చదువునూ దాచుకోవచ్చు!

17 Dec, 2019 04:25 IST|Sakshi

త్వరలో నేషనల్‌ అకడమిక్‌ క్రెడిట్‌ బ్యాంకు ఏర్పాటు

కొత్త విధానానికి యూజీసీ శ్రీకారం

ఆటంకం లేకుండా ఇష్టమైన కోర్సులు చదువుకోవచ్చు

ఒక కోర్సు చేస్తూనే ఆన్‌లైన్లో మరో కోర్సు నేర్చుకునే వెసులుబాటు

విద్యార్థుల క్రెడిట్లు బ్యాంకులో నమోదు

సాధారణ బ్యాంకు మాదిరిగా ఇందులోనూ అకౌంట్లు

20లోగా అభిప్రాయాల సమర్పణకు అవకాశం

సాక్షి, అమరావతి: బీఏ సెకండియర్‌లో ఉన్న ఓ విద్యార్థికి ఆ చదువు మధ్యలో ఉండగానే మంచి అవకాశాలున్న మరో కోర్సుకు వెళ్లాలనిపించింది.. ఇష్టంలేకున్నా తల్లిదండ్రుల ఒత్తిడితో డిగ్రీలో చేరిన మరో విద్యార్థి అక్కడ చదవలేక తనకు నచ్చిన మరో కోర్సుకు వెళ్లాలనుకున్నాడు....వీరిద్దరూ తమకు నచ్చిన మరో కోర్సుకు వెళ్లాలనుకుంటే నిబంధనల ప్రకారం ప్రస్తుతం చదువుతున్న కోర్సులను పూర్తిగా వదులుకోవాల్సిందే. దీనివల్ల వారు చదివిన రెండేళ్లు వృధా అయినట్లే. ఇలా విలువైన సమయాన్ని విద్యార్థులు కోల్పోకుండా కొత్త కోర్సులు చదివేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) ‘నేషనల్‌ అకడమిక్‌ క్రెడిట్‌ (ఎన్‌ఏసీ) బ్యాంకు’కు శ్రీకారం చుట్టబోతోంది. విద్యార్థులు ప్రస్తుత కోర్సులో సాధించిన క్రెడిట్లను దాచుకుని తమకు నచ్చిన ఇతర కోర్సుల్లో ప్రవేశించేందుకు ఈ కొత్త విధానం తోడ్పాటునందిస్తుంది. అంటే.. ఆ కోర్సు పూర్తయ్యాక మళ్లీ పాత కోర్సును పూర్తిచేసేందుకు ఈ విధానం వీలు కల్పించనుంది. ఇలా ఉన్నత విద్యారంగంలో ప్రస్తుత నిబంధనలను విద్యార్థులకు అనుకూలంగా యూజీసీ సరళీకరించనుంది. దీనిపై ఇటీవల నిపుణుల బృందం అందించిన విధానపత్రాన్ని యూజీసీ విడుదల చేసింది. అందులో ఏముందంటే..

ఏయే కోర్సులు ఈ స్కీం పరిధిలోకి వస్తాయంటే..
యూజీ, పీజీ కోర్సులన్నీ దీని పరిధిలోకి రానున్నాయి. అయితే, ముందుగా పీజీ స్థాయిలో ఈ విధానాన్ని ప్రారంభించి యూజీకి విస్తరింపచేయాలని యూజీసీకి ఇచ్చిన విధాన పత్రంలో నిపుణుల కమిటీ పేర్కొంది. అలాగే, వృత్తివిద్యా కోర్సులకు సంబంధించి సాంకేతికపరమైన సమస్యలు ఉన్నందున ప్రస్తుతానికి వాటికి చేపట్టరాదని సూచించింది. అదే మాదిరిగా ఎంబీఏ, ఎంసీఏ, ఎమ్మెస్సీ కోర్సులను కూడా దీని నుంచి మినహాయించింది. క్రెడిట్ల ఆధారంగా విద్యార్థి నుంచి ఎన్‌ఏసీ బ్యాంకు రుసుము వసూలు చేయనుంది.

20లోగా అభిప్రాయాలు పంపాలి 
విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ కొత్త విధానంపై తమ అభిప్రాయాలను ఈనెల 20లోగా ‘nacb. ugc@gmail. com’కు పంపించాలని యూజీసీ పేర్కొంది.

బ్యాంకు కార్యకలాపాలు ఇలా.. 
►క్రెడిట్ల క్రోడీకరణ
►క్రెడిట్ల బదలాయింపు 
►క్రెడిట్లను విముక్తి చేయడం లేదా విడుదల చేయడం 
►క్రెడిట్ల ప్రారంభ, ముగింపు నిల్వలను మదింపు చేయడం

విద్యార్థులు నచ్చినట్లుగా చదువుకోవచ్చు 
►సంప్రదాయ కోర్సుల స్థానే కొత్త కోర్సులను, పాఠ్యాంశాలను రూపొందిస్తున్న నేపథ్యంలో తమకు నచ్చిన కోర్సులు అవసరమైన సమయంలో చదివేందుకు ఈ కొత్త విధానం విద్యార్థులకు స్వేచ్ఛనివ్వనుంది.  
►డిజిటల్, ఆన్‌లైన్, వర్చ్యువల్‌ కోర్సులతో పాటు వేరే కాలేజీల్లో చేరి ఇతర కోర్సులు చదివేందుకు ఈ కొత్త విధానం అవకాశమిస్తుంది. 
►ఒక కోర్సు పూర్తిచేయకుండానే మధ్యలో అంతవరకు సాధించిన క్రెడిట్లను ఎన్‌ఏసీ బ్యాంకులో దాచుకుని ఇతర కోర్సులో చేరవచ్చు. ఈ బ్యాంకు.. సాధారణ బ్యాంకు మాదిరిగా విద్యార్థులకు డిపాజిట్‌ అకౌంట్లు ఇస్తుంది. విద్యార్థి కొత్త కోర్సుల్లో సాధించిన క్రెడిట్లు ఈ బ్యాంకు ఖాతాలోకి మళ్లించి క్రెడిట్‌ ఖాతాను వృద్ధి చేసుకోవచ్చు. 
►దేశంలోని అన్ని ఉన్నత విద్యా సంస్థలు 
ఈ బ్యాంకులో భాగస్వాములు కానున్నాయి. తద్వారా ఆయా విద్యార్థులకు సంబంధించిన క్రెడిట్‌ ఖాతాల నిర్వహణ ఒకసంస్థ నుంచి మరో సంస్థకు మారినా ఇబ్బంది లేకుండా కొనసాగింపునకు అవకాశముంటుంది. 
►అలాగే, ఎన్‌ఏసీ బ్యాంకు నేషనల్‌ అకడమిక్‌ డిపాజిటరీ (ఎన్‌ఏడీ)కి అనుసంధానమై ఉంటుంది. 
►విద్యార్థులు తమ క్రెడిట్లను తిరిగి తీసుకుని తమ పాత కోర్సుల్లో ఇతర సెమిస్టర్లను పూర్తిచేసి కొత్త క్రెడిట్లను దానికి జోడించేందుకు ఆస్కారం కల్పించనున్నారు. 
►ప్రాంతాలు, భాషలతో సంబంధం లేకుండా విద్యార్థులు తమకు నచ్చిన సమయంలో తమకు నచ్చిన సంస్థల్లో నైపుణ్యం కలిగిన గురువుల వద్ద చదువులు కొనసాగించేందుకు వీలు 
కలుగుతుంది. 
►బ్యాంకు ఎలాంటి సర్టిఫికెట్లు ఇవ్వదు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సీఎం జగన్‌తో ఎంపెడా చైర్మన్‌ భేటీ

ఏపీలో 190కి చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు

'వైద్య పరికరాల ఉత్పత్తిలో మెడ్‌టెక్‌ కీలకం'

కరోనా : సీఎం జగన్‌ వీడియో సందేశం

'బాబు.. నీ బోడి సలహాలు అవసరం లేదు'

సినిమా

దండంబెట్టి చెబుతున్నా.. దండతో గోడెక్కకు

ఇది బిగ్గెస్ట్ ఫ్యాన్ మూమెంట్: త‌మ‌న్

కరోనా: క‌నికాకు బిగ్‌ రిలీఫ్‌

అందరూ ఒక్కటై వెలుగులు నింపండి: చిరు, నాగ్‌

కరోనా క్రైసిస్‌: శివాని, శివాత్మిక ఉదారత

ప్రధాని పిలుపుపై రామ్‌ చరణ్‌ ట్వీట్‌