కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో స్పష్టత కరువు..

4 May, 2017 15:40 IST|Sakshi
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో స్పష్టత కరువు..

హైదరాబాద్‌ : మిర్చిపై కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన అమలు జరగడం లేదని ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. మిర్చి కొనుగోళ్లపై కేంద్రం అనేక షరతులు పెట్టిందని ఆయన వ్యాఖ్యానించారు. ఉమ్మారెడ్డి గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... కేంద్రం ధరపై స్పష్టత లేదని మార్కెటింగ్‌ కమిషనర్‌ చెబుతున్నారని, ఒకవేళ పంట కొనుగోళ్లు చేసినా స్టోరేజీ చేయడానికి గోడౌన్లు ఖాళీ లేవని చెబుతున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో స్పష్టత కరువైందని ఆయన అన్నారు. రైతుల జీవితాలంటే ఇంత ఆషామాషీగా ఉందా అని ఉమ్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

హెరిటేజ్‌ స్టోర్‌లో 200 గ్రాముల మిర్చికి రూ.44 వసూలు చేస్తున్నారని, ఆ లెక్కన క్వింటాల్‌ ధరరూ.22వేలు అవుతుందన్నారు. అదే రైతుకిస్తున్నది రూ.4వేలు అని, హెరిటేజ్‌లో అమ్ముతున్నది రూ.22వేలా? అని సూటిగా ప్రశ్నించారు. ఇక రిలయన్స్‌ దుకాణాల్లో 200 గ్రాముల మిర్చి రూ.71 ...దాని ప్రకారం క్వింటాల్‌ ధర రూ.35వేలు అవుతుందన్నారు.

దేశంలో రోజుకు 34మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు నివేదికలు చెబుతున్నాయి, అయినా ప్రభుత్వాలకు చీమ కుట్టినట్లు కూడా లేదని ఉమ్మారెడ్డి అన్నారు. మిర్చి క్వింటాల్‌కు రూ.10వేలు చొప్పున కొనుగోళ్లు చేసి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు