, ఉగాది పచ్చడికి రూ.1000, మిగిలిన మొత్తం ఇతర ఏర్పాట్లకు కేటాయించారు. సంబంధిత బిల్లులు, ఓచర్లు కలెక్టర్ కార్యాలయానికి సమర్పించాలని వారం లోపు డబ్బు విడుదల చేస్తామని సూచించారు. ఉగాది పురస్కారాలు ఏ విధంగా ఇవ్వాలన్న విషయంపై ఉత్తర్వుల్లో స్పష్టత లేదు.

 ఇప్పటికీ అందని సంక్రాంతి సంబరాల బకాయిలు
ప్రభుత్వం జనవరిలో అన్ని మండల కేంద్రాలతోపాటు గ్రామ పంచాయతీల పరిధిలో సంక్రాంతి సంబరాలను నిర్వహించింది. ఇందులో భాగంగా జనవరి 11న గ్రామ పంచాయతీల్లో, 12న మండల కేంద్రాల్లో పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా చాలా ప్రాంతాల్లో ఎంపీడీఓలు నగదు బహుమతులు అందజేశారు. ఈ ప్రకారం మండలానికి రూ.25 వేలు, మున్సిపాలిటీలు ఉన్న మండల కేంద్రాలకు రూ.30 వేలు చొప్పున మంజూరు చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా పశు ప్రదర్శన, మేలు జాతి పశువుల ఎంపిక, గాలి పటాల పోటీలు, కబడ్డీ పోటీలు, వంటకాల పోటీలు, రంగవళ్లుల పోటీలు నిర్వహించారు. ఇందుకు సంబంధించి ప్రతి మండలానికి రూ.లక్ష  వరకు ఖర్చు చేశారు. ఇంత వరకు ఈ డ బ్బు ఎంపీడీఓలకు అందలేదు.

గత నెలలో స్మార్ట్ విలే జి, స్మార్ట్ వార్డు కార్యక్రమాలకు సంబంధించి మండల కేంద్రాల్లో ఎంపీడీఓల అధ్యక్షతన అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఇందుకోసం మండలానికి రూ.25 వేల వరకు కేటాయించారు. మండల స్థాయి అధికారులు, జన్మభూమి కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు   హాజరయ్యారు. వీరికి ఒక్కొక్కరికి రూ.110 చొప్పున కేటాయించినట్లు తెలుస్తోంది. ప్రతి గ్రామ పంచాయతీ నుంచి 15 మందిని ఆహ్వానించి శిక్షణా శిబిరాలను నిర్వహించారు. ఈ ప్రకారం ప్రతి సభ్యునికి భోజనంతోపాటు పెన్ను, పుస్తకం తదితర వాటికి రూ.150 చొప్పున ప్రభుత్వం కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ ప్రకారం ఎంపీడీఓలు రూ.35 వేల వరకు ఖర్చు చేశారు. ఈ డబ్బును ఎంపీడీఓలే చేతి నుంచి ఖర్చు చేశారు. వీరికి ప్రభుత్వం డబ్బు చెల్లించాల్సి ఉంది. పాత బకాయిలు ఇవ్వకుండానే ప్రస్తుతం మళ్లీ ఉగాది ఉత్సవాలు అనే సరికి వారికి గుబులు పట్టుకుంది.
 
 

 

>
మరిన్ని వార్తలు